Memorial Park
-
నేడు పులివెందులకు సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘పేదల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాన్న రెండు అడుగులు ముందుకేస్తే, ఆయన కొడుకుగా నాలుగు అడుగులు ముందుకేస్తా... మీ బిడ్డగా నాక్కావాల్సింది మీ ప్రేమాభిమానాలు..ప్రతి ఇంట్లో ఉన్నట్లుగా నాన్న ఫొటో పక్కన నా ఫొటో కూడా చేరాలి’ విపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. గత నాలుగున్నరేళ్ల పాలనతో అచ్చం అలాగే పేదలకు పెన్నిధిగా మారారు సీఎం జగన్. ఒకవైపు రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తూనే.. తాను పుట్టిన గడ్డ వైభోవపేతానికి విశేష కృషీ చేస్తున్నారు. పులివెందుల సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. రూ.861.84 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్. ఓవైపు జిల్లా కేంద్రమైన కడపను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దారు. అత్యాధునిక వైద్య సేవలకు నిలయంగా నెలకొల్పారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు పుట్టిన గడ్డ పులివెందుల రుణం తీర్చుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారు. ఏపీఎంఎస్ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్) ద్వారా రూ.500కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించారు. పార్లమెంట్‌పరిధిలో ఒక మెడికల్ కళాశాల నిర్మించాలని సంకల్పించిన సీఎం, డిసెంబర్ 26, 2019న పులివెందులలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.తర్వాత రెండేళ్లు కోవిడ్ వైరస్ కారణంగా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 627 పడకల వసతి గల ఆస్పత్రి, ఏడాదికి 150 మెడికల్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లల్లో విద్యార్థులు విద్యను అభ్యసించేలా నెలకొల్పారు. జీ ఫ్లస్ 3గా నిర్మించిన ఈ భవనాలు ఒక్కొక్క ఫ్లోర్ 37,300 చదరపు అడుగులతో చేపట్టారు. రాబోయే విద్యాసంవత్సరానికి మెడికల్ కళాశాల అందుబాటులోకి వచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారు. ఏర్పాట్ల పరిశీలన పులివెందుల రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11వ తేదీ పులివెందుల ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన పర్యటించే ప్రాంతాలను జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్,పరిశీలించారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించే వైఎస్సార్ మెడికల్ కళాశాల, కళాశాలలోని భవనాలను పరిశీలించారు. అనంతరం బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్, మినీ సెక్రటేరియట్ భవనాన్ని, వైఎస్సార్ సర్కిల్ బోలేవార్డు షాపింగ్ కాంప్లెక్స్ గాంధీ సర్కిల్, ఉలిమెల్ల లే క్ ఫ్రంట్, అక్కడే నూతనంగా నిర్మించిన ఆదిత్యా బిర్లా గార్మెంట్ లిమిటెడ్ ఇండస్ట్రీని, సంయుగ్లాస్ ఇండస్ట్రీని వారు పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: ఏస్పీ పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఈనెల11 జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ పోలీసులకు సూచించారు. ఆదివారం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ కడప ఎయిర్ పోర్టు, పులివెందుల హెలీప్యాడ్, ప్రారంభోత్సవాలు జరిగే ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేయాలన్నారు.అదనపు ఎస్పీ సుధాకర్,స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌బ్యూరో అదనపు ఎస్పీ వెంకటరాముడు, కర్నూల్ అదనపు ఎస్పీ నాగరాజు పాల్గొన్నారు. అందుబాటులోకి ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పులివెందుల కేంద్రంగా నూతనంగా నిర్మించిన ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్‌ను సైతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.175 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి 2021 డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల (పీఎల్ఐ) పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ టెక్స్టైల్స్, బ్రాండెడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. ఏటా 24లక్షల గార్మెంట్స్ తయారీ సామర్థంతో నెలకొల్పిన ఈ యూనిట్లో 2100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దారు. తొలిదశగా 500మందికి ఉద్యోగాలు కల్పించారు. వైఎస్సార్ మెమోరియల్ పార్క్ ఇడుపులపాయ కేంద్రంగా రూ.39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ పార్క్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో 48 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంతోపాటు, అడియో విజువల్, ఫొటో గ్యాలరీ, పెవిలియన్ బ్లాక్స్‌తోపాటు, రెస్టారెంట్, చిల్డ్రన్స్ పార్క్, గార్డెన్స్ నిర్మించారు. పులివెందుల సమీపంలో రూ.66 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉలిమెల్ల లేక్‌ను ప్రారంభించనున్నారు. మ్యూజికల్ లేజర్ ఫౌంటేన్, కిడ్స్‌ప్లే ఏరియా తదితర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. మరో రూ.20 కోట్లతో నిర్మించిన బ నానా ప్యాక్ హౌస్‌ను ప్రారంభించనున్నారు. మొత్తంగా పులివెందుల నియోజకవర్గంలో రూ.861.84కోట్ల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించనున్నారు. -
విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం, స్మతివనంపై సీఎం జగన్ సమీక్ష
-
CM YS Jagan: నిర్దేశిత గడువులోగా అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం
సాక్షి, అమరావతి: అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల ఎత్తుండే అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనుల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విగ్రహం తయారీ, దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులతో చర్చించారు. అత్యంత నాణ్యతతో అందంగా నిర్మాణాలు ఉండాలని, పనుల పర్యవేక్షణకు ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 125 అడుగుల ఎత్తుండే విగ్రహంతో పాటు పీఠంతో కలిపి మొత్తంగా 206 అడుగుల ఎత్తు వస్తుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పీఠం భాగంలో జీ ప్లస్ టూ నిర్మాణం ఉంటుందన్నారు. ఈ ప్రాంగణంలో 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం రూ.268 కోట్లు అని, విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన కొన్ని భాగాలను ఇప్పటికే తరలించామని.. కారు, బస్ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నామని వివరించారు. మీ (సీఎం) ఆదేశాల మేరకు స్మృతివనం వరకు రోడ్లను సుందరీకరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సృజన, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మొగల్తూరు: కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రి రోజా
-
కృష్ణంరాజు స్మృతి వనం.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, పశ్చిమ గోదావరి: రెబల్‌స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు కారుమూరి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుతో కలిసి హాజరయ్యారు టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈ సందర్భంగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలసి మంత్రులంతా కలిసి సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు మరణంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారని, సినీ-రాజకీయ రంగాల్లో రాణించిన ఆయన మృతి ఆయా రంగాలకు తీరని లోటని మంత్రి రోజా అన్నారు. ఆయన పేరిట మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల స్థలం రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ తరపున కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని, రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని, ఇదే విషయాన్ని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సైతం తెలిపామని వెల్లడించారు. -
BR Ambedkar: స్మృతివనం చరిత్రాత్మకం
Ambedkar Death Anniversary 2021: సమాజ దిశా నిర్దేశాన్ని ప్రభావితం చేసి, ఒక సమున్నత ఆశయం కోసం కృషి చేసిన యుగపురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. అనేక వివక్షలకు గురైనా తన పట్టుదలతో రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కర్తగా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నారు. ఇరవై మిలియన్ ఓట్లతో ‘ద గ్రేటెస్ట్ ఇండియన్’గా గుర్తింపు పొందారు. ప్రముఖ ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్.. అంబేడ్కర్‌ను ‘భూమి ఉన్నంతకాలం దేశ అత్యున్నత ఆర్థికవేత్త’గా పేర్కొన్నారు. అమర్త్య సేన్ ‘భారత ఆర్థిక రంగ పితామహుడి’గా అభివర్ణించారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ ఆఫ్ వెస్ట్రన్ కెనడా ఆయన జయంతిని ‘సమానత్వ దినోత్సవం’గా జరుపుకోవాలని నిశ్చయించింది. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న మసాచుసెట్స్ యూనివర్సిటీలోనూ, న్యూయార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయంలోనూ, బ్రాండియస్ యూనివర్సిటీలలోనూ ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు. భారత పార్లమెంట్ ఆయన విగ్రహాన్ని సెంట్రల్ హాల్లో ప్రతిష్ఠించి గౌరవించింది. అటువంటి మహనీయునికి స్మృతివనం నిర్మించడం అంటే ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు కంకణబద్ధులు కావడమే. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదాన్‌లో (పి.డబ్లు్య.డి. గ్రౌండ్స్) స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం అంబేడ్కర్ అభిమానులకు, ప్రజాస్వామ్యవాదులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇరవై ఎకరాల స్ధలంలో నిర్మిస్తున్న ఈ స్మృతివనంలో 125 అడుగుల విగ్రహంతో పాటు ఆయన జీవిత విశేషాలను ప్రదర్శించేందుకు మ్యూజియం, గ్యాలరీ, ఇంకా పుస్తక పఠనంతో జ్ఞాన సముపార్జన చేసిన అంబేడ్కర్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ అంతర్జాతీయ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా అధికారులతో చర్చించి 2022 ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకుగానూ 249 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్కర్ స్మృతివనం చరిత్రాత్మకం కానున్నది. గత ప్రభుత్వం నగరానికి దూరంగా నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు చిత్తశుద్ధి లోపం కారణంగా ఐదేళ్ల కాలంలో అతీగతీ లేకుండా పోయింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2020 జూలై 8న శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. దీని ద్వారా ముఖ్యమంత్రి దళిత, ఆదివాసీ, అట్టడుగు వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అర్థమవుతోంది. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయం. – నేలపూడి స్టాలిన్ బాబు సామాజిక రాజకీయ విశ్లేషకులు (నేడు అంబేడ్కర్ వర్ధంతి) -
అయ్యా మోదీ.. నీ ఎన్నికల సభ కాదిది!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. అయితే వార్‌మెమోరియల్ ప్రారంభ సమావేశంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడంపై పలు పార్టీల నాయకులు, మేధావులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ అయితే.. ‘మోదీ.. ఇది నీ ఎన్నికల సభ అనుకుంటున్నావా?’ అని ఘాటుగా ప్రశ్నిస్తోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకునే సందర్భంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడం ఏంటని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. జవాన్ల మరణాన్ని కూడా ఓట్లు, రాజకీయాల కోసం మోదీ వాడుకుంటున్నారని మండిపడ్డారు. అమరుల స్మారక సభను.. ఎన్నికల ప్రచార సభగా మార్చి వీర జవాన్ల త్యాగాలను అవమానించవద్దని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా ఏర్పాటు కానీ జాతీయ యుద్ధ స్మారక ఏర్పాటు క్రెడిట్ మోదీదేనని, కానీ ఆయన రాజకీయ ప్రసంగమే తీవ్రంగా నిరాశపర్చిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా తెలిపారు. ఆయన ప్రసంగంతో స్మారక సభ కాస్త బీజేపీ ఎన్నికల ప్రచార సభగా తలిపించిందన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని తప్పుబట్టారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల శౌర్యాన్ని దేశం గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలో రాజకీయప్రత్యర్థులపై విమర్శలు చేయడం సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఇక బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. చదవండి: యుద్ధ స్మారకం అంకితం -
యుద్ధ స్మారకం అంకితం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. అందుకే స్మారక నిర్మాణం ఇంత ఆలస్యమైందన్నారు. స్మారక ఆవిష్కరణకు ముందు కొంతమంది మాజీ సైనికులతో మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామని మోదీ అన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పుతుందని చెప్పారు. నాలుగు ఏకకేంద్రక వృత్తాల్లో.. అమర చక్ర, వీరతా చక్ర, త్యాగ చక్ర, రక్షక చక్ర అనే నాలుగు ఏక కేంద్రక వృత్తాల ఆకారంలో, రూ. 176 కోట్ల నిధులతో స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నాలుగు వృత్తాల కేంద్రంలో ఓ రాతి స్థూపం, అమరజ్యోతి ఉంటాయి. వీరతా చక్రలో భారత సైన్యం పోరాడిన యుద్ధాల నమూనా చిత్రాలను కాంస్య లోహంతో చేసి గోడలపై అమర్చారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం యుద్ధాల్లో పోరాడినట్లుగా చూసే ఆరు కుడ్య చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం అమరులైన సైనికుల సంస్మరణ కోసం ఓ స్మారకాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా ప్రతిపాదన ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడలేదు. చివరకు మోదీ ప్రభుత్వం 2015లో స్మారక నిర్మాణానికి పచ్చజెండా ఊపగా, పనులు మాత్రం గతేడాది ఫిబ్రవరిలోనే ప్రారంభమయ్యాయి. ఈ స్మారకంలో గ్రాఫిక్ ప్యానెళ్లు, రాతి కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి. స్మారకం అమరసైనికులకు అంజలి ఘటించే ప్రదేశంగా ఉంటుంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జాతీయ స్మారకాన్ని ఆవిష్కరించడం ఓ చరిత్రత్మాక ఘట్టమనీ, ఇప్పుడు భారతీయుల తీర్థయాత్రలకు మరో ప్రదేశం అందుబాటులోకి వచ్చిందన్నారు. స్మారకం విశేషాలు ► ఇండియా–చైనా(1962), ఇండియా–పాక్ (1947,1965,1971), కార్గిల్(1999) యుద్ధాల సమయంలో, శ్రీలంకలో శాంతి పరిరక్షక దళంలో ఉంటూ అమరులైన 25,942 మంది భారత సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. ► స్మారక స్థూపం పొడవు 15.5 మీటర్లు. కింది భాగంలో అమరజ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ రాతి స్థూపం చుట్టూ నాలుగు ఏక కేంద్రక వృత్తాకార వలయాలను నిర్మించారు. ► అన్నింటికన్నా బాహ్య వలయానికి రక్షక చక్ర అని పేరు పెట్టి ఆ వలయం మధ్యమధ్యల్లో 600 మొక్కలు నాటారు. ఈ మొక్కలే సైనికులుగా, దేశానికి కాపలా కాస్తున్న వారుగా దీనిని చిత్రీకరించారు. ► త్యాగ చక్ర వలయంలో 16 గోడలను నిర్మించారు. వీటిపైనే అమర సైనికుల పేర్లను గ్రానైట్ ఫలకాలపై బంగారు వర్ణంలో లిఖించారు. సైనికులకు నివాళి అర్పించే స్థలం ఇదే. ఈ గ్రానైట్ ఫలకాలను పురాతన కాలం నాటి భారతీయ యుద్ధ తంత్రం చక్రవ్యూహం ఆకారంలో అమర్చారు. ► స్మారకంలో భాగంగా ఏర్పాటు చేసిన పరమ్ యోధ స్థల్లో పరమ వీర చక్ర పురస్కారం పొందిన 21 మంది సైనికుల విగ్రహాలను నెలకొల్పారు. వీటిలో సజీవులైన సుబేదార్ మేజర్ బానాసింగ్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ సంజయ్ కుమార్ల విగ్రహాలు ఉన్నాయి. -
సాగర్ తీరాన అమరుల స్తూపం
12 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల స్మారకార్థం హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ తీరాన స్తూపాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాదాపు 12 ఎకరాల స్థలంలో స్మృతి వనాన్ని నిర్మించి, దానిలో ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరుల త్యాగనిరతిని భవిష్యత్తు తరాలు తలుచుకునేలా స్మృతి వనం నిర్మాణం జరగాలని సూచించారు. ఇందుకు వీలుగా హుస్సేన్‌సాగర్ ఒడ్డున సచివాలయానికి సమీపంలో ఉన్న పర్యాటక శాఖ, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, విద్యుత్ తదితర శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈ స్థూపం, స్మృతి వనాలకు రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ రెండో తేదీన శంకుస్థాపన చేయనున్నారు. వీటి నిర్మాణ పనుల బాధ్యతలను రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు. సాహితీ సాంస్కృతిక కేంద్రంగా.. వివిధ రూపాల్లో నిక్షిప్తమై ఉన్న తెలంగాణ చరిత్ర, సంస్కృతులతో స్మృతి వనాన్ని సాహిత్య సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ కోసం తమ జీవిత కాలమంతా పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రను పొందుపరచాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అమరుల స్మృతి వనాన్ని ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ‘‘ఎవరన్నా అక్కడికి వెళ్తే ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేసుకునేటట్టుండాలె. అక్కడి నుంచి వెళ్లబుద్ధికావొద్దు. తెలంగాణ గౌరవం ఉట్టిపడేటట్టు తీర్చిదిద్దాలె. ముందువైపు బుద్ధుడు.. ఆ వెనుక అంబేద్కర్.. ఈ రెండింటి వెనుక సచివాలయం ఉన్నది. వీటికి ముందు ఎత్తయిన అమర వీరుల స్థూపం నిర్మించాలి..’’ అని కేసీఆర్ సూచించారు. వెంటనే పనులు ప్రారంభించాలని, వేగంగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ (జాతీయ రహదారులు) గణపతిరెడ్డిని ఆదేశించారు. దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకం తెలంగాణ రెండో ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు ఘనంగా నివాళి అర్పించాలని సూచించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. వినూత్న రీతిలో కార్యక్రమాలను రూపొందించే బాధ్యతను సాంస్కృతిక శాఖకు అప్పగించారు. ఇక హుస్సేన్‌సాగర్ తీరాన దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో... 66 అడుగుల పొడవు, 99 అడుగుల వెడల్పున్న అతిపెద్ద జాతీయ పతాకం ఉందని పేర్కొన్నారు. అంతకన్నా ఎత్తుగా 301 అడుగుల ఎత్తులో పెద్ద జాతీయ పతాకాన్ని తెలంగాణలో ఎగురవేయాలని చెప్పారు. సమావేశంలో ఎంపీ బాల్క సుమన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.