సత్తెన్నకు రూ.45 లక్షలు శఠగోపం
సత్తెన్నకు రూ.45 లక్షలు శఠగోపం
Published Tue, Nov 22 2016 11:52 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
దుకాణాల వేలం పాటలో తప్పుడు పత్రాలతో ధరావత్తు చెల్లింపు
అర్ధంతరంగా వ్యాపారం నుంచి నిష్క్రమణ
ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఈఓ ఆగ్రహం..
గుమస్తా సస్పెన్షన్, ఆరుగురికి సంజాయిషీ నోటీసులు
అన్నవరం : ఒక పాటదారుడు సాక్షాత్తు సత్యదేవుడికే రూ.45 లక్షల మేర శఠగోపం పెట్టాడు. ఈ వ్యవహారంలో దేవస్థానం సిబ్బంది ప్రమేయం ఉండవచ్చని భావించిన ఈఓ కె.నాగేశ్వరరావు ఓ గుమాస్తాను సస్పెండ్ చేసి మరో ఐదుగురికి సంజాయిషీ నోటీసులు అందజేశారు. వివరాలిలా ఉన్నాయి..
అన్నవరం దేవస్థానంలో 2014–15 సంవత్సరంలో నెంబర్ పది షాపు, రావిచెట్టు వద్ద ఆవునేతి దీపాలు విక్రయానికి వేలం నిర్వహించగా ద్వారపురెడ్డి రామకృష్ణ ఆవునేతి దీపాలు నెలకు రూ,5,55,555, పదో నెంబర్ షాపును రూ. 3,99,999కు పాడుకున్నాడు. ఈ సొమ్ముకు హామీగా తుని మండలం మర్లపాడు గ్రామంలోని ఎనిమిది ఎకరాల భూమి తాలూకు పాస్‌బుక్ అసలు కాకుండా నకలు ఇచ్చాడు.
కాగా, 2015లో గోదావరి పుష్కరాల అనంతరం రామకృష్ణ తన రెండు వ్యాపారాలు వదలి వెళ్లిపోయాడు. ఏడాది కాలపరిమితికి వేలం పాట జరిగితే ఏడాదంతా వ్యాపారం చేసి దేవస్థానానికి పాట సొమ్ము చెల్లించాలన్నది నిబందన. కానీ మద్యలో వ్యాపారాలు వదిలేసి వెళ్లిపోవడం వల్ల రెండు వ్యాపారాలు కలిపి సుమారు రూ.45 లక్షల బకాయిలు దేవస్థానానికి చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు దేవస్థానం అధికారులు అతనిపై కోర్టులో కేసు వేశారు. కేసు తేలే వరకూ పాటదారుడు హామీగా ఇచ్చిన ఎనిమిది ఎకరాల భూమిని దేవస్థానానికి అటాచ్ చేయాలని కోరగా మెజిస్ట్రేట్ ఆ మేరకు ఆదేశాలిచ్చారు. ఆ ఉత్తర్వులను దేవస్థానం అధికారులు తుని సబ్‌రిజిస్ట్రార్‌కు అందజేశారు. సదరు భూమి వివరాలు పరిశీలించిన సబ్‌రిజస్ట్రా్టర్ 2012 సంవత్సరంలోనే ఆ భూమిలో కొంత భాగం విక్రయించారని, మిగిలిన భూమి కూడా మరొకరి స్వాధీనంలో ఉందని దేవస్థానం అధికారులకు వివరించారు. కాగా ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఆ భూమి తనదని, 2012 లోనే కొనుగోలు చేశానని దేవస్థానానికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ పాటదారునిపై న్యాయపరమైన చర్యలకు దేవస్థానం అధికారులు సమాయత్తం అవుతున్నారు.
కాగా హామీ ఇచ్చిన పత్రాలు సరైనవో కాదో తేల్చుకోకుండా తీసుకున్నందుకు, భూమిపత్రాల స్టేటస్ తెల్సుకునేందుకు ఈసీ తీయనందుకు సీ సెక్షన్ గుమస్తా వి.సత్యనారాయణను ఈఓ సస్పెండ్ చేశారు. ఈ షాపుల వేలం సమయంలో సీ సెక్షన్ పని చేసిన ముగ్గురు ఏఈఓలు, ముగ్గురు సూపరింటెండెంట్లకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.
Advertisement
Advertisement