at annavaram
-
సత్తెన్నకు రూ.45 లక్షలు శఠగోపం
దుకాణాల వేలం పాటలో తప్పుడు పత్రాలతో ధరావత్తు చెల్లింపు అర్ధంతరంగా వ్యాపారం నుంచి నిష్క్రమణ ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఈఓ ఆగ్రహం.. గుమస్తా సస్పెన్షన్, ఆరుగురికి సంజాయిషీ నోటీసులు అన్నవరం : ఒక పాటదారుడు సాక్షాత్తు సత్యదేవుడికే రూ.45 లక్షల మేర శఠగోపం పెట్టాడు. ఈ వ్యవహారంలో దేవస్థానం సిబ్బంది ప్రమేయం ఉండవచ్చని భావించిన ఈఓ కె.నాగేశ్వరరావు ఓ గుమాస్తాను సస్పెండ్ చేసి మరో ఐదుగురికి సంజాయిషీ నోటీసులు అందజేశారు. వివరాలిలా ఉన్నాయి.. అన్నవరం దేవస్థానంలో 2014–15 సంవత్సరంలో నెంబర్ పది షాపు, రావిచెట్టు వద్ద ఆవునేతి దీపాలు విక్రయానికి వేలం నిర్వహించగా ద్వారపురెడ్డి రామకృష్ణ ఆవునేతి దీపాలు నెలకు రూ,5,55,555, పదో నెంబర్ షాపును రూ. 3,99,999కు పాడుకున్నాడు. ఈ సొమ్ముకు హామీగా తుని మండలం మర్లపాడు గ్రామంలోని ఎనిమిది ఎకరాల భూమి తాలూకు పాస్‌బుక్ అసలు కాకుండా నకలు ఇచ్చాడు. కాగా, 2015లో గోదావరి పుష్కరాల అనంతరం రామకృష్ణ తన రెండు వ్యాపారాలు వదలి వెళ్లిపోయాడు. ఏడాది కాలపరిమితికి వేలం పాట జరిగితే ఏడాదంతా వ్యాపారం చేసి దేవస్థానానికి పాట సొమ్ము చెల్లించాలన్నది నిబందన. కానీ మద్యలో వ్యాపారాలు వదిలేసి వెళ్లిపోవడం వల్ల రెండు వ్యాపారాలు కలిపి సుమారు రూ.45 లక్షల బకాయిలు దేవస్థానానికి చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు దేవస్థానం అధికారులు అతనిపై కోర్టులో కేసు వేశారు. కేసు తేలే వరకూ పాటదారుడు హామీగా ఇచ్చిన ఎనిమిది ఎకరాల భూమిని దేవస్థానానికి అటాచ్ చేయాలని కోరగా మెజిస్ట్రేట్ ఆ మేరకు ఆదేశాలిచ్చారు. ఆ ఉత్తర్వులను దేవస్థానం అధికారులు తుని సబ్‌రిజిస్ట్రార్‌కు అందజేశారు. సదరు భూమి వివరాలు పరిశీలించిన సబ్రిజస్ట్రా్టర్ 2012 సంవత్సరంలోనే ఆ భూమిలో కొంత భాగం విక్రయించారని, మిగిలిన భూమి కూడా మరొకరి స్వాధీనంలో ఉందని దేవస్థానం అధికారులకు వివరించారు. కాగా ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఆ భూమి తనదని, 2012 లోనే కొనుగోలు చేశానని దేవస్థానానికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ పాటదారునిపై న్యాయపరమైన చర్యలకు దేవస్థానం అధికారులు సమాయత్తం అవుతున్నారు. కాగా హామీ ఇచ్చిన పత్రాలు సరైనవో కాదో తేల్చుకోకుండా తీసుకున్నందుకు, భూమిపత్రాల స్టేటస్ తెల్సుకునేందుకు ఈసీ తీయనందుకు సీ సెక్షన్ గుమస్తా వి.సత్యనారాయణను ఈఓ సస్పెండ్ చేశారు. ఈ షాపుల వేలం సమయంలో సీ సెక్షన్ పని చేసిన ముగ్గురు ఏఈఓలు, ముగ్గురు సూపరింటెండెంట్లకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. -
సత్యదేవుని దర్శించిన మాజీ ప్రధాని
వ్రతమాచరించిన దేవెగౌడ దంపతులు ఘన స్వాగతం పలికిన ఆలయ వర్గాలు అన్నవరం : విష్ణువు, శివుడు, లక్ష్మీదేవి ఒకేచోట కొలువైన సత్యదేవుని ఆలయాన్ని దర్శించడం, ఆ స్వామి వ్రతమాచరించడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. సోమవారం ఆయన భార్య చెన్నమ్మతో కలిసి రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సత్యదేవుని ఆలయం చాలా బాగుందన్నారు. సత్యదేవుడిని దర్శించి వ్రతమాచరించమన్న కొందరి సూచనతోనే వచ్చానని చెప్పారు. తెలంగాణ రాష్టంలోని భద్రాచలంలో శ్రీరామచంద్రుడిని కూడా దర్శించుకున్నట్టు చెప్పారు. రత్నగిరి పశ్చిమ రాజగోపురం వద్ద గల లిఫ్ట్ ద్వారా స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న దేవెగౌడ దంపతులకు ఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చకస్వాములు ఘనంగా స్వాగతం పలికారు. ఆంగ్లంలో వ్రతకథ సత్యదేవుని వ్రతమాచరించిన దేవెగౌడ దంపతులకు పండితులు ఆంగ్లంలో వ్రతకథ వినిపించారు. మొదట విఘ్నేశ్వర పూజ, అష్టదిక్పాలకుల ఆవాహనను కల్యాణబ్రహ్మ ముత్య సత్యనారాయణ చేయించగా, వ్రతకథను భాగవతుల వేంకట చలపతి ఆంగ్లంలో చెప్పారు. అనంతరం ఆ దంపతులకు పండితులు వేదాశీస్సులు అందచేశారు. సత్యదేవుని దర్శించిన భక్తులు ఆలయానికి దిగువ భాగంలో గల యంత్రాలయాన్ని కూడా దర్శిస్తారు. అయితే వయోవృద్ధులైన దేవెగౌడ దంపతులు స్వామివారి వ్రతం, దర్శనం అనంతరం తిరిగి లిఫ్ట్ ద్వారా పశ్చిమరాజగోపురం వద్దకు చేరుకుని బస చేసిన వినాయక అతిథి గృహానికి వెళ్లారు. వారి వెంట పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సుంకర మురళీమోహన్ తదితరులున్నారు. దేవెగౌడ బస చేసిన వినాయక అతిథిగృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘బండి’పోటు ముఠా!
సత్యదేవుని సన్నిధిన జోరుగా బైక్‌ల చోరీలు మూడు రోజుల్లో మూడు అపహరణ కోరిన కోర్కెలు తీర్చే సత్యదేవుడి సన్నిధినే చోరులు చెలరేగిపోతున్నారు. భక్తుల మోటారు సైకిళ్లను మాయం చేసేస్తున్నారు. గత మూడురోజుల్లో మూడు బైక్‌లు చోరీకి గురయ్యాయంటే, అక్కడ వాహనాలకు ఎటువంటి భద్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవుడి దర్శనానికి వచ్చే భక్తులు దేవస్థాన అధికారులు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం అన్నవరంలో నెలకొంది. అన్నవరం: అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గతంలో ఇదే విధంగా 15 మోటార్ సైకిళ్లు అపహరణకు గురికాగా, మంగళవారం దేవస్థానం ఉద్యోగికి చెందిన మరో మోటార్ సైకిల్ చోరీకి గురైంది. దీంతో భక్తులతో పాటు ఉద్యోగుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రెండురోజుల క్రితం రెండు మోటార్‌సైకిళ్లు అపహరణకు గురి కాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వాహనాల తనిఖీ.. మంగళవారం రత్నగిరిపై మోటార్‌సైకిల్ అపహరణకు గురైన విషయం తెలుసుకున్న అన్నవరం ఎస్సై పార్థసారధి రెండో ఘాట్రోడ్లో వాహనాల తనిఖీ ప్రారంభించారు. మోటార్‌సైకిళ్లపై కొండ దిగువకు వస్తున్న భక్తులను ఆపి వాహనాల రికార్డులను తనిఖీ చేశారు. అన్నవరం దేవస్థానానికి వచ్చే భక్తుల వాహనాలకు ప్రధానంగా మోటార్ సైకిళ్లకు సరైన రక్షణ లేదు. పశ్చిమరాజగోపురం వద్ద అయితే రోడ్డు పక్కన, ఆలయానికి ముందు భాగంలో చెట్ల కింద వీటిని నిలుపుతున్నారు. వందల సంఖ్యలో మోటారుసైకిళ్లు ఉండడంతో ఎవరి మోటార్ సైకిల్ ఎవరు పట్టుకుపోతున్నారో కూడా తెలియని పరిస్థితి. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డూప్లికేట్ తాళాలతో బైకుల చోరీ.. కొండదిగువ నుంచి దేవస్థానానికి రెండు ఘాట్ రోడ్లున్నాయి. ఒకటి రత్నగిరికి వాహనాలు వెళ్లేది కాగా, మరో రోడ్ వాహనాలు కొండదిగువకు వెళ్లేది. రత్నగిరిపై పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనాలను దొంగలు డూప్లికేట్ తాళంతో తీసి రెండో ఘాట్‌రోడ్ ద్వారా దర్జాగా దిగువకు తీసుకువెళ్లిపోతున్నారు. రత్నగిరిపై బైక్ చోరీలు అధికంగా జరుగుతుండడంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు వాహనదారులు కొండ దిగేటప్పుడు టోల్గేట్ రసీదు, పాస్ చూపించాలన్న నిబంధన కొన్ని రోజులు అమలు చేసినా.. తర్వాత పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా బైక్ దొంగలు బైక్ మీద పంపా ఘాట్ పక్క నుంచి పుష్కర కాలువ రోడ్డు ద్వారా హైవేకి చేరుకుని పరారవుతున్నట్టు భావిస్తున్నారు. మోటార్‌సైకిళ్ల స్టాండ్స్ ఏర్పాటు చేయాలి దేవస్థానంలో మోటార్ సైకిళ్ల పార్కింగ్‌కు స్టాండ్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా అది కార్యరూపం దాల్చడం లేదు. భక్తులకు నామమాత్రపు ఫీజుతో ఈ స్టాండ్స్ ఏర్పాటు చేస్తే భక్తుల వాహనాలకు రక్షణతో పాటు వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేసే పరిస్థితి ఉండదు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. దేవస్థానానికి ఆదాయం కూడా లభిస్తుంది. దేవస్థానంలో టీటీడీ సత్రం స్థలంలో, సత్యదేవ అతిథిగృహం పక్కన, తూర్పు రాజగోపురం దిగువన గల పార్కింగ్‌స్థలంలో ఈ వాహనాలకు స్టాండ్లు ఏర్పాటు చేయవచ్చు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. త్వరలోనే పట్టుకుంటాం రత్నగిరిపై మోటార్ సైకిళ్లను అపహరిస్తున్న∙దొంగలను త్వరలోనే పట్టుకుంటాం. మూడు రోజుల క్రితం రెండు మోటార్‌సైకిళ్లు అపహరణకు గురి కాగా, వాటిలో ఒకటి శ్రీకాకుళంలో దొరికింది. మంగళవారం ఉదయం దేవస్థాన ఉద్యోగి బైక్ పోయినట్టు ఫిర్యాదు అందింది. దానిని రాత్రి వాహనాల వీధిలో ఓ ఇంటి గోడ వద్ద ఉండగా గుర్తించాం. ఆ ఉద్యోగికి బైక్ అప్పగించాం. భవిష్యత్‌లో బైక్ దొంగతనాలు జరుగకుండా చర్యలు తీసుకుంటాం. – ఎస్సై పార్థసారధి