
ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదు
ఇప్పుడు గ్రేహౌండ్స్ అంటూ మోసం చేస్తారా
ఆర్డీఓ ఎదుట గిరిజనుల ఆందోళన
కొత్తవలస: పోలీసు శిక్షణ కేంద్రం (గ్రేహౌండ్స్) పేరిట మరోసారి తమను మోసం చేయొద్దని అప్పన్నదొరపాలెం, తమ్మన్నమెరక, జోడిమెరక గ్రామాలకు చెందిన గిరిజనులు ఆర్డీఓ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 526 ఎకరాల భూముల్లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించేందుకు నిర్ణయించగా.. ఆర్డీఓ దాట్ల కీర్తి ఆధ్వర్యంలో సర్పంచ్ జోడు రాములమ్మ అధ్యక్షతన తహసీల్దార్ బి.నీలకంఠరావు అప్పన్నదొరపాలెంలో గురువారం గ్రామసభ నిర్వహించారు.
సభకు హాజరైన గిరిజనులు మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మిస్తామని చెప్పి తమ భూములను లాక్కున్నారని తెలిపారు. 2019లో ఎన్నో హామీలిచ్చారని, అందులో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. భూములిచ్చిన గిరిజనులను పోలీస్ బందోబస్తు మధ్య బంధించి పూజలు నిర్వహించారన్నారు. ఇప్పుడు అవే భూముల్లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పడం మోసగించడమేనని పేర్కొన్నారు. తహసీల్దార్ ప్రభుత్వ నిబంధనల్ని వివరిస్తూ గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి సహకరించాలని కోరారు.
ఈ సమయంలో గిరిజనులంతా ఒక్కటై తమను మళ్లీ మోసం చేయొద్దని నినదించారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం 178 మంది గిరిజనులకు చెందిన 179 ఎకరాల్లోని జీడిమామిడి తోటలను ఏడు రకాల హామీలిచ్చి తీసుకుందని.. నేటికీ వాటి అమలు ఊసే లేదని నిలదీశారు. గ్రేహౌండ్స్ నిర్మాణానికి తమ భూములిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తే తమ శవాలపై నిర్మాణాలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ.. గిరిజనుల డిమాండ్లు రాసి ఇస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. మరోసారి గ్రామంలో సభ ఏర్పాటు చేస్తామని అప్పటిలోగా ఆలోచన చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment