
సాక్షి, పశ్చిమ గోదావరి: రెబల్‌స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు కారుమూరి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుతో కలిసి హాజరయ్యారు టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈ సందర్భంగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలసి మంత్రులంతా కలిసి సానుభూతి తెలిపారు.
కృష్ణంరాజు మరణంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారని, సినీ-రాజకీయ రంగాల్లో రాణించిన ఆయన మృతి ఆయా రంగాలకు తీరని లోటని మంత్రి రోజా అన్నారు. ఆయన పేరిట మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల స్థలం రాష్ట్ర టూరిజం డిపార్ట్‌మెంట్ తరపున కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని, రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని, ఇదే విషయాన్ని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సైతం తెలిపామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment