మొగల్తూరు :గోదావరి అంటే తనకు అవ్యాజమైన ప్రేమానురాగాలు.. అంతులేని అభిమానం ఉన్నాయని రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో ఆయన ఏమంటున్నారంటే.. ‘నా తమ్ముడు కుమారుడు ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం ఈనెల 10న విడుదలవుతున్న కారణంగా కొంత బిజీగా ఉన్నాను. 19వ తేదీన వస్తున్నాను. రాజమండ్రి, కొవ్వూరు ఘాట్లలో పుష్కర స్నానం చేయబోతున్నాను. ఆ తరువాత నరసాపురం చేరుకుంటాను. ఇప్పటివరకూ గోదావరిలో మూడుసార్లు పుష్కర స్నానం చేశాను.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాతో కలసి ఒకసారి పుష్కర స్నానం చేసాడు. ఈసారి రాగలడో లేదో చెప్పలేను. 2003 పుష్కరాల సమయంలో కేంద్రమంత్రి హోదాలో నరసాపురం నుంచి కొవ్వూరు వరకు గల 29 ఘాట్లను జోరున కురుస్తున్న వర్షంలో వెళ్లి పరిశీలించాను. గోదావరి గుర్తొచ్చినా.. గోదారమ్మ పాటలు విన్నా నాకెంతో హాయిగా ఉంటుంది.
నా సినిమాలన్నీ గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనే చిత్రీకరించాను. బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప సినిమాలు పూర్తిగా గోదావరి ప్రాంతాల్లో రూపుదిద్దుకున్నవే. 1969లో తీసిన అమ్మకోసం సినిమా షూటింగ్‌ను పాపికొండలు ప్రాంతంలో చేశాం. గంగా నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ గడ్డలో పుట్టిన బిడ్డగా నేను మన గోదావరి నది ప్రక్షాళనకు కృషి చేస్తున్నాను. గోదావరిపై త్వరలో షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాను. అందరికీ గోదావరి పుష్కర శుభాకాంక్షలు. ఆ తల్లి దయతో మీరంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
- మీ కృష్ణంరాజు
గోదారంటే అంతులేని అభిమానం
Published Thu, Jul 9 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement