
తప్పతాగండి.. ఇష్టానుసారం వ్యవహరించండంటూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఊరూరా, వీధి వీధిన మద్యం వరద పారిస్తోంది. 24/7 మద్యం లభిస్తుండటంతో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఎదుట ఉన్న వారు ఎవరన్న కనీస విచక్షణ లేకుండా దాడులకు తెగబడుతుండటం పరిపాటిగా మారింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి తీర్థం సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్‌లో తప్పతాగిన యువకులు కొందరు డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్‌ఐ దేవి ఇలా చేయడం తగదంటూ వారిని వారించారు.

దీంతో మాకే అడ్డుచెబుతావా.. అంటూ ఆ యువకులు ఆమె జుట్టు పట్టుకుని పక్కకు ఈడ్చేశారు. ఫోన్ లాక్కుని.. ఆమె చేతులు లాగుతూ, దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఆమె భయంతో పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అప్పటికీ శాంతించని ఆ యువకులు గేట్లు లాగుతూ, పూల కుండీలు విసిరేసి బీభత్సం సృష్టించారు. ఆమె ఫోన్ చేసి పరిస్థితి చెప్పడంతో అదనంగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మాయదారి మద్యం వల్లే ఇలా జరిగిందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. – సాక్షి నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment