స్టేషన్ నుంచి అనుమానితులు పరారీ
Published Sat, Mar 11 2017 1:35 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
మొగల్తూరు : మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులో విచారించేందుకు తీసుకువచ్చిన ఇద్దరు అనుమానితులు శుక్రవారం వేకువ జామున మొగల్తూరు స్టేషన్ నుంచి పరారయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు గంటలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మొగల్తూరు స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు ఎక్కువ కావడంతో అనుమానితులపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన అత్తిలి మండలం రేలంగికి చెందిన ఆగిశెట్టి నాగేశ్వరరావు, ముంగుల వెంకటకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో పలు స్టేషన్లలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. అయితే వీరు శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లను మభ్యపెట్టి వేకువ జామున పరారయ్యారు. దీంతో ఎస్సై కె.గురవయ్య సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితులు తణుకులో తచ్చాడుతున్నట్టు సమాచారం అందడంతో ఎస్సై చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Advertisement