
భారీగా ‘ఎర్ర' దుంగలు స్వాధీనం
విలువ రూ.13 లక్షలు
ఏడుగురి అరెస్ట్
కలువాయి: జిల్లాలోని వేర్వేరు ప్రాం తాల్లో రూ.13 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లిలో రూ.7లక్షల విలువైన దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేయగా, కలువాయి మండలం వెంకటరామరాజుపేటలో ఐదుగురిని అరెస్ట్ చేసి రూ.6 లక్షల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్సై పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పోలీ సులు వెంకటరామరాజుపేటలో తని ఖీలు నిర్వహించారు. రూ.6 లక్షల విలువైన 22 దుంగల డంప్ బయటపడింది. వీటికి సంబంధించి గ్రామానికే చెందిన స్మగ్లర్ పెరుమాళ్ల శ్రీనివాసులు, మేస్త్రి బైరపోగు నాగేశ్వరరావు, కూలీలు బైరపోగు నాగేంద్ర, బైరపోగు పెంచలయ్య, కడపకు చెందిన గాలి రమణయ్యను అరెస్టు చేశామని ఎస్సై తెలి పారు.
నిందితులను కోర్టుకు హాజరుపరిచామన్నారు. పొదలకూరు సీఐ హైమారావు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో ప్రత్యేక పోలీసు బృందాలు, కలువాయి ఏఎస్‌ఐలు సుబ్బరాజు, శ్యాంసన్, సిబ్బంది పాల్గొన్నారని వివరించారు.
పెద్దిరెడ్డిపల్లిలో 20 దుంగలు
ఉదయగిరి: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 20 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివరాలను ఉదయగిరి సీఐ విజయభాస్కర్ మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాల్లోని అడవుల్లో ఎర్రచందనం వృక్షాలున్నాయి. ఇటీవల కాలంలో కొందరు అక్రమంగా చెట్లను నరికేస్తుండటంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి శివారులో గాలిస్తుండగా రవాణాకు సిద్ధంగా ఉంచిన 20 ఎర్రచందనం దుంగలు వెలుగుజూశాయి. వాటికి సంబంధించి పెద్దిరెడ్డిపల్లికి చెందిన సవరం అంకయ్య, అడుసుమల్లి లక్ష్మీవెంకటనారాయణ అలి యాస్ బొజ్జయ్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు మరి కొందరి పేర్లు వెల్లడించారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ. 7 లక్షలుగా అంచనా వేశారు. కూంబింగ్‌లో పాల్గొన్న సిబ్బందికి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు చేస్తామని సీఐ విజయభాస్కర్ చెప్పారు. ఆయన వెంట వరికుంటపాడు ఎస్సై కొండపనాయుడు, హెడ్ కానిస్టేబుల్ శిఖామణి, హోంగార్డు జనార్దన్ ఉన్నారు.