ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
32 సవర్ల నగలు, 10 బైక్‌లు స్వాధీనం
నాయుడుపేట టౌన్: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని నాయుడుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 32 సవర్ల బంగారు నగలు, వెండి వస్తువులు, 10 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నాయుడుపేట పోలీసుస్టేషన్‌లో మంగళవారం గూడూరు డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరులకు వివరించారు. ఆయన కథనం మేరకు..తమిళనాడులోని చెన్నైకి చెందిన మణిసుందర్, అరక్కోణం వాసి దీనదయాళన్ అలియాస్ దీన 2011లో నాయుడుపేట సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటూ పెయింటర్లుగా నటిస్తూ చోరీలకు పాల్పడేవారు.
అనంతరం తమ మకాంను వెంకటగిరిలోని రైల్వేస్టేషన్ సమీప ప్రాంతంలో ఓ అద్దె ఇంటికి మార్చారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలు, దోపిడీలకు పాల్పడుతూ విలాసంగా గడిపేవారు. ఇటీవల కాలంలో తరచూ చోరీలు జరుగుతుండటంతో పోలీసులు వీరిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో పండ్లూరు క్రాస్‌రోడ్డు వద్ద నాయుడుపేట సీఐ అక్కేశ్వరరావు, ఎస్సై ఆంజనేయరెడ్డి, గూడూరు డివిజన్ ఐడీ పార్టీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్‌పై వస్తున్న వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో పలు నేరాలతో సంబంధం ఉన్నట్లు బయటపడింది. తుమ్మూరు సమీపంలో స్వర్ణముఖి నది వద్ద ఓ పూరింట్లో దాచిన 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తమిళనాడుకు తరలించి విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు విచారణలో వెల్లడైంది. నాయుడుపేట, గూడూరు వన్‌టౌన్, రూరల్, చిల్లకూరు, కోట, దొరవారిసత్రం, పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన 16 కేసుల్లో వీరిని నిందితులుగా గుర్తించారు.
ఆయా కేసులకు సంబంధించి 32 సవర్ల బంగారు నగలు, వెండి వస్తువులు, రూ.8 వేలు నగదు, ఓ ఖాళీ సిలిండ ర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో తమిళనాడు, గూడూరులోని పలు స్టేషన్ల పరిధిలో చోరీలు, హత్య, బైక్ చోరీల కేసుల్లో అరెస్ట్ అయినట్లు వెల్లడైంది. వీరిద్దరితో పాటు వారం రోజుల క్రితం చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ భాగ్యరాజ్ ఇచ్చిన సమాచారం మేరకు పలు భారీ దొంగతనాలకు సంబంధించిన నిందితులను పట్టుకునే చర్యలను వేగవంతం చేశామని డీఎస్పీ తెలిపారు.
సిబ్బందికి అభినందన
అంతర్రాష్ట్ర దొంగలను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్సైలతో పాటు ఐడీ పార్టీ ఏఎస్సై శాంసన్, హెడ్ కానిస్టేబుళ్లు పి.శ్రీనివాసులు, ఎస్‌కే మునీర్‌బాషా, వీవీఎస్ గోపి, ఆర్ వెంకటేశ్వరరాజు, పి.కృష్ణ, కానిస్టేబుళ్లు షేక్ కరీమ్‌సాహెబ్, ఎస్ వెంకటశ్యామ్‌ప్రసాద్, హోమ్‌గార్డులు వెంకి, ఎస్‌కే షాదిక్‌ను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఆయన వెంట గూడూరు రూరల్ ఎస్సై అజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.