బాబులుగాడి దెబ్బ గోల్కొండ అబ్బ వంటి డైలాగులతో రెబల్‌స్టార్‌గా సినీ జగత్తులో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు మృతితో గోదావరి జిల్లాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మొగల్తూరు రాజ సంస్థాన వారసుడిగా రాచరికపు ఆచారాలు, సంప్రదాయాలను ముందుండి పాటించడంతో పాటు సొంత ప్రాంత అభివృద్ధికి ఆయన విశేష కృషిచేశారు. నరసాపురం ఎంపీగా, కేంద్ర మంత్రిగా గ్రామాల్లో రహదారులు, వంతెనలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేశారు. సహాయం చేయడంలో మనసున్న మా‘రాజు’గా నిలిచారు.
సాక్షి, నరసాపురం/మొగల్తూరు: మొగల్తూరుకోట సంస్థానంలో 1940 జనవరి 20న ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు, లక్ష్మీదేవి దంపతులకు పెద్ద కుమారుడిగా కృష్ణంరాజు జన్మించారు. తండ్రి సత్యనారాయణరాజు కోటలోని వ్యవహారాలు, పొలాల బాధ్యతలు చూసే వారు. వాస్తవానికి కృష్ణంరాజు వంశీయులది తూర్పుగోదావరి జిల్లా జి.ఎర్రంపాలెం కాగా తండ్రి చిన్నతనంలోనే మొగల్తూరు వచ్చారు. కృష్ణంరాజు బాల్యం మొగల్తూరులోనే గడిచింది. ఐదో తరగతి వరకు స్థానికంగా, ఎస్‌ఎస్‌ఎల్‌సీ నరసాపురంలోని టేలర్ స్కూల్‌లో చదివారు. డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1969లో కోట సంస్థానాదీశులు కలిదిండి లక్ష్మీ కాంతరాజ బహుద్దూర్ (గాంధీబాబు) కు మార్తె సీతాదేవిని వివాహమాడగా అల్లుడు హోదా లో సంస్థాన వారసుడు అయ్యారు. 1995లో కారు ప్రమాదంలో సీతాదేవి మృతి చెందగా 1996లో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. శ్యామలాదేవికి కూడా మొగల్తూరు సంస్థానాదీశులతో బంధుత్వం ఉంది.
ఓడి.. గెలిచిన నాయకుడిగా..
స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం గల కృష్ణంరాజు అదే పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1998లో బీజేపీలో చేరి కాకినాడ లోక్‌సభ స్థానంలో ఎంపీగా గెలుపొందారు. 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో నరసాపురం నుంచి పోటీచేసి లక్షన్నర మెజార్టీతో గెలుపొందారు. ఆనాటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పారీ్టలో చేరినా కొంతకాలానికి మళ్లీ బీజేపీ గూటికి వచ్చారు.
సొంతూరిపై మమకారం
కృష్ణంరాజు మొదటి నుంచీ సొంతూరుపై మమకారం చూపారు. మొగల్తూరు నుంచి భీమవరం మండలం వెంప గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం ఆనాటి ముఖ్యమంత్రి జనార్దనరెడ్డితో మాట్లాడి రూ.80 లక్షలు మంజూరు చేయించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో స్వజలధార పథకంలో జిల్లాలో పలు గ్రామాలకు లక్షలాది నిధులు మంజూరు చేయించారు. 214 జాతీయ రహదారిని 216 ఏగా మారి్పంచి నరసాపురం, మొగల్తూరు మండలాలను కలుపుతూ ఒంగోలు వరకూ రోడ్డును విస్తరింపజేశారు. ఆయన తరచూ సొంతూరుకు వచ్చి చిన్ననాటి స్నేహితులను కలిసేవారు. మొగల్తూరు వస్తే సొంతింటిలోనే బస చేసేవారు.
గోదావరి ముద్దు బిడ్డగా..
రాచరికపు ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలో ముందుండే కృష్ణంరాజు కుటుంబంలో ఏ కార్యక్రమమైనా సొంతింటిలోనే జరిపించేవారు. గోదావరిపై మక్కువతో ఆయన నటించిన చిత్రాల్లో గోదావరి పాటలను ఉండేలా చూసేవారు. గోదావరి పుష్కరాలకు సతీసమేతంగా హాజరయ్యేవారు. నరసాపురం వశిష్ట గోదావరి, మొగల్తూరులోని సముద్ర తీర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్‌లు చేశారు.
సొంతింట్లో 4 నెలల విశ్రాంతి
బంగారుతల్లి సినిమా షూటింగ్ నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో జరుగుతున్న సమయంలో ఆయన గాయంతో కాలు విరిగి నాలుగు నెలలపాటు మొగ ల్తూరులోని నివాసంలోనే విశ్రాంతి తీసుకున్నారు.
మొగల్తూరు మొనగాళ్లుగా..
మొగల్తూరు ప్రాంతానికి చెందిన కృష్ణంరాజు, చిరంజీవి సినీ పరిశ్రమలో అగ్రహీరోలుగా వెలుగొందడాన్ని ఈ ప్రాంతవాసులు గొప్పగా చెప్పుకునేవారు. కృష్ణంరాజు రైతుగా వ్యవసాయం కూడా చేశారు. రెబల్ పాత్రలతో రెబల్‌స్టార్‌గా పేరుపొందారు.
స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత
మొగల్తూరులో వ్యాపారులు ఆదివారం స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపారు. మొగల్తూరు అందే బాపన్న జూనియర్ కళాశాల, కోట్ల రంగారావు డిగ్రీ కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టు యాజమాన్యాలు తెలిపాయి.
ఏజెన్సీతో ప్రత్యేక అనుబంధం
బుట్టాయగూడెం: కృష్ణంరాజుకు పశి్చమ ఏజెన్సీతో ప్రత్యేక అనుబంధం ఉంది. దర్శకుడు బాపూ దర్శకత్వంలో 1976లో విడుదలైన భక్త కన్నప్ప సినిమాలోని పలు సన్నివేశాలను బుట్టాయగూడెం సమీపంలోని ఇప్పలపాడు, దొరమామి డి, అలివేరు, పట్టిసీమ ప్రాంతాల్లో చిత్రీకరించారు. దాదాపు నెల పాటు షూ టింగ్ జరగ్గా.. కరాటం కృష్ణమూర్తి, చంద్రయ్య ఇంటి వద్ద కృష్ణంరాజు బసచేశారు.
ఇప్పలపాడు గ్రామం పక్కన ప్రత్యేక సెట్టింగ్స్‌తో గిరిజన గూడేన్ని ఏర్పాటుచేశారు. ప్రధాన సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ విరా మ సమయంలో ఇప్పలపాడులోని వీధుల్లో కృష్ణంరాజు సాధారణ వ్యక్తిగా తిరుగుతూ అందరినీ పలకరించేవారని అప్పటి షూటింగ్‌ను తిలకించిన గిరిజనులు అంటున్నారు. మొక్కజొన్న పొత్తులను ఇష్టంగా తినేవారని చెబుతున్నా రు. అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment