ఎస్‌ఐ చొక్కాపట్టుకుని నెట్టివేసిన టీడీపీ కార్యకర్త
అధికార పార్టీ కార్యకర్త కావడంతో మిన్నకుండిపోయిన ఎస్‌ఐ
వీడియో సోషల్ మీడియాలో వైరల్
టీడీపీ మూకల దౌర్జన్యంపై సర్వత్రా చర్చ
సామాన్యుల పరిస్థితి ఏమిటోనని ఆందోళన
భట్టిప్రోలు: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. మరోవైపు తమ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులపైనా దౌర్జన్యానికి దిగుతున్నారు. పోలీసు అధికారులపై సైతం దౌర్జన్యం చేస్తున్నారు. తాము చెప్పినట్లు వినకుంటే మీ సంగతి తేలుస్తామంటూ బెదిరిస్తున్నారు.
తాజాగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో శనివారం టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ అనే వ్యక్తి నగరం ఎస్‌ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టివేయడం, దుర్భాషలాడటం ఇందుకు నిదర్శనం. టీడీపీ కార్యకర్త ఏకంగా ఎస్‌ఐ చొక్కాపట్టుకుని నెట్టివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
విన్నవించినా వినకుండా ఎస్‌ఐపై దౌర్జన్యం
వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు, భట్టిప్రోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాలు నియోజకవర్గంలో పేకాట, కోడిపందాల నిర్వహణపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ విషయంపై శనివారం బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేసుకున్నారు. దీంతో పోలీసులు భట్టిప్రోలులో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
భట్టిప్రోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా సాయంత్రం 4 గంటల సమయంలో బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయనను వారించి తమకు సహకరించాలని కోరారు. అయినా సాయిబాబా పట్టించుకోకుండా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయనను అడ్డకున్నారు. దీంతో సాయిబాబా అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో సాయిబాబా అనుచరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ అనే వ్యక్తి నగరం ఎస్‌ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టారు. అధికార పార్టీ కార్యకర్త కావడంతో ఎస్‌ఐ ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో కొద్ది నిమిషాల్లోనే బయటకు రావడం... అది చూసిన పలువురు రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుండాపోయిందని, సామాన్యుల పరిస్థితి ఏమిటోనని ఆందోళన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment