విజయ్‌ మాల్యా.. పరారైన నేరగాడే | Special court declares Vijay Mallya a fugitive economic offender | Sakshi
Sakshi News home page

విజయ్‌ మాల్యా.. పరారైన నేరగాడే

Published Sun, Jan 6 2019 3:58 AM | Last Updated on Sat, Apr 6 2019 9:07 PM

Special court declares Vijay Mallya a fugitive economic offender - Sakshi

విజయ్‌మాల్యా; మాల్యాకు చెందిన ఇండియన్‌ ఎంప్రిస్‌ నౌక

ముంబై: భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు మరోషాక్‌ తగిలింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్‌ఈవో)గా గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం–2018 కింద దేశ, విదేశాల్లోని మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలవుతుంది. ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్‌ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా మాల్యా నిలిచారు.

ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ న్యాయవాది డి.ఎన్‌.సింగ్‌ వాదిస్తూ.. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించామని తెలిపారు. అక్కడి న్యాయస్థానం సైతం మాల్యాను భారత్‌కు అప్పగించాలని తీర్పు ఇచ్చిందన్నారు. కానీ విజయ్‌మాల్యా మాత్రం భారత్‌కు రావడం ఇష్టపడటం లేదనీ, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని మాల్యా లాయర్లు ఖండించారు. చట్టప్రకారం మాల్యా లండన్‌ కోర్టు ముందు లొంగిపోయారనీ, ఆతర్వాత బెయిల్‌ పొందారని కోర్టుకు చెప్పారు. ఫోర్స్‌ ఇండియా జట్టు డైరెక్టర్‌ హోదాలో వరల్డ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ సమావేశంలో పాల్గొనేందుకు బ్రిటన్‌ వెళ్లారని, ఈడీ చెబుతున్నట్లు మాల్యా రహస్యంగా వెళ్లలేదని తెలిపారు.  

స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
ఇరుపక్షాల వాదనలు విన్న అక్రమ నగదు చెలామణి  నిరోధక(పీఎంఎల్‌ఏ) కోర్టు జడ్జి ఎం.ఎస్‌.అజ్మీ స్పందిస్తూ.. ‘ఎఫ్‌ఈవో చట్టంలోని సెక్షన్‌ 12(ఐ) కింద ఈడీ చేసిన దరఖాస్తును పాక్షికంగా మన్నిస్తున్నాం. విజయ్‌మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తున్నాం. ఆయన ఆస్తుల జప్తు ఫిబ్రవరి 5 నుంచి మొదలవుతుంది’ అని ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే మాల్యా తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు తీర్పు పూర్తి కాపీని అందుకునేందుకు, ఎగువ కోర్టులో అప్పీలుకు వీలుగా ఈ ఆదేశాలపై 4 వారాల స్టే ఇవ్వాలన్నారు. దీంతో ఎఫ్‌ఈవో చట్టం కింద పనిచేస్తున్న కోర్టు తన ఉత్తర్వులపై తానే స్టే ఇచ్చుకోలేదని స్పష్టం చేశారు. రూ.100 కోట్లు, అంతకుమించి మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యక్తులు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయినప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గుచూపకపోతే ఎఫ్‌ఈవోఏ చట్టం కింద వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తారు.

మా చొరవ వల్లే..: బీజేపీ
ఎన్డీయే ప్రభుత్వం చొరవ కారణంగానే ముంబైలోని కోర్టు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా తెలిపారు. మాల్యా లాంటి రుణఎగవేతదారులను అరికట్టేందుకు, చట్టం ముందు నిలబెట్టేందుకే ఎన్డీయే ప్రభుత్వం పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం(ఎఫ్‌ఈవోఏ)–2018 తీసుకొచ్చిందని వెల్లడించారు.

అన్నింటికీ బీజేపీ గొప్పలు: కాంగ్రెస్‌
అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ విషయంలో క్రెడిట్‌ తీసుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. పారిపోయే ముందు మాల్యా కేంద్ర మంత్రి జైట్లీని కలిసి అనుమతి తీసుకున్నారంది. ‘తమ వల్లే మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా కోర్టు ప్రకటించిందని బీజేపీ నేతలు భావిస్తే అలాగే కానివ్వండి. మంగళ్‌యాన్, పోఖ్రాన్‌–1 అణుపరీక్షలు.. ఇలా అన్ని విషయాల్లో క్రెడిట్‌ అంతా తమదేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. తామొచ్చాకే అన్నీ జరిగాయని వాళ్లు భావిస్తున్నారు. ఈ లెక్కన 2019, మే 26న భారత్‌ తన ఐదో బర్త్‌డే చేసుకోవాలి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

వినోదాల కోసం రెండు నౌకలు
మాల్యా అంటేనే విందు వినోదాలకు పెట్టింది పేరు. తరచూ భారీ పార్టీలు ఇస్తూ ఉంటారు. దీని కోసం ఆయన ఏకంగా రెండు నౌకలనే కొనుగోలు చేశారు. హెలికాప్టర్‌లు కూడా దిగడానికి వీలుండే ఈ నౌకల్లో రెండు మెర్సెడెస్‌ కార్లను కూడా పార్క్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఇక వాటిల్లో ఉండే సౌకర్యాలు ఒక్క మాటలో చెప్పలేం. బార్లు, జిమ్, వైద్యశాల, బ్యూటీ పార్లర్, సమావేశ మందిరాలు అన్నీ అందులోనే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్టీలను మాల్యా ఈ నౌకల్లోనే ఇచ్చారు. డచ్‌ షిప్‌యార్డ్‌కు చెందిన ఒక నౌకను మాల్యా 9.3 కోట్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధ సినీనటులు సర్‌ రిచర్డ్‌ బర్టన్, ఎలిజబెత్‌ టేలర్‌ వంటివారు వినియోగించిన క్లజిమా అనే మరో నౌక కూడా మాల్యాకు ఉంది. 1995లో సుమారు కోటి డాలర్లు పెట్టి దీన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ రెండు నౌకల్లో మాల్యా ఇచ్చే పార్టీలకు వీవీఐపీలు సైతం క్యూ కట్టేవారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement