సాగర్ తీరాన అమరుల స్తూపం
12 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల స్మారకార్థం హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ తీరాన స్తూపాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాదాపు 12 ఎకరాల స్థలంలో స్మృతి వనాన్ని నిర్మించి, దానిలో ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరుల త్యాగనిరతిని భవిష్యత్తు తరాలు తలుచుకునేలా స్మృతి వనం నిర్మాణం జరగాలని సూచించారు.
ఇందుకు వీలుగా హుస్సేన్‌సాగర్ ఒడ్డున సచివాలయానికి సమీపంలో ఉన్న పర్యాటక శాఖ, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, విద్యుత్ తదితర శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈ స్థూపం, స్మృతి వనాలకు రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ రెండో తేదీన శంకుస్థాపన చేయనున్నారు. వీటి నిర్మాణ పనుల బాధ్యతలను రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు.
సాహితీ సాంస్కృతిక కేంద్రంగా..
వివిధ రూపాల్లో నిక్షిప్తమై ఉన్న తెలంగాణ చరిత్ర, సంస్కృతులతో స్మృతి వనాన్ని సాహిత్య సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ కోసం తమ జీవిత కాలమంతా పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రను పొందుపరచాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అమరుల స్మృతి వనాన్ని ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ‘‘ఎవరన్నా అక్కడికి వెళ్తే ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేసుకునేటట్టుండాలె. అక్కడి నుంచి వెళ్లబుద్ధికావొద్దు. తెలంగాణ గౌరవం ఉట్టిపడేటట్టు తీర్చిదిద్దాలె. ముందువైపు బుద్ధుడు.. ఆ వెనుక అంబేద్కర్.. ఈ రెండింటి వెనుక సచివాలయం ఉన్నది. వీటికి ముందు ఎత్తయిన అమర వీరుల స్థూపం నిర్మించాలి..’’ అని కేసీఆర్ సూచించారు. వెంటనే పనులు ప్రారంభించాలని, వేగంగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ (జాతీయ రహదారులు) గణపతిరెడ్డిని ఆదేశించారు.
దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకం
తెలంగాణ రెండో ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు ఘనంగా నివాళి అర్పించాలని సూచించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. వినూత్న రీతిలో కార్యక్రమాలను రూపొందించే బాధ్యతను సాంస్కృతిక శాఖకు అప్పగించారు. ఇక హుస్సేన్‌సాగర్ తీరాన దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించారు.
ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో... 66 అడుగుల పొడవు, 99 అడుగుల వెడల్పున్న అతిపెద్ద జాతీయ పతాకం ఉందని పేర్కొన్నారు. అంతకన్నా ఎత్తుగా 301 అడుగుల ఎత్తులో పెద్ద జాతీయ పతాకాన్ని తెలంగాణలో ఎగురవేయాలని చెప్పారు. సమావేశంలో ఎంపీ బాల్క సుమన్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.