
సాక్షి, మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అశ్లీల చిత్రాలు తీవ్ర అలజడి రేపుతున్నాయి. మొగల్తూరులోని ఓ సెల్‌ఫోన్ రిపేర్ సెంటర్ నిర్వాహకుడు... తన దగ్గరకు ఫోన్స్ రిపేర్స్ కోసం వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేసి.. వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో సదరు కామాంధుడితోపాటు అతని వద్ద పనిచేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
మొగల్తూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో నిందితుడు సెల్‌ఫోన్ రిపేర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతని వద్దకు వచ్చే మహిళలు, యువతులకు మాయామాటలు చెప్పి ట్రాప్ చేసేవాడు. వారితో చనువు పెంచుకొని.. ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. అయితే.. అతని వద్ద ఫోన్ రిపేర్ పనులు నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువకుడు.. యజమాని ఫోన్‌లోని అశ్లీల చిత్రాలను చూసి షాక్ అయ్యాడు. అశ్లీల వీడియోలను తన ఫోన్‌లోకి ఫార్వర్డ్ చేసుకున్నాడు. అలా ఆ విజువల్స్.. తన స్నేహితులకు ఫార్వర్డ్ చేశాడు. సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ అయిన ఆ విజువల్స్ చివరికి బాధితుల ఫోన్లకు చేరటంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో బాధితురాలు ఒకరు పోలీసులను ఆశ్రయించటంతో.. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఫోన్లను సీజ్ చేశారు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలను నిందితుడు వంచించాడని, ఆ కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment