
గాంధీనగర్: కేరళలో మహిళల నరబలి ఘటన మరువక ముందే గుజరాత్‌లో మరో దారుణం వెలుగుచూసింది. కన్నతండ్రే క్షుద్రపూజలు చేసి 14ఏళ్ల కూతుర్ని చంపాడు. ఆమెకు గంటలపాటు నరకం చూపించి చావుకు కారణమయ్యాడు. గిర్ సోమ్‌నాథ్ జిల్లా ధవా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. భవేశ్ అక్బరీ అనే వ్యక్తి తన కూతురికి దెయ్యం పట్టిందని అనుమానించాడు. దీంతో ఆమెకు భూతవైద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు. పాత దుస్తులు ధరించమని ఇచ్చి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. భవేశ్‌తో పాటు అతని సోదురుడు దిలీప్ కూడా వెళ్లాడు. ఇద్దరు కలిసి పెద్ద మంట పెట్టారు. బాలిక జుట్టుకు కట్టె కట్టి ఆ మంటల ముందు రెండు కుర్చీల మధ్యన రెండు గంటలపాటు నిల్చోబెట్టారు. చాలా సేపు ఆమెకు ఆహారం, నీరు ఏమీ ఇవ్వలేదు. దీంతో ఈ నరకం భరించలేక బాలిక కన్నుమూసింది.
అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా బాలిక మృతదేహాన్ని బ్లాంకెట్‌లో తీసుకెళ్లి తగలబెట్టారని పోలీసులు వెల్లడించారు. ఆధారాలు లేకుండా చేశారని పేర్కొన్నారు. బాలిక కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
అక్బరీ కుటుంబం 6 నెలల క్రితమే సూరత్ నుంచి ఈ గ్రామానికి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. అక్బరీ గ్రామంలో ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని వెల్లడించారు.
చదవండి: నరబలి ఉదంతం: చంపేసి ముక్కలు చేసి తిన్నారా?
Comments
Please login to add a commentAdd a comment