‘బండి’పోటు ముఠా! | bikes thefts at annavaram | Sakshi
Sakshi News home page

‘బండి’పోటు ముఠా!

Published Tue, Aug 16 2016 11:04 PM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM

‘బండి’పోటు ముఠా! - Sakshi

‘బండి’పోటు ముఠా!

  • సత్యదేవుని సన్నిధిన జోరుగా బైక్‌ల చోరీలు
  • మూడు రోజుల్లో మూడు అపహరణ
  •  
    కోరిన కోర్కెలు తీర్చే సత్యదేవుడి సన్నిధినే చోరులు చెలరేగిపోతున్నారు. భక్తుల మోటారు సైకిళ్లను మాయం చేసేస్తున్నారు. గత మూడురోజుల్లో మూడు బైక్‌లు చోరీకి గురయ్యాయంటే, అక్కడ వాహనాలకు ఎటువంటి భద్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవుడి దర్శనానికి వచ్చే భక్తులు దేవస్థాన అధికారులు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం అన్నవరంలో నెలకొంది.
     
    అన్నవరం: అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గతంలో ఇదే విధంగా 15 మోటార్‌ సైకిళ్లు అపహరణకు గురికాగా, మంగళవారం దేవస్థానం ఉద్యోగికి చెందిన మరో మోటార్‌ సైకిల్‌ చోరీకి గురైంది. దీంతో భక్తులతో పాటు ఉద్యోగుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రెండురోజుల క్రితం   రెండు మోటార్‌సైకిళ్లు అపహరణకు గురి కాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
    వాహనాల తనిఖీ..   
    మంగళవారం రత్నగిరిపై మోటార్‌సైకిల్‌ అపహరణకు గురైన  విషయం తెలుసుకున్న అన్నవరం ఎస్సై పార్థసారధి రెండో ఘాట్‌రోడ్‌లో వాహనాల తనిఖీ ప్రారంభించారు. మోటార్‌సైకిళ్లపై కొండ దిగువకు వస్తున్న భక్తులను ఆపి వాహనాల రికార్డులను తనిఖీ చేశారు. అన్నవరం దేవస్థానానికి వచ్చే భక్తుల వాహనాలకు ప్రధానంగా మోటార్‌ సైకిళ్లకు సరైన రక్షణ లేదు.
     
    పశ్చిమరాజగోపురం వద్ద అయితే రోడ్డు పక్కన, ఆలయానికి ముందు భాగంలో చెట్ల కింద వీటిని నిలుపుతున్నారు. వందల సంఖ్యలో మోటారుసైకిళ్లు ఉండడంతో ఎవరి మోటార్‌ సైకిల్‌ ఎవరు పట్టుకుపోతున్నారో కూడా తెలియని పరిస్థితి. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
     
    డూప్లికేట్‌ తాళాలతో బైకుల చోరీ..
    కొండదిగువ నుంచి దేవస్థానానికి రెండు ఘాట్‌ రోడ్‌లున్నాయి. ఒకటి రత్నగిరికి వాహనాలు వెళ్లేది కాగా, మరో రోడ్‌ వాహనాలు కొండదిగువకు వెళ్లేది. రత్నగిరిపై పార్కింగ్‌ స్థలంలో నిలిపిన వాహనాలను దొంగలు డూప్లికేట్‌ తాళంతో తీసి రెండో ఘాట్‌రోడ్‌ ద్వారా దర్జాగా దిగువకు తీసుకువెళ్లిపోతున్నారు. రత్నగిరిపై బైక్‌ చోరీలు అధికంగా జరుగుతుండడంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు వాహనదారులు కొండ దిగేటప్పుడు టోల్‌గేట్‌ రసీదు, పాస్‌ చూపించాలన్న నిబంధన కొన్ని రోజులు అమలు చేసినా.. తర్వాత పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా బైక్‌ దొంగలు బైక్‌ మీద పంపా ఘాట్‌ పక్క నుంచి పుష్కర కాలువ రోడ్డు ద్వారా హైవేకి చేరుకుని పరారవుతున్నట్టు భావిస్తున్నారు.
     
    మోటార్‌సైకిళ్ల స్టాండ్స్‌ ఏర్పాటు చేయాలి
    దేవస్థానంలో మోటార్‌ సైకిళ్ల పార్కింగ్‌కు స్టాండ్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా అది కార్యరూపం దాల్చడం లేదు. భక్తులకు నామమాత్రపు ఫీజుతో ఈ స్టాండ్స్‌ ఏర్పాటు చేస్తే భక్తుల వాహనాలకు రక్షణతో పాటు వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేసే పరిస్థితి ఉండదు. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా ఉండవు. దేవస్థానానికి ఆదాయం కూడా లభిస్తుంది. దేవస్థానంలో టీటీడీ సత్రం స్థలంలో, సత్యదేవ అతిథిగృహం పక్కన, తూర్పు రాజగోపురం దిగువన గల పార్కింగ్‌స్థలంలో ఈ వాహనాలకు స్టాండ్లు  ఏర్పాటు చేయవచ్చు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.
     
    త్వరలోనే పట్టుకుంటాం 
    రత్నగిరిపై మోటార్‌ సైకిళ్లను అపహరిస్తున్న∙దొంగలను త్వరలోనే పట్టుకుంటాం. మూడు రోజుల క్రితం రెండు మోటార్‌సైకిళ్లు అపహరణకు గురి కాగా, వాటిలో ఒకటి శ్రీకాకుళంలో దొరికింది. మంగళవారం ఉదయం దేవస్థాన ఉద్యోగి బైక్‌ పోయినట్టు  ఫిర్యాదు అందింది. దానిని రాత్రి వాహనాల వీధిలో ఓ ఇంటి గోడ వద్ద ఉండగా గుర్తించాం. ఆ ఉద్యోగికి బైక్‌ అప్పగించాం. భవిష్యత్‌లో బైక్‌ దొంగతనాలు జరుగకుండా చర్యలు తీసుకుంటాం. – ఎస్సై పార్థసారధి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement