Mogalturu
-
జనసంద్రాన్ని తలపించిన మొగల్తూరు.. సుమారు 20 మాంసాహార రకాలతో..
మొగల్తూరు: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రాకతో గురువారం మొగల్తూరు జాతరను తలపించింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి అభిమానులు తరలిరావడంతో జాతీయ రహదారిలో తరచూ ట్రాఫిక్ స్తంభించింది. వేకువజామున హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో గ్రామానికి చేరుకున్న ప్రభాస్ ఉదయం 10 గంటల ప్రాంతంలో అభిమానులకు అభివాదం చేసేందుకు బయటకు వచ్చారు. అప్పటికే వేలాది మంది అభిమానులు కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మెస్‌లు ఏర్పాటుచేశారు. మెస్ ఆవల నుంచే ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తిలు అభిమానులకు అభివాదం చేశారు. సుమారు 50 వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారని అంచనా వేస్తున్నారు. డీఎస్పీ వీరాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 20 మంది అధికారులు, 600 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పరామర్శ ప్రభాస్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ట, కారుమూరి నాగేశ్వరరావు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పరామర్శించారు. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. కార్యక్రమంపై నిర్వాహకులను సంప్రదించగా ఎడిట్ చేసిన ఇన్పుట్లు, ఫొటోలు పంపుతామని చెప్పినా ఫలితం లేదు. పసందైన భోజనం కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి మొగల్తూరు మండలంలోని 17 గ్రామాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా నాయకులు, స్థానికులకు ఆహ్వానం అందింది. శాఖాహార, మాంసాహార భోజనాలు అందించారు. సుమారు 20 మాంసాహార రకాలు వడ్డించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మొగల్తూరు: కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రి రోజా
-
ప్రభాస్ రాకతో దద్దరిల్లిన మొగల్తూరు.. ప్రతి ఒక్కరికి భోజనం
ఇటీవల స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం గురువారం కృష్ణంరాజు స్వస్థలమైన మొగల్తూరులో ఘనంగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొగల్తూరు వెళ్లారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు ఊరికి రావడంతో స్థానిక ప్రజలు ఆత్మీయంగా వారికి స్వాగతం చెప్పారు. తాము ఎంతగానో అభిమానించే కృష్ణంరాజు భౌతికంగా దూరమవడం అక్కడి వారిలో ఉద్వేగాన్ని నింపింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి స్మారక కార్యక్రమానికి భారీ ఎత్తున స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. వచ్చిన వారిని పలకరించి, అభివాదాలు తెలిపారు ప్రభాస్. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా తినేందుకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రభాస్ ప్రతి ఒక్కరినీ లంచ్ తిని వెళ్లమని కోరారు. ఈ కార్యక్రమం ఆసాంతం ఉద్వేగపూరితంగా సాగింది. -
కృష్ణంరాజు స్మృతి వనం.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, పశ్చిమ గోదావరి: రెబల్‌స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు కారుమూరి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుతో కలిసి హాజరయ్యారు టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈ సందర్భంగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలసి మంత్రులంతా కలిసి సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు మరణంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారని, సినీ-రాజకీయ రంగాల్లో రాణించిన ఆయన మృతి ఆయా రంగాలకు తీరని లోటని మంత్రి రోజా అన్నారు. ఆయన పేరిట మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల స్థలం రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ తరపున కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని, రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని, ఇదే విషయాన్ని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సైతం తెలిపామని వెల్లడించారు. -
ప్రభాస్ అభిమానులతో జనసంద్రమైన మొగల్తూరు (ఫొటోలు)
-
12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్.. లక్ష మందికి భోజనాలు!
రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రభాస్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు రావడంతో...అతన్ని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. పట్టణంలో కొంతమంది అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Love you.. ela vunnaru!! #Prabhas ❤️🥺 pic.twitter.com/rYu7J8oXfP — .. (@charanvicky_) September 29, 2022 నేటి మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు వేణు గోపాల కృష్ణ, రోజా, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు పాల్గొననున్నారు. సుమారు లక్ష మంది అభిమానులకు భోజన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులకు ఆయన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేశారు. మిగిలిన వారందరికీ కృష్ణంరాజు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు. 2010లో తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన సమయంలో ప్రభాస్ మొగల్తూరు వెళ్లారు. ఆ సమయంలో వారం రోజుల పాటు అక్కడే ఉండి సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చాడు. 2 Minutes Silence 🤫 For Those People Who Underestimated About #Prabhas Craze In AP 😎pic.twitter.com/J7zDqamTkF — Prabhas DOMAIN 🏹 (@Prabhas_Domain) September 29, 2022 -
Krishnam Raju: సంస్థాన వారసుడు.. మొగల్తూరు మొనగాడు
బాబులుగాడి దెబ్బ గోల్కొండ అబ్బ వంటి డైలాగులతో రెబల్‌స్టార్‌గా సినీ జగత్తులో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు మృతితో గోదావరి జిల్లాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మొగల్తూరు రాజ సంస్థాన వారసుడిగా రాచరికపు ఆచారాలు, సంప్రదాయాలను ముందుండి పాటించడంతో పాటు సొంత ప్రాంత అభివృద్ధికి ఆయన విశేష కృషిచేశారు. నరసాపురం ఎంపీగా, కేంద్ర మంత్రిగా గ్రామాల్లో రహదారులు, వంతెనలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేశారు. సహాయం చేయడంలో మనసున్న మా‘రాజు’గా నిలిచారు. సాక్షి, నరసాపురం/మొగల్తూరు: మొగల్తూరుకోట సంస్థానంలో 1940 జనవరి 20న ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు, లక్ష్మీదేవి దంపతులకు పెద్ద కుమారుడిగా కృష్ణంరాజు జన్మించారు. తండ్రి సత్యనారాయణరాజు కోటలోని వ్యవహారాలు, పొలాల బాధ్యతలు చూసే వారు. వాస్తవానికి కృష్ణంరాజు వంశీయులది తూర్పుగోదావరి జిల్లా జి.ఎర్రంపాలెం కాగా తండ్రి చిన్నతనంలోనే మొగల్తూరు వచ్చారు. కృష్ణంరాజు బాల్యం మొగల్తూరులోనే గడిచింది. ఐదో తరగతి వరకు స్థానికంగా, ఎస్ఎస్ఎల్సీ నరసాపురంలోని టేలర్ స్కూల్లో చదివారు. డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1969లో కోట సంస్థానాదీశులు కలిదిండి లక్ష్మీ కాంతరాజ బహుద్దూర్ (గాంధీబాబు) కు మార్తె సీతాదేవిని వివాహమాడగా అల్లుడు హోదా లో సంస్థాన వారసుడు అయ్యారు. 1995లో కారు ప్రమాదంలో సీతాదేవి మృతి చెందగా 1996లో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. శ్యామలాదేవికి కూడా మొగల్తూరు సంస్థానాదీశులతో బంధుత్వం ఉంది. ఓడి.. గెలిచిన నాయకుడిగా.. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం గల కృష్ణంరాజు అదే పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1998లో బీజేపీలో చేరి కాకినాడ లోక్‌సభ స్థానంలో ఎంపీగా గెలుపొందారు. 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో నరసాపురం నుంచి పోటీచేసి లక్షన్నర మెజార్టీతో గెలుపొందారు. ఆనాటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పారీ్టలో చేరినా కొంతకాలానికి మళ్లీ బీజేపీ గూటికి వచ్చారు. సొంతూరిపై మమకారం కృష్ణంరాజు మొదటి నుంచీ సొంతూరుపై మమకారం చూపారు. మొగల్తూరు నుంచి భీమవరం మండలం వెంప గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం ఆనాటి ముఖ్యమంత్రి జనార్దనరెడ్డితో మాట్లాడి రూ.80 లక్షలు మంజూరు చేయించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో స్వజలధార పథకంలో జిల్లాలో పలు గ్రామాలకు లక్షలాది నిధులు మంజూరు చేయించారు. 214 జాతీయ రహదారిని 216 ఏగా మారి్పంచి నరసాపురం, మొగల్తూరు మండలాలను కలుపుతూ ఒంగోలు వరకూ రోడ్డును విస్తరింపజేశారు. ఆయన తరచూ సొంతూరుకు వచ్చి చిన్ననాటి స్నేహితులను కలిసేవారు. మొగల్తూరు వస్తే సొంతింటిలోనే బస చేసేవారు. గోదావరి ముద్దు బిడ్డగా.. రాచరికపు ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలో ముందుండే కృష్ణంరాజు కుటుంబంలో ఏ కార్యక్రమమైనా సొంతింటిలోనే జరిపించేవారు. గోదావరిపై మక్కువతో ఆయన నటించిన చిత్రాల్లో గోదావరి పాటలను ఉండేలా చూసేవారు. గోదావరి పుష్కరాలకు సతీసమేతంగా హాజరయ్యేవారు. నరసాపురం వశిష్ట గోదావరి, మొగల్తూరులోని సముద్ర తీర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్‌లు చేశారు. సొంతింట్లో 4 నెలల విశ్రాంతి బంగారుతల్లి సినిమా షూటింగ్ నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో జరుగుతున్న సమయంలో ఆయన గాయంతో కాలు విరిగి నాలుగు నెలలపాటు మొగ ల్తూరులోని నివాసంలోనే విశ్రాంతి తీసుకున్నారు. మొగల్తూరు మొనగాళ్లుగా.. మొగల్తూరు ప్రాంతానికి చెందిన కృష్ణంరాజు, చిరంజీవి సినీ పరిశ్రమలో అగ్రహీరోలుగా వెలుగొందడాన్ని ఈ ప్రాంతవాసులు గొప్పగా చెప్పుకునేవారు. కృష్ణంరాజు రైతుగా వ్యవసాయం కూడా చేశారు. రెబల్ పాత్రలతో రెబల్‌స్టార్‌గా పేరుపొందారు. స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత మొగల్తూరులో వ్యాపారులు ఆదివారం స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపారు. మొగల్తూరు అందే బాపన్న జూనియర్ కళాశాల, కోట్ల రంగారావు డిగ్రీ కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టు యాజమాన్యాలు తెలిపాయి. ఏజెన్సీతో ప్రత్యేక అనుబంధం బుట్టాయగూడెం: కృష్ణంరాజుకు పశి్చమ ఏజెన్సీతో ప్రత్యేక అనుబంధం ఉంది. దర్శకుడు బాపూ దర్శకత్వంలో 1976లో విడుదలైన భక్త కన్నప్ప సినిమాలోని పలు సన్నివేశాలను బుట్టాయగూడెం సమీపంలోని ఇప్పలపాడు, దొరమామి డి, అలివేరు, పట్టిసీమ ప్రాంతాల్లో చిత్రీకరించారు. దాదాపు నెల పాటు షూ టింగ్ జరగ్గా.. కరాటం కృష్ణమూర్తి, చంద్రయ్య ఇంటి వద్ద కృష్ణంరాజు బసచేశారు. ఇప్పలపాడు గ్రామం పక్కన ప్రత్యేక సెట్టింగ్స్‌తో గిరిజన గూడేన్ని ఏర్పాటుచేశారు. ప్రధాన సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ విరా మ సమయంలో ఇప్పలపాడులోని వీధుల్లో కృష్ణంరాజు సాధారణ వ్యక్తిగా తిరుగుతూ అందరినీ పలకరించేవారని అప్పటి షూటింగ్‌ను తిలకించిన గిరిజనులు అంటున్నారు. మొక్కజొన్న పొత్తులను ఇష్టంగా తినేవారని చెబుతున్నా రు. అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. -
మామిడి కాపు బాగుంది.. కరోనా కాటేసింది
నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా): సముద్ర తీరంలో ఇసుక నేలలో పండే మొగల్తూరు మామిడికి ప్రత్యేక స్థానం ఉంది. మామిడి రకాల్లో ఈ రకం రుచి మధురంగా ఉండటంతో దీనికోసం ఆహారప్రియులు ఏడాదంతా ఎదురుచూస్తారు. ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడరు. డిమాండ్ అధికంగా ఉండటంతో మొగల్తూరు మామిడి ధరలు అదేస్థాయిలో ఉంటాయి. ధర, ఎగుమతులు బాగుండటంతో సాగు చేసిన రైతులు లాభాలను గడిస్తుంటారు. అయితే రెండేళ్లుగా మొగల్తూరు మామిడి రైతుల పరిస్థితి మారింది. కరోనా ప్రభావంతో కాపు బాగున్నా స్థానికంగా బేరాలు లేక రైతులు నష్టపోతున్నారు. మరోవైపు ఎగుమతులు తగ్గడంతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. మిగిలిన రకాలతో పోలిస్తే ఇవి ఆలస్యంగా కాపు కాస్తారు. ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి బాగా పెరిగింది. ప్రస్తుతం మొగల్తూరు ప్రాంతంలో మామిడి తోటలు పండ్లతో కళకళలాడుతున్నాయి. గిరాకీ బాగు మొగల్తూరు, పేరుపాలెం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దాదాపు 600 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పండ్ల రకాలైన బంగినపల్లి, చెరుకురసం, చిన్నరసాలు, పెద్దరసాలు, కొత్తపల్లి కొబ్బరి, పచ్చళ్ల రకాలైన సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్లు రకాలకు డిమాండ్ ఉంది. ముఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. జిల్లాలోని దూర ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి పండ్లు, కాయలు కొంటుంటారు. రైతులే వ్యాపారులై.. సాధారణంగా మామిడి తోటలకు మచ్చతెగులు, మంచు తెగులు వంటి వ్యాధులు సోకి రైతులు ఇబ్బందులు పడతారు. ఈదురుగాలులతో పిందెలు, కాయలు రాలిపోయి ఇబ్బంది పడతారు. అయితే ఈ సీజన్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటారు. ఒక్కో చెట్టును రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ విక్రయిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో ముందుగా రైతులకు, వ్యాపారులకు మధ్య బేరసారాలు పెద్దగా జరగలేదు. దీంతో రైతులే నేరుగా వ్యాపారుల అవతారం ఎత్తి అమ్మకాలు ప్రారంభించారు. ఎగుమతులు లేక.. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ మార్కెట్‌కు మొగల్తూరు మామిడి ఎగుమతి అవుతూ ఉంటుంది. సీజన్లో సుమారు 150 లారీల వరకు సరుకు ఎగుమతి చేస్తుంటారు. సీజన్లో మామిడి పండ్లు పరక (13 కాయలు) రూ.500 ధర పలుకుతాయి. అయితే ప్రస్తుతం ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గింది. ప్రస్తుతం పరక కాయలు రూ.200 లోపు ధర పలుకుతున్నాయి. అయినకాడికి అమ్ముకుంటూ.. నాకు ఎకరా మామిడి తోట ఉండగా మరో రెండెకరాలను రూ.2 లక్షలకు కౌలుకు తీసుకున్నాను. ఇప్పుడు ఎగుమతులు లేకపోగా స్థానిక మార్కెట్లు కూడా పెద్దగా సాగడం లేదు. దీంతో అయినకాడికి కాయలు అమ్ముకుంటున్నాం. గతంలో ఇక్కడి బంగినపల్లి కాయ ఒకటి రూ.50 ధర పలకగా ప్రస్తుతం రూ.20 కూడా లేని పరిస్థితి. చాలా మంది నేరుగా తోటల్లోకి వచ్చి కాయలు కొనుక్కుని దూర ప్రాంతాల్లో ఉండే తమ బంధువులకు పంపేవారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు లేవు. – అయితం నాగేశ్వరరావు, రైతు మొగల్తూరు కాపు బాగా కాసింది ఈ ఏడాది కాపు చాలా బాగుంది. గతంలో కాపు సరిగా లేక, మరోపక్క తెగుళ్లతో ఇబ్బంది పడేవాళ్లం. ఈసారి కాపు బాగుండటంతో తోటలతో ఆదాయం కూడా పెరుగుతుందని అనుకున్నాం. అయితే నిరాశ ఎదురైంది. మొగల్తూరులో రోజువారీ జరిగే మార్కెట్లో కూడా మామిడి పండ్లకు ధర రావడం లేదు. త యారైన పండ్లను చెట్లకు ఉంచలేక వచ్చిన ధరకు అమ్ముతున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. గతంలో మొగల్తూరు మామిడి అంటే జనం ఎగబడేవారు. – వెల్లి సురేష్, రైతు, మొగల్తూరు -
మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం
-
మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం
సాక్షి, మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అశ్లీల చిత్రాలు తీవ్ర అలజడి రేపుతున్నాయి. మొగల్తూరులోని ఓ సెల్‌ఫోన్ రిపేర్ సెంటర్ నిర్వాహకుడు... తన దగ్గరకు ఫోన్స్ రిపేర్స్ కోసం వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేసి.. వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో సదరు కామాంధుడితోపాటు అతని వద్ద పనిచేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మొగల్తూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో నిందితుడు సెల్‌ఫోన్ రిపేర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతని వద్దకు వచ్చే మహిళలు, యువతులకు మాయామాటలు చెప్పి ట్రాప్ చేసేవాడు. వారితో చనువు పెంచుకొని.. ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. అయితే.. అతని వద్ద ఫోన్ రిపేర్ పనులు నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువకుడు.. యజమాని ఫోన్లోని అశ్లీల చిత్రాలను చూసి షాక్ అయ్యాడు. అశ్లీల వీడియోలను తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేసుకున్నాడు. అలా ఆ విజువల్స్.. తన స్నేహితులకు ఫార్వర్డ్ చేశాడు. సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ అయిన ఆ విజువల్స్ చివరికి బాధితుల ఫోన్లకు చేరటంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో బాధితురాలు ఒకరు పోలీసులను ఆశ్రయించటంతో.. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఫోన్లను సీజ్ చేశారు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలను నిందితుడు వంచించాడని, ఆ కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. -
అమ్మకు పెద్ద కొడుకులా జగన్
సాక్షి, మొగల్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల్లో అమ్మ ఒడి పథకం ఒకటి. భూమిలేని నిరుపేద కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు పిల్లల చదువులకు ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు నుండి రూ.15వేలు వారి తల్లులకే ఇవ్వడం అమోఘమైన పథకమని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేలా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పేదవాడు పిల్లలకు వేలకు వేలు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారని వారికి చేయూత అందించి, ప్రభుత్వ విద్యావ్యవస్థకు ప్రజలకు నమ్మకం కలిగించేలా జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నత చదువులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా మూలనపడేశారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజ్ రీయింబర్స్ మెంట్ పధకంలో ఎంతో మంది చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదిగారు. అలాంటి పథకాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నీరు గార్చారు. ఇప్పటికీ కాలేజీలకు నిధులు చెల్లించకపోవడంతో విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మూలన పడేసి పోలవరానికి ప్రత్యేక బస్సులంటూ ప్రచార ఆర్భాటం చేశారని మండిపడుతున్నారు. తండ్రిలాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి అని మహిళలు విశ్వసిస్తున్నారు. పథకం వివరాలు పిల్లలను బడికి పంపితే ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు నుంచి రూ.15 వేలు లబ్ధి 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలకు రూ.500లు చొప్పున ఇద్దరికి రూ.1000లు నెలనెలా వారి తల్లులకే చేతికే ఇవ్వడం 6 నుండి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు రూ750 చొప్పున ఇద్దరికి రూ1500 నెలనెలా వారి తల్లుల చేతికే ఇవ్వడం ఇంటర్ చదివే పిల్లలకు రూ.1000లు చొప్పున ఇద్దరికి రూ.2000లు చొప్పున నెలనెలా వారి తల్లులకే అందివ్వడం. మాలాంటి వాళ్లకు ఎంతో ఉపయోగం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన అమ్మ ఒడి పథకం మాలాంటి వాళ్ళకు ఎంతోగానో ఉపయోగ పడుతుంది. ప్రతీ నెలా విద్యార్థుల తల్లులకు నేరుగా డబ్బు ఇస్తానని ప్రకటించడం ఆయనకు పేదల పట్ల ఉన్న అవగాహనకు నిదర్శనం. – వేగి లక్ష్మి, మొగల్తూరు వైఎస్సార్ పునర్జన్మనిచ్చారు చిన్న వయస్సులోనే పొట్టలో నరాలు తెగిపోవడంతో ఆరోగ్య శ్రీలో ఆపరేషన్ చేశారు. 2009 మే 6న గుంటూరు లీలావతి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాను. నా తల్లికి ఆపరేషన్ చేసిన సమయంలో ఆపరేషన్‌కు ఉపయోగించే కత్తెర నా కడుపులో దిగి నరాలు కోసుకుపోయాయి. నేను ఇప్పుడు మొగల్తూరులో నాలుగోతరగతి చదువుతున్నాను. – రావి రోనాల్డ్ రోజ్, పిట్టావారిపేట, రామన్నపాలెం జగన్ అధికారంలోకి రావాలి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆయన తనయుడు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం అమలు కావాలంటే ఆయన అధికారంలోకి రావాలి. – నల్లి రాజేశ్వరి,మొగల్తూరు బాబు మాటలు మళ్లీ నమ్మం బాబు మాటలు విని గతంలో మోసపోయాం. మరోసారి ఎన్నికలు వస్తున్నా బాబు మాటలు మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితి లేదు. అధికారంలోకి రాకముందు ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట మాట్లాడే బాబును ఎవరూ నమ్మరు. – విల్లూరి లత,మొగల్తూరు -
ఫోరెన్సిక్ నివేదికతో బట్టబయలైన నిజాలు
-
ఫోరెన్సిక్ నివేదికతో బట్టబయలైన నిజాలు
మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఫ్యాక్టరీ ప్రమాద ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక జిల్లా పోలీస్ శాఖకు చేరింది. హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి విషవాయుడు కారణంగానే అయిదుగురు మృతి చెందినట్లు నిర్థారణ అయింది. ఈ ఏడాది మార్చి 30న మొగల్తూరు ఆనంద ఆక్వా పార్క్‌లో ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదని.. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించే డ్రామాకు ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తెరలేపింది. ఇందుకోసం దళారులను రంగంలోకి దింపింది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో నిజాలు బట్టబయలు అయ్యాయి. 37 రోజులుగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారు. ప్రమాద ఘటనపై ఇప్పటికీ పోలీసులుతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఇప్పటికీ విచారణ చేయలేదు. కాగా ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా విషవాయువులు కారణం ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. -
అచ్చెన్నాయుడూ.. నీ అబద్ధాలకు సాక్ష్యాలివిగో
మొగల్తూరు ఆనంద ప్లాంట్ వ్యర్థాలు గొంతేరులో నేరుగా కలుపుతున్నారు పెప్‌లైన్లను మీడియాకు చూపించిన వైఎస్సార్ సీపీ, సీపీఎం నేతల బృందం తుందుర్రు ఆక్వా పార్క్ పనులు ఆపేవరకు పోరాటం ఆగదని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ధనదాహానికి ఐదుగురు కార్మికులు బలైపోగా.. మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. చనిపోయినవారి కుటుంబాలను కించపరిచే విధంగా, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు..’ అంటూ వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని నేతృత్వంలోని బృందం మండిపడింది. ఆనంద రొయ్యల ఫ్యాక్టరీ నిర్వహణ నిబంధనల మేరకే జరుగుతోందని, ఫ్యాక్టరీ వ్యర్థాలను కలిపేందుకు గొంతేరు డ్రెయిన్‌లో వేసిన పైప్లైన్లను ఎప్పుడో పీకేశారని మంత్రి చెప్పారని.. ఫ్యాక్టరీ పైప్‌లైన్ గొట్టాలు ఇంకా గొంతేరు డ్రెయిన్‌కు అనుసంధానంగానే ఉన్న దృశ్యాలను చూపిస్తూ ఇదేంటని ప్రశ్నించారు. ఆళ్ల నానితోపాటు నరసాపురం, పాలకొల్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు ముదునూరి ప్రసాదరాజు, గుణ్ణం నాగబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, ఇతర పార్టీ నేతలు మీడియాతో కలసి మొగల్తూరు నల్లంవారి తోటలో ఉన్న ఆనంద ఆక్వా ప్లాంట్‌ను మంగళవారం సందర్శించారు. ఇప్పటికీ ఉన్న ఈ పైప్లైన్లను ఐదునెలల కిందటే తొలగించేశారని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. తరు వాత ఈ బృందం కార్మికుల ప్రాణాలను బలిగొన్న ప్లాంట్ ఆవరణలోని ట్యాంక్‌ను పరిశీలించింది. ఆ ట్యాంక్ నుంచి విషవాయువులకు సంబంధించిన దుర్వాసన ఇంకా తగ్గకపోవడాన్ని గమనించింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగినట్టుగా మసి పూసే ప్రయత్నం ఎలా చేస్తున్నారని ఆళ్ల నాని ప్రశ్నించారు. తరువాత ఈ బృందం గొంతేరు డ్రెయిన్‌ను పరిశీలించి వ్యర్థాలు ఎక్కడెక్కడ కలుస్తున్నాయనే దానిని చూసింది. ఇక్కడకు వచ్చే దమ్ముందా.. అసెంబ్లీలో అబద్ధాలతో ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నకు దమ్ముంటే మీడియాతో కలసి ఫ్యాక్టరీ వద్దకు రావాలని నాని సవాల్ విసిరారు. ‘నీ అబద్ధాలకు రుజువులు అలాగే ఉన్నాయి. చూసైనా కళ్లు తెరుస్తావా’ అని ప్రశ్నించారు. తుం దుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం నిలిపేయాలంటూ ఉద్యమాలు ఉధృతమైన నేపథ్యంలో గత ఏడాది మార్చిలో స్థానిక రైతులు, మత్స్యకారులు, ప్రజలు ప్రభుత్వానికి మొగల్తూరులోని ఆనంద ప్లాంట్ విషయమై ఫిర్యాదు చేశారని చెప్పారు. తుందుర్రులో వైఎస్ జగన్ పర్యటించిన అనంతరం ప్రభుత్వంలో కాస్త చలనం వచ్చి.. నవంబర్‌లో అధికారుల కమిటీ ఆనంద ఆక్వా ప్లాంట్‌ను పరిశీలించిందని చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు నివేదిక ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.. పరిస్థితిలో మార్పు రాకపోతే నోటీసు కూడా ఇవ్వకుండా సీజ్ చేయాలని ఆదేశించిందని తెలిపారు. మరి అప్పుడు కార్మిక, పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్న ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. -
అనుమతి ఒకటి.. చేసేది వేరొకటి
భీమవరం : మొగల్తూరు నల్లంవారి తోటలో ఐదుగురు యువకుల మరణానికి కారణమైన ఆనంద గ్రూప్ సంస్థల యాజమాన్యం అడుగడుగునా నిబంధనల్ని ఉల్లంఘించినట్టు స్పష్టమవుతోంది. ఇక్కడి ప్లాంట్‌లో కేవలం రొయ్య తలలను తొలగించి శుభ్రం చేయడానికి మాత్రమే అనుమతి తీసుకుంది. వీటిని రొయ్యల షెడ్లుగా పిలుస్తారు. రొయ్యల షెడ్లు వేరుగా, ప్రాసెసింగ్ ప్లాంట్లు వేరుగా ఉంటాయి. అయితే, ఆనంద యాజమాన్యం మొగల్తూరు ప్లాంట్ నుంచి రొయ్యలను ప్రాసెసింగ్ యూనిట్లకు పంపించకుండా ఇక్కడే ప్రాసెసింగ్ చేయిస్తోంది. వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకున్న రెండు యంత్రాల సాయంతో ఐస్‌తో కూడిన శ్లాబ్లుగా మార్చి ప్యాకింగ్ సైతం చేయిస్తోంది. వాటిని కోల్డ్ స్టోరేజీలకు తరలించకుండా నేరుగా ఎగుమతి చేస్తున్నట్టు సమాచారం. ఈ తతంగమంతా ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేకుం డానే నిర్వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సాగుతున్న వ్యవహారమంతా అక్రమమేనని ఆక్వా వర్గాలు చెబుతున్నాయి. రొయ్యల షెడ్ ముసుగులో ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులను సైతం ఎగవేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. యాజమాన్యం స్వార్థమే ప్రాణాలు తీసింది నల్లంవారి తోటలోని షెడ్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన రొయ్యలను ముందుగా శుభ్రం చేస్తారు. అనంతరం వాటి తలలను తొలగిస్తారు. ఈ సమయంలో రొయ్య తలల నుంచి పసుపు, తెలుపు రంగులతో కూడిన జిగురు లాంటి పదార్థం బయటకొస్తుంది. దానిని ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) లోకి పంపించాలి. ఈటీపీకి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసి.. దానిని ప్రతిరోజు బ్లీచింగ్‌తో శుభ్రం చేయాలి. ఈటీపీకి గ్రిల్స్ ఏర్పాటు చేస్తే సమీపంలోనే ఉన్న జనావాసాల్లోకి దుర్గంధం వెదజల్లుతుంది. దీనివల్ల ప్రజలు ఆందోళన చేపడతారనే ఉద్దేశంతో ఈటీపీని రేకులతో మూసివేసి దుర్గంధం బయటకు రాకుండా చేశారు. ఈటీపీని మూసివేయడం వల్ల వ్యర్థాలు అందులో కుళ్లిపోయి విషవాయువులు వెలువడ్డాయి. అవే ఐదుగురు కూలీలను పొట్టన పెట్టుకున్నాయి. పన్నులు ఎగ్గొడుతున్న సంస్థకు సర్కారు అండ ఆనంద గ్రూపు సంస్థలు కృష్ణాజిల్లా కృత్తివెన్ను, మొగల్తూరులోని నల్లంవారి తోటలో రొయ్యల షెడ్ల ఏర్పాటుకు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ఆ రెండుచోట్లా అక్రమంగా రొయ్యల ప్రాసెసింగ్ నిర్వహిస్తోంది. తద్వారా ప్రభుత్వానికి చెల్లించాలి్సన పన్నులు ఎగ్గొడుతోంది. దీంతోపాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఆనంద యాజమాన్యానికి ప్రభుత్వం అండగా నిలవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి యాజమాన్యానికి ఆక్వా ఫుడ్‌పార్క్ కేటాయించడం, కోట్లాది రూపాయలను సబ్సిడీగా చెల్లించడం, ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మృతుల నివాసాల వద్ద కొనసాగుతున్న పికెట్లు మృత్యువాత పడిన యువకుల ఇళ్లకు సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లు సోమవారం కూడా కొనసాగాయి. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చివెళ్లే వారి వివరాలను పోలీసులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. పోలీస్ పికెట్లు కొనసాగుతుండటంతో మృతుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలావుండగా, నిత్యం కూలీల రాకతో హడావుడిగా ఉండే ఆనంద రొయ్యల ప్లాంట్ వద్ద గంభీర వాతావరణం నెలకొంది. ఘటన జరిగి ఆరు రోజులైనా విషవాయువులు వెదజల్లిన ట్యాంక్ నుంచి నేటికీ దుర్వాసన వసూ్తనే ఉంది. ఖాకీల నీడలోనే మొగల్తూరు మొగల్తూరు : మొగల్తూరు ఇంకా పోలీసుల నీడలోనే ఉంది. నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లోని ట్యాంక్ నుంచి విషవాయువులు వెదజల్లి ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజున గ్రామస్తులు ఆందోళనలు, ధర్నాలకు దిగడంతో పోలీసులను మోహరించారు. అక్కడ శాంతిభద్రతలు ఘటన జరిగిన రోజు మధ్యాహ్నానికే అదుపులోకి వచ్చాయి. అయితే, ఇప్పటికీ ఫ్యాక్టరీ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. ఇక్కడ స్పెషల్ పార్టీ పోలీసులు షిప్టుల వారీగా బందోబస్తు కొనసాగిస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరూ రాకుండా పరిశ్రమ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సినీ స్టార్స్ ఎక్కడ! మొగల్తూరులు విషవాయువుల కారణంగా ఐదుగురు యువకులు మృత్యువాత పడిన ఉదంతంపై మొగల్తూరు హీరోలు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కాగా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే రోజు సాయంత్రం వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మూడవ రోజున పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి, సీఐటీయూ, సీపీఎం ముఖ్యనాయకులు వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు వచ్చారు. తమ సొంత గడ్డపై దారుణ ఘటన చోటుచేసుకున్నా.. మెగాస్టార్ చిరంజీవి, రెబల్‌స్టార్ యూవీ కృష్ణంరాజు ఈ ఛాయలకు రాలేదు. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆక్వా ప్రకంపన
నరసాపురం/మొగల్తూరు : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో పుట్టుకొచ్చిన కాలుష్య భూతం ఐదుగురు యువకుల్ని పొట్టనపెట్టుకుని ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. మరోవైపు ఈ అంశం అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ఇదిలావుంటే.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదని.. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించే డ్రామాకు ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తెరలేపింది. ఇందుకోసం దళారులను రంగంలోకి దింపింది. మరోవైపు చిన్నపాటి ప్లాంట్ నుంచి వెలువడిన కాలుష్యమే ఏకంగా ఐదుగుర్ని పొట్టన పెట్టుకుంటే.. తుందుర్రులో నిర్మించే ఆక్వా పార్క్ వల్ల తలెత్తే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో గుర్తించాలని.. తక్షణమే ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో ఉద్యమాలు ఊపందుకున్నాయి. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఇంకోవైపు మొగల్తూరు ఘటనలో మృతిచెందిన వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కుటుంబాలకు ఆసరాగా నిలిచిన ఐదుగురు యువకుల్ని మొగల్తూరు నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్ పొట్టన పెట్టుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపగా.. అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. గురువారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. గురువారం రాత్రి వీరి మృతదేహాలకు నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం జరిపించి హుటాహుటిన గ్రామాలకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఒత్తిడి తెచ్చిమరీ రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపించారు. మృతుల ఇళ్ల ఇళ్లవద్ద బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆ ఇళ్ల వద్ద శుక్రవారం హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు, మొగల్తూరు మండలం పోతులవారి మెరకకు చెందిన తోట శ్రీనివాస్‌లకు చంటిబిడ్డలు ఉన్నారు. బొడ్డు రాంబాబు (మెట్టిరేవు), నల్లం ఏడుకొండలు (నల్లంవారి తోట), జక్కంశెట్టి ప్రవీణ్ (కాళీపట్నం)లకు వివాహాలు కాలేదు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల బాధ్యతలు మొత్తం వీరే చూస్తున్నారు. మృతులు ఐదుగురూ తమ కుటుంబాలను వారి భుజాలపై మోస్తున్నవారే. మృతుల కుటుం బాల్లో ఏ ఇంటికి వెళ్లినా వారి రోదనలు, ఆవేదనల్ని చూసి ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. అన్నెంపున్నెం ఎరుగుని వీరంతా.. స్వార్థం కోసం, సంపాదన కోసం పెద్దలు చేసిన ద్రోహానికి బలైపోయారని గ్రామస్తులు నిట్టూరుస్తున్నారు. ఇంటింటా ఇదే చర్చ సముద్రం.. గోదావరి.. పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఆ గ్రామాల్లోని వాతావరణాన్ని ఆనంద ఆక్వా ప్లాంట్ నిర్లక్ష్యం పూర్తిగా మార్చేసింది. ఐదుగురు యువకుల మృతితో మొగల్తూరు మండలంలో భయానక వాతావరణం నెలకొంది. కొన్ని ఇళ్లలో పొయ్యి కూడా వెలిగించుకోలేదు. అందరిలో ఒకటే భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. విషవాయువు రావడం ఏమిటి, మనుషులు చనిపోవడం ఏమిటనే చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘోరం తామెప్పుడూ వినలేదని చెబుతున్నారు. ఎవరిని కదిపినా భవిష్యత్‌లో ఇంకెన్ని చావులు చూడాల్సి వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్ల మధ్య ఇలాంటి ఫ్యాక్టరీలు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని ఆవేదన చెందుతున్నారు. ఆనంద ఫ్యాక్టరీనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని కాలుష్యకారక ప్లాంట్లను మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల ఇళ్లవద్దా బూట్ల చప్పుళ్లే మొగల్తూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల బూట్ల చప్పుళ్ల మధ్య భీతావహ వాతావరణం నెలకొంది. గురువా రం నాటి ఘోర ఘటన నేపథ్యంలో మొగల్తూరు పరిసరాల్లో భారీస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుల ఇళ్ల వద్ద కూడా పోలీస్ బలగాలు మోహరించాయి. వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వడం లేదు. ప్రమాదానికి కారణమైన ఆనంద ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించినా.. గేట్లకు ఎలాంటి సీళ్లు వేయలేదు. గేట్లు మూసేసి, కాపలాగా భారీ బందోబస్తు పెట్టారు. పెనుగొండ సీఐ రామారావు నేతృత్వలో 100 మంది కానిస్టేబుళ్లు ఫ్యాక్టరీ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. తుందుర్రును మరిపించే విధంగా పోలీస్ బందోబస్తు నల్లంవారి తోటలోనూ కొనసాగుతోంది. ఫ్యాక్టరీకి వెళ్లేదారుల్లోనూ, మండలంలోని ముఖ్యమైన గ్రామాల ప్రధాన కూడళ్లలోనూ పోలీసులు జీప్లను నిలిపి నిఘా ఉంచారు. నిజానికి ప్రమాదం జరిగిన గురువారం సాయంత్రం వరకూ మాత్రమే ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన తరువాత అంతా ప్రశాంతంగానే ఉంది. ఆప్తులను కోల్పోయి మృతుల కుటంబాలవారు, ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ప్రజలు ఆందోళన చెందుతుంటే.. పోలీసుల చర్యలు పచ్చని గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. -
మొగల్తూరులో జరిగినవి ప్రభుత్వ హత్యలే
-
మొగల్తూరులో జరిగినవి ప్రభుత్వ హత్యలే
అమరావతి: మొదటి రోజు నుంచి ఇవాళ్టి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును ప్రజలు చూస్తూనే ఉన్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో ఏ వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీలో మొగల్తూరు ఆక్వా మరణాలలపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టగా.. స్పీకర్ అంగీకరించలేదు. దీనిపై మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రతిపక్షాన్ని తిట్టడానికే సభా సమాయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించకుండా.. ప్రభుత్వం సభలో తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు. చంద్రబాబు సెటిల్మెంట్ల సీఎంగా మారారని విమర్శించారు. ప్రత్యేక హోదా, అగ్రీగోల్డ్, ఆక్వా మరణాలు తదితర అంశాలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చినా అవకాశం ఇవ్వలేదు అని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మొగల్తూరులో ఆక్వా కాలుష్యం మూలంగా ఐదుగురు చనిపోతే.. ముఖ్యమంత్రి చిన్న విషయంగా పేర్కొనడం బాధాకరమని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. బాధిత కుటుంబాలను సీఎం పరామర్శించకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్షనేత ఘటనా స్థలానికి వెళుతున్నారని తెలిసిన తరువాతే.. ముగ్గురు మంత్రులను అక్కడకు పంపారని విమర్శించారు. కాలుష్యం వెదజల్లుతున్న ఇటువంటి పరిశ్రమలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. మరో ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ.. మొగల్తూరులో జరిగినవి ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు. కాలుష్యకారక పరిశ్రమలను ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. -
మొగల్తూరు ఘటనపై దద్దరిల్లిన అసెంబ్లీ
-
ఆక్వా బాధిత కుటుంబాలకు జగన్ పరామర్శ
-
ఆ ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దుచేయాలి: వైఎస్ జగన్
నరసాపురం (పశ్చిమ గోదావరి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆక్వా ఫ్యాక్టరీల లైసెన్సులను రద్దు చేయాలని, ఇలాంటి ప్రమాదకర ఫ్యాక్టరీలను సముద్రతీరంలోనే ఏర్పాటుచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి మృతిచెందిన ఐదుగురి కుటుంబాలను ఆయన గురువారం సాయంత్రం పరామర్శించారు. నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న వైఎస్ జగన్ మృతుల కుటుంబాలతో మాట్లాడి.. వారిని ఓదార్చారు. బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆక్వా ఫుడ్ పార్క్ మాకొద్దని తొందూర్రులో గత రెండు సంవత్సరాలుగా పోరాడుతున్నారని, ఇలాంటి ఫ్యాక్టరీల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మొగల్తూరు ఘటనతో అందరికీ అర్థమైందని అన్నారు. ఇలాంటి ప్రమాదకర ఫ్యాక్టరీలను సముద్రతీరంలోనే పెట్టాలని డిమాండ్ చేశారు. మొగల్తూరు ప్రమాద ఘటనలో చనిపోయిన వారంతా 20 నుంచి 30 ఏళ్ల లోపువారేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మొగల్తూరులో ఉన్న ఈ ఆక్వా ఫుడ్ కంపెనీ కెపాసిటీ 30 టన్నులు మాత్రమే. తుందుర్రులో 350 టన్నుల కెపాసిటీతో ఇదే యాజమాన్యం మెగా ఆక్వా ఫుడ్ పార్కును ఏర్పాటు చేస్తున్నది. అక్కడ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉండబోతున్నది. ఆక్వా ఫ్యాక్టరీలతో కాలుష్యం ఉంటుందని అందరికీ తెలసు. అయినా కాలుష్యం ఉండబోదని ప్రభుత్వం చెప్తోంది అక్కడి నుంచి సముద్రం దాకా పైపు వేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. ఆయన ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. మొగల్తూరు ఫ్యాక్టరీ కాలుష్య రహిత ఫ్యాక్టరీ అని చెప్పారు. కానీ ఈ ఫ్యాక్టరీలో రొయ్మల తలలు తీసేసి పక్కన పడేస్తారు. ఈ ఫుడ్ ప్రాసెస్ వ్యర్థాలను పక్కనే ఉన్న పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు దీంతో పంటకాలువలు డ్రైనేజీగా మారిపోయి.. ఆ నీళ్లు తాగడానికి, వ్యవసాయానికి సైతం పనికిరాకుండా పోతున్నాయి. ఇలా పంటకాలువలో వదిలేయవద్దంటూ ఒత్తిడి తేవడంతో కంపెనీ ఈ కాలుష్యాన్ని ట్యాంకులోకి వదిలింది. ఆ ట్యాంకును శుభ్రం చేస్తుండగా అమోనియో గ్యాస్ వెలువడి ఇంతమంది ప్రాణాలను బలిగొన్నది. మరోవైపు ఇది కాలుష్య రహిత ఫ్యాక్టరీ అని ప్రభుత్వం మోసం చేస్తున్నది కాలుష్యం ఉంటుందని అందరికీ తెలిసినా ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతున్నది ఇంతపెద్ద ఘటన జరిగినా కంపెనీ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదు యాజమాన్యం నుంచి బాధిత కుటుంబాలకు మరింత ఎక్కువ పరిహారం ఇప్పించాలి కంపెనీకి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా బాధితులకే ఇప్పించాలి దయచేసి ప్రజల జీవితాలతో కంపెనీలు చెలగాటం ఆడొద్దు గురువారం ఉదయం నల్లావారి చెరువులోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడటంతో ఐదుగురు కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. రసాయనిక ట్యాంకులను శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీక్ అయినట్టు సమాచారం. -
ఆ ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దుచేయాలి: వైఎస్ జగన్
-
'ఆక్వా' బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
నేడు మొగల్తూరుకు వైఎస్ జగన్
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి ఐదుగురు కార్మికులు మరణించిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన మొగల్తూరుకు వెళ్లి, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ రోజు ఉదయం నల్లావారి చెరువులోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడటంతో ఐదుగురు కార్మికులు మరణించారు. రసాయనిక ట్యాంకులను శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీక్ అయినట్టు తెలుస్తోంది. మొగల్తూరు పర్యటన కారణంగా వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ పర్యటనను రద్దు చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం -
స్టేషన్ నుంచి అనుమానితులు పరారీ
మొగల్తూరు : మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులో విచారించేందుకు తీసుకువచ్చిన ఇద్దరు అనుమానితులు శుక్రవారం వేకువ జామున మొగల్తూరు స్టేషన్ నుంచి పరారయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు గంటలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మొగల్తూరు స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు ఎక్కువ కావడంతో అనుమానితులపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన అత్తిలి మండలం రేలంగికి చెందిన ఆగిశెట్టి నాగేశ్వరరావు, ముంగుల వెంకటకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో పలు స్టేషన్లలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. అయితే వీరు శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లను మభ్యపెట్టి వేకువ జామున పరారయ్యారు. దీంతో ఎస్సై కె.గురవయ్య సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితులు తణుకులో తచ్చాడుతున్నట్టు సమాచారం అందడంతో ఎస్సై చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
పెళ్లింట.. జన్‌ధన్ ఖాతా తంటా
మొగల్తూరు: వివాహ ముహూర్త పత్రం చూపిస్తున్న ఈయన పేరు పాలా వెంకటేశ్వరరావు. మొగల్తూరులోని కుక్కల వారితోటలో నివాసం ఉంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే ఈయనకు ఐదుగురు కుమార్తెలు. పక్కన బ్యాంక్ పాస్ బుక్ చూపిస్తున్న యువతి వెంకటేశ్వరరావు నాలుగో కుమార్తె శ్రీలక్ష్మి. కోమటితిప్ప గ్రామానికి చెందిన రామకృష్ణతో ఆమెకు వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 21వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. ఈనెల 28న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. వివాహ ఖర్చుల నిమిత్తం కువైట్‌లో ఉంటున్న వధువు సోదరి సుజాత రూ.70 వేలను తన పేరిట ఉన్న జన్‌ధన్ ఖాతాలో నాలుగు రోజుల క్రితం జమ చేసింది. ఆ ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డు తండ్రి వెంకటేశ్వరరావు వద్దే ఉండటంతో సొమ్ము తీసుకునేందుకు ఏటీఎం సెంటర్లకు వెళ్లాడు. ఆ ఖాతా నుంచి సొమ్ము రావడం లేదు.బ్యాంక్‌కు వెళ్లి ఇదేమని అడిగితే.. జన్‌ధన్ ఖాతా కావడంతో స్తంభింప చేశామని, సుజాత స్వయంగా వస్తే తప్ప ఈ ఖాతాకు సంబంధించిన లావాదేవీలను పునరుద్ధరించలేమని మేనేజర్ చెప్పారు. కుమార్తె సుజాత కువైట్ నుంచి ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. పెళ్లి ఖర్చులకు అవసరమైన సొమ్మును ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుందామంటే ఇచ్చే పరిస్థితి లేదు. తన కుమార్తె వివాహం ఎలా చేయాలో అర్థం కావడం లేదని వెంకటేశ్వరరావు ఆందోళన చెందుతుంటే.. తమ డబ్బు తాము తీసుకోవడానికి ఈ నిబంధనలేమిటని వధువు శ్రీలక్ష్మి వాపోతోంది. -
పాముకాటుకు బాలుడు మృతి
మొగల్తూరు : పాముకాటుకు గురై ఆరేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. మొగల్తూరు పంచాయతీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్న పెడారి ఏసుదాసు, రమణ దంపతుల ఏకైక కుమారుడు పెడారి వెంకట భార్గవ్ స్థానిక ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చిన భార్గవ్ ట్యూషన్‌కు వెళ్లి బహిర్భూమికి అని ఇంటికి తిరిగి వస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. ఇంటికి వచ్చిన భార్గవ్ వెంటనే అపస్మారకస్థితికి చేరుకోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు ఇంజక్షన్ చేసి సిలైన్ ఎక్కించినా ఫలితం లేకపోయింది. అయితే కొద్దిగా నాడి కొట్టుకొంటుందని స్థానిక పెద్దలు చెప్పడంతో తల్లిదండ్రులు బాలుడిని శేరేపాలెంలోని పాము కాటుకు మంత్రం వేసే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటి వరకూ ఆడుతూ పాడుతూ తమ వద్దే తిరిగిన బాలుడు విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
స్టేట్‌బ్యాంక్ మేనేజర్‌పై లైంగిక వేధింపుల కేసు
మొగల్తూరు : లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మొగల్తూరు శాఖ మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ డి.జె.రత్నం మంగళవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మొగల్తూరుకు చెందిన ఓ మహిళ స్టేట్ బ్యాంక్‌లో రుణం కోసం దరఖాస్తు చేశారు. రూ.లక్ష మంజూరు చేసిన మొగల్తూరు బ్రాంచ్ మేనేజర్ కె.వి.ఎస్.ప్రసాద్ ఆమె పేరున రూ.50వేలు డిపాజిట్ చేసి రూ.17వేలు మామూలు తీసుకుని రూ.33వేలు చేతికి ఇచ్చారు. ఆ తర్వాత ఫోన్లో అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
బైక్-లారీ ఢీ: యువకుడి మృతి
మొగల్తూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పుతాళ్లు గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగ రవీంద్రబాబు(22) తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై నర్సాపురం వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రవీంద్రబాబు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గోదారంటే అంతులేని అభిమానం
మొగల్తూరు :గోదావరి అంటే తనకు అవ్యాజమైన ప్రేమానురాగాలు.. అంతులేని అభిమానం ఉన్నాయని రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో ఆయన ఏమంటున్నారంటే.. ‘నా తమ్ముడు కుమారుడు ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం ఈనెల 10న విడుదలవుతున్న కారణంగా కొంత బిజీగా ఉన్నాను. 19వ తేదీన వస్తున్నాను. రాజమండ్రి, కొవ్వూరు ఘాట్లలో పుష్కర స్నానం చేయబోతున్నాను. ఆ తరువాత నరసాపురం చేరుకుంటాను. ఇప్పటివరకూ గోదావరిలో మూడుసార్లు పుష్కర స్నానం చేశాను. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాతో కలసి ఒకసారి పుష్కర స్నానం చేసాడు. ఈసారి రాగలడో లేదో చెప్పలేను. 2003 పుష్కరాల సమయంలో కేంద్రమంత్రి హోదాలో నరసాపురం నుంచి కొవ్వూరు వరకు గల 29 ఘాట్లను జోరున కురుస్తున్న వర్షంలో వెళ్లి పరిశీలించాను. గోదావరి గుర్తొచ్చినా.. గోదారమ్మ పాటలు విన్నా నాకెంతో హాయిగా ఉంటుంది. నా సినిమాలన్నీ గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనే చిత్రీకరించాను. బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప సినిమాలు పూర్తిగా గోదావరి ప్రాంతాల్లో రూపుదిద్దుకున్నవే. 1969లో తీసిన అమ్మకోసం సినిమా షూటింగ్‌ను పాపికొండలు ప్రాంతంలో చేశాం. గంగా నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ గడ్డలో పుట్టిన బిడ్డగా నేను మన గోదావరి నది ప్రక్షాళనకు కృషి చేస్తున్నాను. గోదావరిపై త్వరలో షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాను. అందరికీ గోదావరి పుష్కర శుభాకాంక్షలు. ఆ తల్లి దయతో మీరంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. - మీ కృష్ణంరాజు -
ఇరవై ఏళ్ల తర్వాత ఇంటికి..
మొగల్తూరు : యుక్త వయసులో కూలి పనుల కోసం వెళ్లిన కుమారుడు 20 ఏళ్ల తర్వాత తనను వెతుక్కుంటూ స్వగ్రామం చేరుకోవడంతో ఆ కన్నతల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధి వెంప పెదపేటకు చెందిన ఇంజేటి పెద్దిరాజు, పద్మావతిల కుమారుడు ఇంజేటి సువర్ణరాజు 1994లో పనుల కోసం హుబ్లీ వెళ్లి ఓ కాంట్రాక్టర్ వద్ద మోసపోయి అష్టకష్టాలు పడ్డాడు. శుక్రవారం స్వగ్రామం వచ్చిన అతడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడో తరగతి వరకు చదువుకున్న సువర్ణరాజు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మాని కూలి పనులకు వెళ్లేవాడు. కొంతమంది వ్యక్తులు రైల్వే పనులకు వెళితే ఎక్కువ డబ్బులు వస్తాయని సువర్ణరాజుకు చెప్పారు. రైల్వే కాంట్రాక్టర్ వద్ద పని చూపిస్తామని రూ.10 వేలు చెల్లించాలని చెప్పడంతో వారి మాటలు విని ఆ మొత్తాన్ని వారికి ఇచ్చాడు. పనుల కోసం 1994లో రైల్వే కాంట్రాక్టర్ వద్దకు హుబ్లీ వెళ్లాడు. అక్కడ కాంట్రాక్టర్ రాజును చిత్రహింసలకు గురి చేశాడు. పనులు చేయించుకున్నా జీతం ఇవ్వకపోగా బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించాడు. తిండి కూడా సరిగా పెట్టేవాడు కాదని , స్వగ్రామం వెళ్లడానికి మొహం చెల్లక అదే ప్రాంతంలో ఉండిపోయినట్టు తెలిపారు. ఆ ప్రాంత యువతిని వివాహం చేసుకున్నానని, ఇద్దరు పిల్లలు కలిగినట్టు చెప్పారు. అక్కడ కష్టాలు అనుభవించలేక రాజు 20 ఏళ్ల తర్వాత శుక్రవారం వెంప చేరుకున్నాడు. ఇక భార్యా పిల్లలతో కలిసి వెంపలోనే తల్లి వద్దే ఉంటానని చెప్పాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త మరణించడం, మరో కుమారుడు దుబాయ్ వెళడంతో ఒంటరిగా ఉంటున్న పద్మావతికి ఇక రాడు అనుకున్న కొడుకు తిరిగి రావడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. -
డ్వాక్రా మహిళలకూ బ్యాంకు నోటీసు
మొగల్తూరు : ఎన్నికలకు ముందు వ్యవసాయ, రుణాలను రద్దు చేస్తామని హోరెత్తించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రుణాల రద్దు గురించి మాట్లాకపోవడం దారుణమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు వరకు ఎప్పటికప్పుడు వాయిదాలు కట్టేసేవాళ్లమని, చంద్రబాబు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాననడంతో వాయిదాలు కట్టడం మానేయడంతో అధికారులు తమపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని మహిళలు వాపోతున్నారు. మండలంలోని మోడి గ్రామానికి చెందిన జయలక్ష్మి గ్రూపు అధ్యుక్షురాలు దాసరిజయ, సభ్యులు వెంకాయమ్మ, ధనలక్ష్మి వివరాలు ఇవి.. ఏడాది క్రితం మొగల్తూరులోని ఆంధ్రాబ్యాంకు నుంచి ఈ గ్రూపు రూ.4.50 లక్షలు రుణం తీసుకున్నారు. ప్రతి నెలా రూ.18వేలు వాయిదా, పొదుపు రూ.1,300 బ్యాంకుకు జమచేసేవారు. చంద్రబాబు మాటలు నమ్మి మూడు నెలల నుంచి వాయిదాలు కట్టడం మానేశారు. ఈనెల 19లోపు రుణ వాయిదాలు కట్టకపోతే పొదుపు ఖాతా నుంచి రికవరీ చేస్తామని బ్యాంక్ మేనేజర్ కాగితంపై రాసి పంపించారని వాపోయారు. పైసాపైసా పోగుచేసుకుని వాయిదాలు కట్టుకుంటూ సుమారు రూ. 2లక్షలు పొదుపు చేసుకున్నామని వాటిని తీసుకుంటామని చెప్పడం ఎంతవరకు సభ్యులు దాసరి సత్యవతి, అనసూయ, సావిత్రి ,యాళ్ళ లక్ష్మి వాపోయారు. చంద్రబాబు మాటలు నమ్మడం వల్లే ఈపరిస్థితి ఏర్పడిందని, రుణాలు రద్దు చేస్తాననో, చేయననో ఏదో మాట చెపితే మాపాట్లు మేం పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
వడదెబ్బకు 13 మంది మృతి
మొగల్తూరు : జిల్లాలో కొద్ది రోజులుగా వీస్తున్న వడగాలులకు బుధవారం 13 మంది మృత్యు వాత పడ్డారు. నరసాపురం మండలం ముత్యాలపల్లి పంచాయతీ గెదళ్ళవంపు గ్రామానికి చెందిన తిరుమాని సోమరాజు(68) మంగళవా రం ఉదయం నుంచి వీచిన వేడి గాలులకు తట్టుకోలేక రాత్రి మృతిచెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ కోపనాతి పల్లయ్య, కేకేఎస్ పరామర్శించారు. పేరుపాలెం నార్త్ పంచాయతీకి చెందిన తిరుమాని లక్ష్మమ్మ(66) వడగాలులకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బల్లిపాడు(అత్తిలి) : అత్తిలి మండలం బల్లిపాడుకు చెందిన కొల్లు వజ్రం(80) వడదెబ్బకు మృతిచెందింది. కొద్దిరోజులుగా వీస్తున్న వడగాలులకు అస్వస్థతకు గురైన వృద్ధురాలు బుధవారం మధ్యాహ్నం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెనుమంట్ర : మండలంలో వడగాల్పులకు ఇద్దరు మృతిచెందారు. నెగ్గిపూడి గ్రామానికి చెందిన బొడ్డు సత్తియ్య(70) బుధవారం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. వికలాంగుడైన సత్తియ్యకు భార్య, కుమారుడు ఉన్నారు. వీఆర్వో ఏవీ సుభద్ర తహసిల్దార్‌కు సమాచారం అందించారు. వెలగలవారి పాలెంలో జామి పెద్దులు(55) వ్యవసాయ కూలీ మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అస్వస్థతకు గురైన పెద్దులను బుధవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. జోగన్నపాలెం(దెందులూరు) : జోగన్నపాలెంలో గారపాటి నాగేశ్వరరావు(75) బుధవారం వీచిన వడగాలులు తట్టుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీఆర్వో నాగరాణి తహసిల్దార్ కార్యాలయానికి నివేదిక అందజేశారు. వైసీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త సీహెచ్ అశోక్‌గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. లింగపాలెం : మండలంలోని గణపవారిగూడేనికి చెందిన గద్దె వజ్రమ్మ(55) బుధవారం వడగాల్పులకు మృతి చెందెంది. ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పాలకోడేరు రూరల్ : పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన పాలా పల్లమ్మ(75) మంగళవారం వీచిన వడగాలులకు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 8 గంటలకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొయ్యలగూడెం : మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతిచెందినట్లు రెవె న్యూ అధికారులు తెలిపారు. అంకాలగూడెం దళితవాడకు చెందిన సొంగా ఆశీర్వాదం(55) వ్యవసాయ కూలీ. పొలానికి వెళ్లి ఇంటికి వచ్చిన ఆయన వడగాలులకు స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కన్నాపురానికి చెందిన గెడ్డం చిన్ని(46) వడ్రంగి పనులు చేస్తుంటాడు. పనికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి వచ్చి పడిపోవడంతో వైద్యునికి చూపించగా వడదెబ్బకు ప్రాణాలు కోల్పోరుునట్లు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని వైసీపీ నాయకులు గాడిచర్ల సోమేశ్వరరావు, తాడిగడప రామకృష్ణ, టీడీపీ నాయకుడు గంధిపోం నాని కోరారు. పెనుమదం(పోడూరు) : పెనుమదం గ్రామంలో కాళ్లకూరి సర్వేశ్వరరావు(68) వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతిచెందాడు. అవివాహితుడైన ఇతను అక్క, బావల వద్ద ఉంటున్నాడు. వడగాల్పులకు నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుట్టాయగూడెం : గ్రామానికి చెందిన దేవరకొండ నాగరాజు(50) బుధవారం వడదెబ్బకు మృతిచెందాడు. వేడి గాలులకు రెండు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యూడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సీనియర్ కమ్యూనిస్టు పెంటయ్య కన్నుమూత భీమవరం టౌన్ : భీమవరం మండలం కొత్తపూసలమూరు గ్రామానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, సీపీఎం కార్యకర్త కామ్రేడ్ కొల్లాటి పెంటయ్య(82) వడదెబ్బకు గురై మంగళవారం మృతిచెందారు. గొల్లవానితిప్పలో సీఐడీ భూపోరాటంలో పెంటయ్య ముందుండి ప్రజలను నడిపించారని సీపీఎం డివిజన్ కార్యదర్శి చెప్పారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటని అన్నారు. సీపీఎం నాయకులు రేవు రామకృష్ణ తదితరులు పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.