possession
-
మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 1 వరకు పోలీసు బృందాల తనిఖీల్లో మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.103 కోట్ల నగదు పట్టుబడగా ఈసారి ఎన్నికల నగదు స్వాదీనంలో 248 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు శనివారం డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 11,859 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
మొయినాబాద్‌లో రూ.7.5 కోట్లు పట్టివేత
మొయినాబాద్/సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ మొయినాబాద్‌లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శనివారం సాయంత్రం అజీజ్‌నగర్ రెవెన్యూలోని ఓ మట్టి రోడ్డులో ఏకంగా ఆరు కార్లలో తరలిస్తున్న రూ.7.5 కోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కార్లలో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు తరలిస్తున్న కార్ల నంబర్లు టీఎస్ 36 కె 3030, టీఎస్ 07 జేకే 4688, టీఎస్ 09 ఈడబ్ల్యూ 3747, ఏపీ 39 ఏఎం 4442, టీఎస్ 02 ఎఫ్ఈ 8332, టీఎస్ 09 జీబీ 5841. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఐటీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డబ్బులను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని.. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు. కార్లను మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో నుంచి బయటకొచ్చిన కార్లు? మొయినాబాద్‌లో నగదు తరలిస్తూ పట్టుబడిన కార్లు ఓ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అజీజ్‌నగర్ రెవెన్యూలో విద్యా సంస్థ నిర్వహిస్తున్న ఆ సంస్థ చైర్మన్ హిమాయత్‌సాగర్ జలాశయం ఒడ్డునే నివాసముంటున్నట్లు సమాచారం. ఆ ఇంట్లో నుంచి కార్లు బయటకు రాగానే విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు కార్లను పట్టుకున్నట్లు తెలిసింది. కార్లలో డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాలు మాత్రం తెలియలేదు. కార్లు పట్టుబడింది ఓ మంత్రి డెయిరీ ఫాం పక్కనే కావడం విశేషం. ఆ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో ఐటీ సోదాలు? కాగా ఆ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో ఐటీ అధికారులు శనివారం రాత్రి సోదాలు చేపట్టినట్టు సమాచారం. అక్కడి ఇంటితో పాటు ఐటీ అధికారులు, పోలీసులు సదరు చైర్మన్‌కు సంబంధించిన ఫుట్ బాల్ అకాడమీ, క్రికెట్ అకాడమీ కార్యాలయాల్లో సైతం సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కార్లలో పట్టుబడిన ఆ సొమ్ముతో సదరు సంస్థకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. -
ఒకే రోజు రూ.78 కోట్ల జప్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రికార్డు స్థాయిలో రూ.78.03 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.243.76 కోట్లకు పెరిగిపోయింది. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.87.92 కోట్లు. ఒక్క రోజు 6వేల లీటర్ల మద్యం జప్తు తాజాగా రూ.1.21 కోట్లు విలువ చేసే 6132 లీటర్ల మద్యం జప్తు చేశారు. దీంతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం మద్యం 65,223 లీటర్లు కాగా, దీని విలువ రూ.10.21 కోట్లు. గురువారం రూ.16.77లక్షలు విలువ చేసే 103.165 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న గంజాయి 2950 కిలోలకు పెరిగింది. దీని విలువ రూ.7.72 కోట్లు. ఇప్పటి వరకు మరో రూ.7.72 కోట్లు విలువ చేసే ఇతర మత్తు పదార్థాలను జప్తు చేశారు. గురువారం రూ.57.67 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. 83కిలోల బంగారం పట్టివేత అందులో 83.046 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.120.40 కోట్లకు ఎగబాకింది. ఇందులో 181 కిలోల బంగారం, 693కిలోల వెండి, 154.45 క్యారెట్ల వజ్రాలున్నాయి. గురువారం రూ.8.84 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను పట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన ఇలాంటి వస్తువుల విలువ రూ.17.84 కోట్లకు చేరింది. హైవేపై రూ.750 కోట్ల నగదు కలకలం అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై ఏకంగా రూ.750 కోట్ల నగదు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ’’రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కేరళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ యూబీఐకి నగదును బదిలీ చేస్తున్నట్టు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది. ఈ మేరకు జిల్లా నుంచి ఆర్డీఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీఎస్పీ అధికారులు విచారణ చేసేందుకు స్పాట్‌కు వెళ్లి, నగదుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్‌తో నగదును హైదరాబాద్‌లోని యూబీఐకి చేరినట్లు నిర్ధారణ చేసుకున్నాము’’’ అని క్రాంతి ఆ ప్రకటనలో వివరించారు. అయితే ఎంత మేరకు నగదు ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
టాలీవుడ్ తెరపై మరో డ్రగ్ మరక
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్ ఫ్లాట్‌లో చిక్కిన వారిలో ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డి ఉండగా... గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఐసీసీసీలో టీఎస్–నాబ్ ఎస్పీ (వెస్ట్) డి.సునీతా రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నాప్‌చాట్‌లో గాడ్ హెడ్స్ పేరుతో... నెల్లూరుకు చెందిన బి.బాలాజీ గతంలో ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశాడు. కంటికి తీవ్రమైన గాయం కావడంతో మెడికల్లీ అన్‌ఫిట్ అయ్యాడు. దీంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచుగా హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్‌లో రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా ఇతడికి హైదరాబాద్‌తో పా టు బెంగళూరు డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఏర్ప డ్డాయి. దీంతో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌ల్లో రేవ్ పార్టీలు ఏర్పాటు నిర్వహించేవాడు. స్నాప్‌చాట్‌లో గాడ్ హెడ్స్ పేరుతో ఐడీ క్రియేట్ చేసి దీని ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ యాప్‌లో మెసేజ్ చదవగానే డిస్‌అప్పియర్ అయ్యే ఆప్షన్ ఉండటంతోపాటు కస్టమర్లకు ప్రత్యేక కోడ్లు ఇవ్వడం ద్వారా దందా సాగించాడు. గత నెల 31న ఇతడితోపాటు రమణారెడ్డి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పని చేస్తున్న డి.మురళిని అరెస్టు చేశారు. వీరిని విచారించడంతో ఈ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. నైజీరియన్ల ద్వారా రామ్ కిషోర్‌కు... బాలాజీ ముగ్గురు నైజీరియన్లతోపాటు నగరానికి చెందిన రామ్ కిషోర్ వైకుంఠం (పరారీలో ఉన్నాడు) నుంచి డ్రగ్స్ ఖరీదు చేసేవాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమోబీ చికోడి మొనగాలు, ఇక్బావే మైకేల్, థామస్ అనఘకాలు నుంచి బాలాజీకి కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ అందుతున్నాయి. డ్రగ్ పార్టీల నిర్వహణకు బాలాజీకి రమణా రెడ్డి ఫైనాన్స్ చేస్తుండేవాడు.ఇతడికి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఖాతా ఉంది. ఇందులో ప్రస్తుతం రూ.5.5 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు రమణారెడ్డి, బాలాజీలకు ఉన్న ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. వీటిని స్వాధీనం చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన 18 మంది కస్టమర్లలో సినీ రంగానికి చెందిన వారితోపాటు పబ్‌లు, స్నూకర్ పార్లర్ల నిర్వా హకులు ఉన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్‌లో టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో నిర్వహించే అర్జున్, గుంటూరులో స్నూకర్ పార్లర్ నిర్వహించే పీఎస్ కృష్ణ ప్రణీత్ కీలకం. వీరు తమ సంస్థల్లోనే రహస్య గదులు ఏర్పాటుచేసి డ్రగ్స్ వినియోగానికి సహకరిస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లు ఆఫ్ చేసుకున్న నవ్‌దీప్, రవి బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారూ ఉన్నట్లు టీఎస్ నాబ్ గుర్తించింది. హీరో నవదీప్, షాడో, రైడ్ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావ్ కుమారుడు సురేశ్ రావ్, ఇంద్రతేజ్, కార్తీక్‌లతోపాటు కలహర్‌రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు బెంగళూరులో జరిగిన డ్రగ్ పార్టీకి హాజరయ్యారనే విషయం 2021లో వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించింది. ఈ పార్టీ నిర్వాహడుకు కలహర్రెడ్డే కావడం గమనార్హం. మరోపక్క ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేసిన 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు ఉంది. నిందితుల కోసం ఏసీపీ కె.నర్సింగ్‌రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్, కానిస్టేబుల్ సత్యనారాయణ తదితరుల బృందం గాలించింది. అమోబీ చికోడి, ఇక్బావే మైకేల్, థామస్‌తోపాటు సురేశ్ రావ్, కొల్లి రామ్‌చంద్, కూరపాటి సందీప్, అనుగు సుశాంత్ రెడ్డి, కృష్ణ ప్రణీత్‌లను పట్టుకుంది. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. నవదీప్, రవి ఉప్పలపాటి సహా మిగిలిన నిందితులు తమ ఫోన్లు ఆఫ్ చేసుకుని, కుటుంబంతో సహా పరారయ్యారు. -
దుబాయ్ టు సిటీ.. గోల్డ్ స్మగ్లింగ్
సాక్షి, హైదరాబాద్:ఆదివారం రూ.1.25 కోట్ల విలువైన 2 కేజీలు.. శనివారం రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోలు.. గురువారం రూ.33.53 లక్షల విలువైన 553 గ్రాములు..మంగళవారం రూ.93.26 లక్షల విలువైన 1.52 కేజీలు.. ఈ నెల 6న రూ.1.18 కోట్ల విలువైన 1.92 కేజీలు.. 4న రూ.28 లక్షల విలువైన 461 గ్రాములు.. 2న రూ.82.42 లక్షల విలువైన 1.34 కిలోలు.. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న బంగారం లెక్కలు ఇవి. నగరానికి పెద్దయెత్తున బంగారం అక్రమ రవాణా అవుతుండటం కస్టమ్స్ అధికారులనే కలవరపరుస్తోంది. ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు మొత్తం రూ.9.66 కోట్ల విలువైన 15.79 కేజీల బంగారం పట్టుబడగా..ఇందులో 95 శాతానికి పైగా దుబాయ్ నుంచి తెచ్చిందే కావడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా గణనీయంగా పెరుగుతోంది. కిలోకు రూ.5 లక్షల లాభం విదేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలంటే పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 మాత్రమే ఉండేది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడికి ఉన్న ప్రతి 15 రోజుల సరాసరి ధరను పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం చెల్లించేలా కేంద్రం నిబంధనలు సవరించింది. ఈ కారణంగానే బంగారం స్మగ్లింగ్ పెరుగుతుండగా..దొంగ రవాణా విజయవంతమైతే అన్ని ఖర్చులూ పోనూ స్మగ్లర్లకు కిలోకు కనిష్టంగా రూ.5 లక్షల లాభం ఉంటున్నట్లు తెలుస్తోంది. టికెట్లు కొనిచ్చి.. విదేశాలకు పంపి.. బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవాణాకు పాల్పడటం ద్వారా పెద్దయెత్తున లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థల యజమానులు, రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులతో పాటు పాత నేరగాళ్లు సైతం క్యారియర్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా ప్రారంభించారు. మధ్యవర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీకి యువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టికెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేటప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరినే సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలుస్తున్నారు. స్మగ్లర్లకు స్వర్గధామంగా దుబాయ్ దుబాయ్‌లో ఆదాయపుపన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్ అన్నదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడినుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి, దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకువస్తున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దాన్ని విమానంలోకి తీసుకువచ్చేటప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు. దీన్ని ఆసరాగా చేసుకునే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. జోరుగా రెక్టమ్ కన్సీల్మెంట్.. చాలామంది స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మైబైల్ చార్జర్స్ లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తర్వాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తేవడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రెక్టమ్ కన్సీల్మెంట్ కూడా జోరుగా జరుగుతోంది. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు సూత్రధారులు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని అక్కడ దాచిపెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. క్లెయిమ్ చెయ్యకుంటే వేలం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95 శాతం ప్రొఫైలింగ్ పదర్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం తదితరాలను పరిగణలోకి తీసుకుంటారు. బయటి రాష్ట్రాల పాస్‌పోర్టులు కలిగిన వారు ఇక్కడ లాండ్ అయినా అనుమానిస్తారు. బంగారం స్మగ్లింగ్ వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్ బంగారం తనదే అని క్లైమ్ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైల్లో కస్టమ్స్ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం వేయడం ద్వారా విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. రియాద్ నుంచి వయా మస్కట్ శంషాబాద్ (హైదరాబాద్): రియాద్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రియాద్ నుంచి వయా మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న షేక్‌ఖాజా, షేక్‌జాని అనే ఇద్దరు ప్రయాణికులు కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని లాంజ్‌లోని సిటీసైడ్ ఏరియాలోకి వచ్చారు. వారి కదలికలను అనుమానించిన సీఐఎస్ఎఫ్ అధికారులు మరోసారి లగేజీని ఈకో–5 యంత్రంలో తనిఖీ చేశారు. దీంతో డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లో ఉంచిన కిలో బరువు కలిగిన బంగారు గొలుసులు బయటపడ్డాయి. దీంతో నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. -
మూడొంతులు గల్లంతు!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దులో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్ దర్గాకు సుమారు 500 ఎకరాల భూమి ఉంది. చాలావరకు భూమి సాగులో ఉంది. 2008లో వక్ఫ్‌బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఇలావుండగా సర్వే నంబర్ 82/అ/1/1లోని ఆరు ఎకరాలకు సంబంధించి ఒక రైతు పేరిట 2018లో పట్టాదారు పాస్‌బుక్ జారీ అయింది. తర్వాత తప్పిదాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2021లో పాస్‌బుక్‌ను రద్దు చేశారు. అయితే అప్పటికే సదరు రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన రియల్టర్లు రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించగా నిషేధిత జాబితా కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు హెచ్ఎండీఏఅధికారులు అవగాహన రాహిత్యంతో భూమికి లే అవుట్ పర్మిషన్స్ (ఎల్పీ) నంబర్ జారీ చేయడంతో, ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కోసం సదరు రియల్టర్లు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వక్ఫ్ భూములు యథేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వక్ఫ్‌బోర్డు సిబ్బందే స్థిరాస్తి వ్యాపా రులతో కుమ్మక్కై రికార్డులు తారు మారు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వం కూడా వీటిని రెవెన్యూ భూములుగా పేర్కొంటూ అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందనే విమర్శలున్నాయి. మరోవైపు లీజులకు ఇచ్చిన భూములు సైతం క్రమంగా చేజారిపోతున్నాయి. నిజాం కాలం నుంచి వక్ఫ్ ఆస్తుల రికార్డులు ఉర్దూ, పార్సీ భాషల్లో ఉండగా, భద్రపరచాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన పర్మినెంట్ సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం అక్రమార్కులకు కలిసి వస్తోంది. నామమాత్రపు చర్యలే.. వక్ఫ్‌బోర్డు రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని దర్గాలు, మసీదులు, ఆషూర్ ఖానాలు, చిల్లాలతో పాటు స్మశానవాటికలు తదితరాల (మొత్తం 33,929) కింద సుమారు 77,588.07 ఎకరాల భూమి ఉంది. అందులో మూడొంతులు అంటే.. ఏకంగా 57,423.91 ఎకరాలు (74 శాతం) ఆక్రమణలో ఉండటం విస్మయం కలిగించే అంశం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అధిక శాతం భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. మెదక్‌లో దాదాపు పూర్తిగా పరాధీనమయ్యాయి. బోర్డు సుమారు 2,186 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినా తదుపరి చర్యలు ముందుకు సాగలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో కబ్జాలపై ఉక్కుపాదం కోసం రెవెన్యూ, పోలీసు, వక్ఫ్ బోర్డు అధికారులతో కూడిన ఒక టాస్‌్కఫోర్స్ ఏర్పాటైనా చలనం మాత్రం లేదు. మరోవైపు రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని రికార్డుల గదికి ఐదేళ్లుగా తాళం చిప్ప వేలాడుతోంది. అవినీతి ఆరోపణలు దష్ట్యా సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కీలక రికార్డులను స్వా«దీనం చేసుకొని రికార్డు రూమ్‌ను సీజ్ చేశారు. అది ఇప్పటివరకు తెరుచుకోక పోవడంతో సుమారు 3,400 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు కేసులు సరైన ఆధారాలు లేక వీగిపోయాయి. కబ్జాల పర్వం.. ♦ నల్లగొండ జిల్లా దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూమిలో సుమారు 83 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ♦ మల్కాజిగిరిలో హజరత్ మీర్ మెహమూద్ సాహబ్ పహాడి దర్గాకు సర్వే నంబర్ 659, 660లో సుమారు మూడు ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఈ భూమిపై తిష్ట వేశాడు. ఫెన్సింగ్ వేసి ప్లాటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. ♦ చిల్లా కోహ్–ఎ–మౌలా–అలీకి మల్లాపూర్, కీసర రాంపల్లిలో సుమారు 232 ఎకరాల భూమి ఉండగా సగానికి పైగా భూబకాసురుల ఆక్రమణలో ఉంది. ♦ మణికొండ దర్గాకు 1,654 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులుండగా ప్రస్తుతం ఎకరం భూమి కూడా కన్పించడం లేదు. ♦ హకీముల్ మునవీ అల్ మారూఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్‌షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4,448 గజాలు, దర్గా నిర్వహణ కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని వక్ఫ్ చేయగా, ప్రస్తుతం దర్గా మినహా మిగతా భూమి ఉనికి లేకుండా పోయింది. ధారాదత్తం ఇలా.. ♦ ఐదో నిజాం రాజు అఫ్జల్ దౌలా మణికొండ గ్రామ పరిధిలో హుస్సే¯న్ షావలి దర్గాకు 1,898 ఎకరాలు రాసిచ్చారు. 1959లో గెజిట్ కూడా విడుదల అయ్యింది. అయితే రికార్డుల్లో సర్కారీ పేరుతో ఉన్న వక్ఫ్ భూముల్ని రెవెన్యూగా పేర్కొంటూ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ♦ పహడీషరీఫ్‌లో బాబా షర్ఫొద్దీన్ దర్గాకు మామిడిపల్లిలో 2,131 ఎకరాల భూమి ఉండగా, దీంట్లోంచి 1,051 ఎకరాల భూమిని వక్ఫ్‌బోర్డు అనుమతి లేకుండానే ప్రభుత్వం విమానాశ్రయానికి, మరో 91 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ♦ సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో ఈద్గాకు చెందిన సర్వే నంబర్ 290లోని 9.20 ఎకరాల భూమిని ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. న్యాయాధికారాలు ఉండాలి వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక న్యాయాధికారాలు ఉండాలి. వక్ఫ్, రెవెన్యూ భూములపై స్పష్టత రావాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. రికార్డులు గల్లంతు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అక్రమణలను తొలగించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలి. – అబుల్ పత్హే బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, పాలక మండలి సభ్యుడు, వక్ఫ్‌బోర్డు. హైదరాబాద్ రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి వక్ఫ్ భూముల రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి. కోర్టు వివాదాల్లోని భూములపై సమగ్ర ఆధారాలు సమర్పించే విధంగా చర్యలు అవసరం. అప్పుడే వక్ఫ్ భూముల పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. – సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేనీ, వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ గద్వాలలోని హజరత్ సయ్యద్ షా మరూఫ్ పీర్ ఖాద్రీ దర్గాకు 39.8 ఎకరాల భూమి ఉంది. సంగాలలోని సర్వే నంబర్ 95, 96, 97, 98లోని 27.9 ఎకరాల భూమిని దర్గా ముతవల్లి ద్వారా స్థానిక రైతు ఒకరు సాగు కోసం లీజుపై తీసుకున్నారు. తర్వాత ఆ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటంతో అతని సోదరుడు రెవెన్యూ శాఖ ద్వారా యాజమాన్య హక్కు సర్టిఫికెట్ (ఓఆర్సీ) పొందాడు. తర్వాత తన పేరిట మారి్పడి చేసుకొని ప్లాటింగ్‌కు ప్రయత్నించాడు. దర్గాకు చెందినవారి ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ కోర్టు ఓఆర్సీపై స్టే ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే విధించింది. -
మహిళల నరబలి ఘటన మరువక ముందే క్షుద్రపూజల కలకలం
గాంధీనగర్: కేరళలో మహిళల నరబలి ఘటన మరువక ముందే గుజరాత్లో మరో దారుణం వెలుగుచూసింది. కన్నతండ్రే క్షుద్రపూజలు చేసి 14ఏళ్ల కూతుర్ని చంపాడు. ఆమెకు గంటలపాటు నరకం చూపించి చావుకు కారణమయ్యాడు. గిర్ సోమ్‌నాథ్ జిల్లా ధవా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. భవేశ్ అక్బరీ అనే వ్యక్తి తన కూతురికి దెయ్యం పట్టిందని అనుమానించాడు. దీంతో ఆమెకు భూతవైద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు. పాత దుస్తులు ధరించమని ఇచ్చి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. భవేశ్తో పాటు అతని సోదురుడు దిలీప్ కూడా వెళ్లాడు. ఇద్దరు కలిసి పెద్ద మంట పెట్టారు. బాలిక జుట్టుకు కట్టె కట్టి ఆ మంటల ముందు రెండు కుర్చీల మధ్యన రెండు గంటలపాటు నిల్చోబెట్టారు. చాలా సేపు ఆమెకు ఆహారం, నీరు ఏమీ ఇవ్వలేదు. దీంతో ఈ నరకం భరించలేక బాలిక కన్నుమూసింది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా బాలిక మృతదేహాన్ని బ్లాంకెట్‌లో తీసుకెళ్లి తగలబెట్టారని పోలీసులు వెల్లడించారు. ఆధారాలు లేకుండా చేశారని పేర్కొన్నారు. బాలిక కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అక్బరీ కుటుంబం 6 నెలల క్రితమే సూరత్ నుంచి ఈ గ్రామానికి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. అక్బరీ గ్రామంలో ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని వెల్లడించారు. చదవండి: నరబలి ఉదంతం: చంపేసి ముక్కలు చేసి తిన్నారా? -
భారీ ఎత్తున గంజాయి స్వాధీనం
సాక్షి, కర్నూలు: విశాఖ వయా కర్నూలు టూ మహారాష్ట్ర ఇదేదో ఆర్టీసీ బస్సు అనుకుంటే పొరపాటే. గంజాయి రవాణా చేసే స్మగ్లర్లు (ముఠా) ఎంచుకున్న రూటు. మహారాష్ట్రలోని నాసిక్, సోలాపుర్ ప్రాంతాల్లో గంజాయికి అమితమైన డిమాండ్ ఉండడంతో విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నిత్యం రవాణా చేస్తూ స్మగ్లర్లు భారీగా సొమ్ము చేసుకొంటున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా వెంకన్న కుంట గ్రామానికి చెందిన సానబోయిన సాయికుమార్, హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ దర్గాబర్మాశ్ ప్రాంతంలో నివాసముంటున్న మహ్మమద్ మునావర్, మహారాష్ట్ర సితార జిల్లా శనివార పేట్ ప్రాంతానికి చెందిన ఖాజా ఖాన్, సమీర్, ముజాఫర్, కొరేగోన్ తాలుకా దుమ్ములవాడి గ్రామానికి చెందిన విశాల్ చంద్రకాంత్ షిండే, ఉత్తరాఖండ్ రాష్ట్రం చంపావత్ జిల్లా లోహగాట్ తాలుకా రాయ్‌నగర్ చౌడీకి చెందిన ఆదిత్యరాయ్ తదితరులు ముఠాగా ఏర్పడి, గంజాయిని రవాణా చేస్తూ పోలీçసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువ చేసే 651 కిలోల గంజాయి పాకెట్లతోపాటు మినీలారీ, రెండు కార్లు, రూ.20 వేల నగదు, ఐదు సెల్ఫోన్లను నాగలాపురం పోలీసులు స్వాధీనం చేసుకొని, జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి అడిషనల్ ఎస్పీ దీపికా పాటిల్ ఎదుట హాజరు పరిచారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు ఇన్చార్జ్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, కర్నూలు తాలుకా సీఐ పవన్‌కిశోర్, నాగలాపురం ఎస్ఐ కేశవతో కలిసి అడిషనల్ ఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్మగ్లర్లు ఇలా దొరికారు.. ఏపీ 16ఎక్స్6264 మినీ లారీకి డ్రైవర్ వెనుక సగభాగం ఐరన్ సీట్లో ప్రత్యేక కేబిన్ తయార్ చేసి పైభాగంలో గవాక్షం తరహాలో రంద్రం ఏర్పాటు చేసి, అందులో నుంచి రహస్య కేబిన్‌లోకి గంజాయి పాకెట్లను నింపి లారీ వెనుక భాగంలో ఖాళీ ప్లాస్టిక్ బాక్స్‌లు నింపారు. వెనుక ఒక కారు, ముందు కారులో ముఠా సభ్యులు లారీకి ఎస్కార్టుగా విశాఖ పట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి కర్నూలు మీదుగా మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరారు. ఈనెల 15న రూరల్ సీఐ పవన్‌కిశోర్ ఆధ్వర్యంలో నాగలాపురం పోలీసు స్టేషన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. లారీలో భారీ మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు అజ్ఞాత వ్యక్తుల నుంచి సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు విస్తృతం చేశారు. రెండు కార్ల మధ్య లారీ కాన్వాయ్ రూపంలో కర్నూలు వైపు నుంచి వేగంగా దూసుకొస్తుండగా పోలీసులు అప్రమత్తమై అడ్డుకొని సోదాలు చేశారు. లారీ వెనుక భాగంలో ఖాళీ ప్లాస్టిక్ బాక్స్‌లు కనిపించడంతో అందులో ఏమి లేవనీ.. నిర్ధారణకు వచ్చారు. కారులో సోదా చేయగా వెనుక డిక్కీ భాగంలో కొన్ని గంజాయి పొట్లాలు కనిపించాయి. వెంటనే అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకొని విచారించగా లారీకి ఏర్పాటు చేసిన రహస్య కేబిన్ గుటురట్టయింది. లారీ పైభాగం మొత్తం టార్పాలిన్‌తో కప్పి ఉండడంతో దానిని తొలగించారు. పైన సుమారు ఐదడుగుల విస్తీర్ణంలో రంధ్రం కనిపించింది. అందులోంచి లారీలోకి తొంగి చూడగా రహస్య కేబిన్‌లో గంజాయి పొట్లాలు భద్ర పరిచిన విషయం బయట పడింది. హైదరాబాద్ వైపు నిఘా పెరగడంతో.. మహారాష్ట్ర సితార జిల్లా శనివార్పేట్కు చెందిన ఖాజాఖాన్ కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాసిక్, సోలాపుర్ ప్రాంతాలకు రవాణా చేసేవాడు. ఇటీవల ఆ మార్గంలో పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి ముఠా రూటు మార్చుకుంది. విశాఖ నుంచి కర్నూలు మీదుగా రెండుసార్లు నాసిక్‌కు భారీ మొత్తంలో రవాణా చేసినప్పటికీ పోలీసుల నిఘాకు చిక్కలేదు.ఇదే సరైన మార్గమని భావించిన గంజాయి ముఠా మూడోసారి ఇదే మార్గంగుండా వెళ్తూ పోలీసుల నిఘాకు చిక్కారు. ముఠాలోని సభ్యులను లోతుగా విచారిస్తున్నామని, వారిచ్చే సమాచారం ఆధారంగా అండగా ఉన్న వ్యక్తుల సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్నందుకు సీఐ పవన్కిశోర్తోపాటు నాగలాపురం ఎస్ఐ కేశవ, సిబ్బందిని దీపికా పాటిల్ అభినందించారు. -
విజయ్ మాల్యా.. పరారైన నేరగాడే
ముంబై: భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు మరోషాక్ తగిలింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం–2018 కింద దేశ, విదేశాల్లోని మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలవుతుంది. ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్‌ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా మాల్యా నిలిచారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ న్యాయవాది డి.ఎన్.సింగ్ వాదిస్తూ.. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించామని తెలిపారు. అక్కడి న్యాయస్థానం సైతం మాల్యాను భారత్‌కు అప్పగించాలని తీర్పు ఇచ్చిందన్నారు. కానీ విజయ్‌మాల్యా మాత్రం భారత్‌కు రావడం ఇష్టపడటం లేదనీ, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని మాల్యా లాయర్లు ఖండించారు. చట్టప్రకారం మాల్యా లండన్ కోర్టు ముందు లొంగిపోయారనీ, ఆతర్వాత బెయిల్ పొందారని కోర్టుకు చెప్పారు. ఫోర్స్ ఇండియా జట్టు డైరెక్టర్ హోదాలో వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ సమావేశంలో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్లారని, ఈడీ చెబుతున్నట్లు మాల్యా రహస్యంగా వెళ్లలేదని తెలిపారు. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ ఇరుపక్షాల వాదనలు విన్న అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు జడ్జి ఎం.ఎస్.అజ్మీ స్పందిస్తూ.. ‘ఎఫ్ఈవో చట్టంలోని సెక్షన్ 12(ఐ) కింద ఈడీ చేసిన దరఖాస్తును పాక్షికంగా మన్నిస్తున్నాం. విజయ్‌మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తున్నాం. ఆయన ఆస్తుల జప్తు ఫిబ్రవరి 5 నుంచి మొదలవుతుంది’ అని ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే మాల్యా తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు తీర్పు పూర్తి కాపీని అందుకునేందుకు, ఎగువ కోర్టులో అప్పీలుకు వీలుగా ఈ ఆదేశాలపై 4 వారాల స్టే ఇవ్వాలన్నారు. దీంతో ఎఫ్ఈవో చట్టం కింద పనిచేస్తున్న కోర్టు తన ఉత్తర్వులపై తానే స్టే ఇచ్చుకోలేదని స్పష్టం చేశారు. రూ.100 కోట్లు, అంతకుమించి మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యక్తులు అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గుచూపకపోతే ఎఫ్‌ఈవోఏ చట్టం కింద వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తారు. మా చొరవ వల్లే..: బీజేపీ ఎన్డీయే ప్రభుత్వం చొరవ కారణంగానే ముంబైలోని కోర్టు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. మాల్యా లాంటి రుణఎగవేతదారులను అరికట్టేందుకు, చట్టం ముందు నిలబెట్టేందుకే ఎన్డీయే ప్రభుత్వం పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం(ఎఫ్‌ఈవోఏ)–2018 తీసుకొచ్చిందని వెల్లడించారు. అన్నింటికీ బీజేపీ గొప్పలు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ విషయంలో క్రెడిట్ తీసుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. పారిపోయే ముందు మాల్యా కేంద్ర మంత్రి జైట్లీని కలిసి అనుమతి తీసుకున్నారంది. ‘తమ వల్లే మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా కోర్టు ప్రకటించిందని బీజేపీ నేతలు భావిస్తే అలాగే కానివ్వండి. మంగళ్యాన్, పోఖ్రాన్–1 అణుపరీక్షలు.. ఇలా అన్ని విషయాల్లో క్రెడిట్ అంతా తమదేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. తామొచ్చాకే అన్నీ జరిగాయని వాళ్లు భావిస్తున్నారు. ఈ లెక్కన 2019, మే 26న భారత్ తన ఐదో బర్త్‌డే చేసుకోవాలి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వినోదాల కోసం రెండు నౌకలు మాల్యా అంటేనే విందు వినోదాలకు పెట్టింది పేరు. తరచూ భారీ పార్టీలు ఇస్తూ ఉంటారు. దీని కోసం ఆయన ఏకంగా రెండు నౌకలనే కొనుగోలు చేశారు. హెలికాప్టర్లు కూడా దిగడానికి వీలుండే ఈ నౌకల్లో రెండు మెర్సెడెస్ కార్లను కూడా పార్క్ చేసుకునే సదుపాయం ఉంది. ఇక వాటిల్లో ఉండే సౌకర్యాలు ఒక్క మాటలో చెప్పలేం. బార్లు, జిమ్, వైద్యశాల, బ్యూటీ పార్లర్, సమావేశ మందిరాలు అన్నీ అందులోనే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్టీలను మాల్యా ఈ నౌకల్లోనే ఇచ్చారు. డచ్ షిప్‌యార్డ్‌కు చెందిన ఒక నౌకను మాల్యా 9.3 కోట్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధ సినీనటులు సర్ రిచర్డ్ బర్టన్, ఎలిజబెత్ టేలర్ వంటివారు వినియోగించిన క్లజిమా అనే మరో నౌక కూడా మాల్యాకు ఉంది. 1995లో సుమారు కోటి డాలర్లు పెట్టి దీన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ రెండు నౌకల్లో మాల్యా ఇచ్చే పార్టీలకు వీవీఐపీలు సైతం క్యూ కట్టేవారు. -
నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్
ఆలేరు : నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జ్ డీసీపీ కె.నాగరాజు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆలేరు పట్టణంలోని సుభాష్‌నగర్, ఆదర్శనగర్‌లలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలతో పాటు ఒక రౌడీషీటర్‌ను, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న ఇరువురిపై ఎక్సైజ్ కేసు నమోదు చేశామని, 3 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతే కాకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలు నడిపే వారు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. రాత్రి 2గంటల నుంచి ఉదయం 6గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఏసీపీ శ్రీనివాసాచార్యులు, 8 మంది సీఐలు, 10మంది ఎస్ఐలు, 17 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 51 మంది సివిల్ పోలీసులు, 13 మంది మహిళ పోలీసులు, హోంగార్డులు, 34 మంది ఎఆర్, సీసీఎస్, క్లూస్‌టీం, ఎస్‌ఓటీలు పాల్గొన్నారు. -
గుట్కాప్యాకెట్ల స్వాధీనం
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ డివిజన్లో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణంలోని ఇస్లాంపుర వద్ద టూటౌన్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ పోలీసులకు తారసపడ్డారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ.1.60లక్షలు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మాడుగులపల్లి స్టేషన్ పరిధిలో తనిఖీలు చేయగా గుట్కా ప్యాకెట్లు దొరికాయి. వీటివిలువ రూ.3లక్షలు ఉంటుందన్నారు. ఈ ఘటనలో మిర్యాలగూడకు చెందిన ఎండి.ఫరూక్, గంధం వెంకటేశ్వర్లు, గంగవరం శేఖర్, గుండా కృష్ణ, మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పుచ్చకాయలగూడెంనకు చెందిన రాపాక శ్రీను, బుర్ల లింగయ్యలను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ టూటౌన్, రూరల్ సిఐ లు సాయి ఈశ్వర్‌గౌడ్, రమేష్‌బాబు, ఎస్ఐలు సురేష్‌గౌడ్, శేఖర్ పాల్గొన్నారు. -
బ్రెడ్ ప్యాకెట్ల మధ్యలో కరెన్సీ కట్టలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు నగర పోలీసులు చెక్ పెట్టారు. భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పాతబస్తీ వాసుల్ని అరెస్టు చేసి, వీరి నుంచి రూ.3.96 కోట్ల విలువైన ఏడు దేశాల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన స్ప్రే పెయింటర్ రవూఫ్ భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని దుబాయ్‌కి తరలిస్తున్నట్లు దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అం దింది. దీంతో నిఘా ఉంచిన అధికారులు రవూఫ్ బుధవారం అరబ్ ఎమిరేట్స్ విమానం ఎక్కుతు న్నట్లు గుర్తించారు. అప్పటికే అతడు తన లగేజ్‌ను చెక్ ఇన్‌లో వేసి ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కౌంటర్లు దాటి నట్లు నిర్థారించుకున్నారు. విమానాశ్రయం లోపలకు వెళ్లి చర్యలు తీసుకునే అధికారం టాస్క్‌ఫోర్స్‌కు లేకపోవడంతో కస్టమ్స్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ సిబ్బంది రవూఫ్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు లగేజ్ బెల్ట్‌పై ఉన్న బ్యాగ్‌ను వెనక్కు రప్పించారు. దాన్ని తెరిచి చూడగా అందులోని ఆరు కట్టల్లో ఏడు దేశాలకు చెందిన కరెన్సీ లభించింది. ఈ బండిళ్లను రవూఫ్ బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్ల మధ్యలో ఉంచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటిలో అమెరికన్ డాలర్లు, యూరోలతో పాటు సౌదీ, కువైట్, బెహరేన్, ఒమన్ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. తనకు ఈ డబ్బును మొఘల్పురకే చెందిన మెహరేన్ అందించాడని, దుబాయ్‌లో ఉండే అబ్దుల్లాకు చేరిస్తే రూ.15 వేల కమీషన్, విమాన టిక్కెట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడని రవూఫ్ అంగీకరించాడు. మెహరేన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనను దించి వెళ్లినట్లు ఇతడు చెప్పాడు.దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెహరేన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. రవూఫ్‌తోనే ఫోన్ చేయించి అతడు ఎక్కడున్నాడో తెలుసుకుని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయం నుంచి పహాడీషరీఫ్ వెళ్లే మార్గంలో ఓ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అతడు ఉన్నట్లు గుర్తించారు. అయితే అతడు రవూఫ్నే క్యాబ్‌లో రమ్మని చెప్పి.. ఆ వాహనం నంబర్ తెలుసుకుని ఫాలో అవడం ప్రారంభించాడు. దీంతో సిటీ శివార్ల వరకు రహస్యంగా వెంబడించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా మెహరేన్ను అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ నగదు మెహరేన్ సొంతం కాదని, కొందరు వ్యాపారుల వద్ద తీసుకుని 3 శాతం కమీషన్‌కు ఆశపడి దుబాయ్‌కు పంపుతున్నట్లు బయటపడింది. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైతం ఈ రాకెట్ మూలాలు కనుక్కోవడంపై దృష్టి పెట్టారు. ఇంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ ఏఏ మార్గాల్లో సిటీకి వచ్చిందనే అంశాలనూ ఆరా తీస్తున్నారు. -
బెంగాల్ బస్సులో డాలర్ల కట్టలు!
తెహట్టా: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలోని చాప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ బస్సులో బీఎస్ఎఫ్ జవాన్లు రూ.57 లక్షల(88,200) విలువైన అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం ఆధారంగా క్రిష్ణానగర్ నుంచి వస్తున్న ఆ బస్సును ఆపి సోదాలు చేయగా ఓ బ్యాగులో ఈ డబ్బు బయటపడింది. అవన్నీ 100 డాలర్ల నోట్లేనని అధికారులు చెప్పారు. ఆ డబ్బును కస్టమ్స్ శాఖకు అప్పగించామని తెలిపారు. ఈ వ్యవహారంలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మాల్యాకు మరో షాకిచ్చిన ఈడీ
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి బ్రిటన్ కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ మాల్యాకు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. మాల్యాకు చెందిన వేల కోట్ల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసింది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా తొమ్మిది వేల కోట్లకు పైగా రుణ ఎగవేతదారుడు, లిక్కర్ కింగ్ మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ చర్యలకు దిగింది. గతంలో వేలకోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ తాజాగా విజయ్ మాల్యాకు చెందిన మాండ్వా లోని రూ.100 కోట్ల విలువైన పొలాలను, ఫామ్ హౌస్ ను స్వాధీనం చేసుకుంది. ఇటీవల మాండ్వా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులు పంపింది. మనీలాండరింగ్ చట్టం సెక్షన్8(4) ప్రకారం వీటిని తమకు స్వాధీనం చేయాల్సిందిగా మాండ్వా ఫామ్స్ లిమిటెడ్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై మాండ్వా ఫామ్స్ లిమిటెడ్ న్యాయవాదులు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అప్పిలేట్ ట్రిబ్యునల్ రెండురోజుల క్రితం తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే అలీబాగ్‌లోని మాండ్వా ఫామ్ హౌస్ సహా 17 ఎకరాల వ్యవసాయ భూమిని ఈడీ స్వాధీనం చేసుకుంది. కాగా ఇటీవల రూ.6,630 కోట్లు అతిపెద్ద ఎటాచ్ మెంట్ చేసింది. అలాగే భారత్‌కు రప్పించేందుకు కేంద్ర సర్కారు తీవ్రంగా ప్రయ్నతిస్తోంది. ఈక్రమంలో లండన్ లో మాల్యాను అరెస్ట్ చేశారు. అలాగే సీఐడీ, ఈడీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం లండన్ లోని న్యాయవాదులతో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఆర్థిక నేరస్తులను అప్పగించేందకు ఇరు సంస్థలు అంగీకరించిన సంగతి తెలిసిందే. -
గంజాయి కేసులో క్రికెట్ బుకీ అరెస్ట్
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పోర్ట్స్ స్కూల్ సమీపంలో యెల్లాల మహ్మద్ గౌస్ అనే క్రికెట్ బుకీ గంజాయి విక్రయిస్తుండగా అరెస్ట్ చేసినట్లు రిమ్స్ సీఐ మోహన్ ప్రసాద్ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన మహ్మద్ గౌస్ అనేక సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడేవాడు. ప్రస్తుతం క్రికెట్ బెట్టింగ్‌కు జిల్లాలో బ్రేక్ పడటంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గంజాయిని విక్రయిస్తుండగా తమకు సమాచారం రావడంతో అరెస్ట్ చేశామన్నారు. అతని వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టు చేసేందుకు కృషి చేసిన ఎస్ఐ హేమాద్రిని అభినందించారు. -
విశాఖలో 1,080 కిలోల గంజాయి స్వాధీనం
పాడేరు రూరల్(విశాఖపట్టణం): విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం సంగులోయ వద్ద ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో అనకాలపల్లి ఎక్సైజ్ పోలీసులు సంగులోయ గ్రామం వద్ద మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వ్యానులో తీసుకువస్తున్న 1,080 కిలోల గంజాయి పట్టుబడింది. వ్యాన్ డ్రైవర్ కమ్ ఓనర్ పరారు కాగా అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్‌తోపాటు బైక్‌ను సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ నాగేశ్వరరావు, ఎస్సై లీలారాణి తెలిపారు. పట్టుబడిన వారు అన్నవరం, కొయ్యూరు ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. -
వేర్వేరు కేసుల్లో ఇద్దరి అరెస్టు
పంజగుట్ట: రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులు ఒకరి నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు, మరో నిందితుని నుంచి రూ.5.85 లక్షల నగదు స్వాధీనం చేసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల పక్రారం ఆసీఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (38) అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తుండేవాడు ఇతను చిల్లర దొంగతనాలు చేస్తూ పలుమార్లు పోలీసులకు చిక్కాడు. ఎరమ్రంజిల్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పద్మావతికి వైజాగ్‌కు బదిలీ కావడంతో ఇంటికి తాళం వేసి వైజాగ్ వెళ్లింది. ఈ నెల 12న ఇంటికి వచ్చిన ఆమెకు ఇంట్లోని 15 తులాల బంగారం, 40 వేల నగదు, ఒక టీవీ, సిలిండర్ కనిపించకపోవడంతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో ఇస్మాయిల్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి 7 తులాల బంగారం స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి దొంగ అరెస్టు పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనం చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని రూ. 5.85 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అశోక్ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ బంజారాహిల్స్‌కు చెందిన ఉత్తమ్ అనే వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. గత శనివారం ఉత్తమ్ తన ఇంట్లోని బీరువాలో రూ. 6 లక్షల నగదు ఉంచడాన్ని గమనించిన అశోక్ వాటిని కాజేసి మహబూబ్‌నగర్ వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. తన సోదరుడికి కాలు విరిగినందున, ఆసుపత్రిలో పాత నోట్లు తీసుకుంటున్నట్లు తెలిసి ఆపరేష¯ŒS చేయించేందుకు డబ్బులు కాజేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. -
కారు స్వాధీనం.. దొంగ అరెస్ట్
గుత్తి: అపహరణకు గురైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని, దొంగను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మధుసూదన్‌గౌడ్, ఎస్ఐ రామాంజనేయులు సోమవారం గుత్తి పోలీసుస్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. అక్టోబర్ 11న కర్ణాటక రాష్ట్రం∙బీదర్‌కు చెందిన విజయకుమార్ కారు( హోండా అకర్డ్–కెఎ 04 ఎంసి 8383)ను బీదర్‌కే చెందిన చంద్రకాంత్ మరో వ్యక్తి బెంగుళూరు నుంచి నాగపూర్‌కు బాడుగకు మాట్లాడుకున్నారు. అదే రోజూ రాత్రి పది గంటల సమయంలో గుత్తి శివారులోని రాయల్ డాబా వద్దకు చేరుకున్నారు. రాత్రి అయిందని విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే బయలుదేరుదామని డ్రైవర్ కమ్ ఓనర్ విజయకుమార్‌ను నమ్మించారు. రాత్రి డాబాలో పడుకున్నారు. బాడుగ మాట్లాడుకున్న వారు తెల్లవారు జామున డ్రైవర్‌ను గదిలోనే పెట్టి తాళం వేసుకుని కారుతో ఉడాయించారు. బాధితుడు విజయకుమార్ గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం హైవేలో పోలీసులు తనిఖీ చేస్తుండగా అపహరణకు గురై కారు కనిపించింది. వెంటనే కారును స్వాధీనం చేసుకుని, నిందితుడు చంద్రకాంత్‌ను అరెస్టు చేశారు. నిందితున్ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. -
అక్రమ టపాసుల పట్టివేత
రాయచోటి టౌన్: దీపావళి పండుగ వస్తుండటంతో టపాసుల అక్రమ వ్యాపారాలు జోరందుకున్నాయి. టపాసుల వ్యాపారానికి సంబంధించి లైసెన్స్ కలిగిన వారికి పోలీసులు ఇప్పటికే కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే లైసెన్స్ లేకుండా, అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిపై నిఘా పెట్టారు. వీరి వలలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయారు. పట్టణంలోని గాంధీ బజార్ దగ్గరలోని వీధిలో అక్రమంగా టపాసుల వ్యాపారం చేస్తున్న రఫీవుల్లా బేగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న టపాసులను వారు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగేశ్వరరెడ్డి తెలిపారు. -
ఎయిర్ గన్‌తో తిరుగుతున్న యువకుడి అరెస్ట్
చాంద్రాయణగుట్ట: ఎయిర్‌గన్ తిరుగుతున్న ఓ యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వై.ప్రకాష్ రెడ్డి కథనం మేరకు.. బార్కాస్ జమాల్‌బండ ప్రాంతానికి చెందిన అబ్దుల్ నహదీ(19) మంగళవారం ఇస్మాయిల్ నగర్ నుంచి ఎయిర్‌గన్‌తో వస్తుండగా, బక్రీద్ బందోబస్తులో ఉన్న ఎస్సై శ్రీనివాసారావు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
పది క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత
1.50 క్వింటాళ్ల పటిక స్వాధీనం ఐదుగురిపై కేసు నమోదు మహబూబాబాద్ రూరల్ : అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను మహబూబాబాద్ రూరల్ పోలీసులు పట్టుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు. టాటాఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ జె.కృష్ణారెడ్డి, ఎస్సై సీహెచ్.శ్రీనివాస్ సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని అమనగల్ శివారు గుండాలగడ్డ తండాకు చెందిన హుస్సేన్ టాటాఏస్‌లో మరిపెడ నుంచి పది క్వింటాళ్ల నల్లబెల్లం, 1.50 క్వింటాళ్ల పటిక తీసుకుని ఆదివారం రాత్రి గుండాలగడ్డ తండాకు వచ్చాడు. ఈ బెల్లాన్ని తీసుకెళ్లేందుకు నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం శివారు సుందరం తండాకు చెందిన గుగులోత్ లక్పతి, బానోత్ రవి, గుగులోత్ రాము, నేతావత్ రవి మరికొందరు గుండాలగడ్డ తండాకు వచ్చారు. ఇది లె లుసుకున్న పోలీసులు ఎక్సైజ్ వారికి సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్ ఎస్సై రాయబారపు రవికుమార్, రూరల్ పీఎస్ హె డ్ కానిస్టేబుల్ డి.మనోహరస్వామి, సిబ్బంది తండాకు వెళ్లగా నింది తులు పరారయ్యారు. పోలీసులు టాటాఏస్,æ బెల్లం, పటికను స్వాధీనం చేసుకుని రూరల్ పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. పరారైన ఆటోడ్రైవర్ హుస్సేన్, లక్పతి, రాము, బానోత్ రవి, నేతావత్ రవిపై కేసు నమోదు చేశామని తెలిపారు. కేసముద్రంలో 12 క్వింటాళ్ల బెల్లం.. కేసముద్రం : అక్రమంగా విక్రయిస్తున్న 12 క్వింటాళ్ల బెల్లం పట్టుకున్న సంఘటన మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఎక్సైజ్ ఎస్సై రేష్మా కథనం ప్రకా రం.. మండల కేంద్రానికి చెందిన పాలరమేష్ అనే వ్యాపారి అక్రమంగా బెల్లాన్ని ఓ గదిలో డంప్‌చేసి విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. వ్యాపారి ఇంటì సమీపంలోని ఓ గదిలో 24 బస్తాల బెల్లం, మరికొంత దూరంలో 170 కేజీల పటిక లభ్యమయ్యాయి. బెల్లం,పటిక స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. దాడులు నిర్వహించిన వారిలో ఎక్సైజ్ సిబ్బంది యాదగిరి, గౌస్, అయూబ్, రామ్మూర్తి తదితరులు ఉన్నారు. -
చోరుల ముఠా ఆటకట్టు
ఐదుగురి అరెస్టు, రిమాండ్ ఐదు తులాల బంగారం, 80 తులాల వెండి స్వాధీనం బోధన్ : సంతల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా ఆట కట్టించారు పోలీసులు. నిందితులను సోమవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. రెంజల్ మండలంలోని వీర్నగుట్టకు చెందిన ఓర్పు సాహెబ్రావు (32) ఓర్పు శశిరేఖ (25), సంపంగి నాగమణి (30) పల్లపు నర్సమ్మ (35),ఎత్తారి లింగమ్మ ముఠాగా ఏర్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో జరిగే వారంతపు సంతలను టార్గెట్‌గా చేసుకొనేవారు. సంతకు ఒంటరిగా వచ్చే అమాయక మహిళలతో పరిచయం పెంచుకునే వారు. మాయమాటలతో తమ దారిలోకి తెచ్చుకుని కల్లు బట్టీలకు తీసుకెళ్లి, నిద్రమాత్రలు కలిపిన కళ్లు తాగించే వారు. బాధితురాలు మత్తులోకి జారుకోగానే, ఆమెపై ఉన్న ఆభరణాలతో ఉడాయించే వారు. ఇలా కోటగిరిలో రెండు, ఎడపల్లి, వరిన, పిట్లంలలో చోరీలకు పాల్పడ్డారు. కోటగిరి ఠాణాలో నమోదైన ఓ కేసు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం పోతంగల్ వారంతపు సంతలో ముఠా సభ్యులు సాహెబ్రావు, శశిరేఖ సంచరిస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మిగతా నిందితుల వివరాలు, చేసిన నేరాలు వెల్లడించారు. దీంతో వారందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి ఐదు తులాల బంగారం, 80 తులాల వెండి, రెండు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈ తరహా చోరీలు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ శ్రీనివాసులు, కోటగిరి, రెంజల్ ఎస్సైలు బషీర్ అహ్మద్, రవికుమార్, ఐడీ విభాగం సిబ్బంది అనిల్, బాబురావులను డీఎస్పీ అభినందించారు. -
50 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు రూరల్: అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 50 ఎర్ర చందనం దుంగలతో పాటు నాలుగు కార్లు, మూడు ఆటోలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ ఏ.రాజేంద్ర తెలిపారు. స్థానిక పోలీసు స్టేషనులో శనివారం సాయంత్రం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ముందస్తు సమాచారం మేరకు సీఐ రసూల్ సాహెబ్, సిబ్బంది మండలంలోని బిల్లుపాటిపల్లె వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నెంబరు ప్లేటు లేని బొలేరో వాహనం అటు వైపు వచ్చిందన్నారు. దానిని ఆపమన్నా ఆపకుండా అతివేగంగా వెళ్లిపోయిందన్నారు. దీన్ని తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని తనిఖీ చేయగా అందులో 7 ఎర్రచందనం దుంగలు కన్పించాయన్నారు. అందులో ఉన్న ఇరుగూరి నరేష్, నరేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా వారిచ్చిన సమాచారం మేరకు వాగేటికోన వద్ద మూడు ఆటోలు, ఒక ఆల్టో కారు, ఒక క్వాలీస్ కారు, ఒక విస్టా కారు, ఒక అవెంజర్ ద్విచక్ర వాహనం 43 ఎర్రచందనం దుంగలు దొరికాయన్నారు. అక్కడున్న గంగయ్య, నరసింహారెడ్డిని అరెస్టు చేశామన్నారు. వారిని పూర్తిగా విచారించగా దుబాయ్‌కు చెందిన అమీద్ సాహుల్ బాయ్, తిరుత్తణికి చెందిన మణి, సింగపూర్‌కు చెందిన సుబ్రమణి, కందస్వామి, రెడ్ హిల్స్‌కు చెందిన వెంకటేశు, అన్నా నగర్‌కు చెందిన భాస్కర్లకు విక్రయిస్తామని తెలిపారన్నారు. వీరితో పాటు చెన్ చెంగ్యూ, చెన్ చెంగాయ్, కేవీ. దావోద్ జాగాయ్, డి.పద్మనాభన్, అమీర్ ఖాజా, ఫిరోజ్ దస్తగిరి అనే స్మగ్లర్లకు కూడా విక్రయిస్తామనిఅంగీకరించారన్నారు. అరెస్టు చేసిన వారిలో నరేష్‌కు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మంజునాథ, సిబ్బంది పాల్గొన్నారు. -
రైల్వే కోడూరులో ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరం వద్ద జరిగింది. ఓ వాహనంలో సుమారు 20 లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనాన్ని పోలీసులు తనిఖీల సందర్భంగా పట్టుకున్నారు. ఎర్రచందనం స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. స్మగ్లర్లు పరారీ అయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
టన్ను ఎర్రచందనం పట్టివేత
గుమ్మిడిపూండి: అక్రమంగా ఇంట్లో దాచిన టన్ను ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన గుమ్మిడిపూండిలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాల మేరకు గుమ్మిడిపూండి సమీపంలోని కరిమేడు గ్రామంలో ఒక ఇంట్లో ఎర్రచంద నం దుంగలు ఉన్నట్టు కవరపేట పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో కవరపేట ఎస్.ఐ. మహాలింగం నేతృత్వంలో పోలీసులు కరిమేడు గ్రామంలోని ఆటోడ్రైవర్ రమేష్ అనే అతని ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేయడంతో ఇంటి వెనుక భాగంలోని షెడ్లో మూడు నుంచి నాలుగు అడుగుల 32 ఎర్రచందనం దుంగలు దాచి ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని గుమ్మిడిపూండి అటవిశాఖ కార్యాలయానికి తరలించారు. ఇందుకు కారణమైన రమేష్, ఆయన భార్య రుక్మిణిలను పోలీసులు అరెస్టు చేశారు. వీటి విలువ దాదాపు రూ. 40లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కవరపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.