మొగల్తూరు: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రాకతో గురువారం మొగల్తూరు జాతరను తలపించింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి అభిమానులు తరలిరావడంతో జాతీయ రహదారిలో తరచూ ట్రాఫిక్ స్తంభించింది. వేకువజామున హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో గ్రామానికి చేరుకున్న ప్రభాస్ ఉదయం 10 గంటల ప్రాంతంలో అభిమానులకు అభివాదం చేసేందుకు బయటకు వచ్చారు. అప్పటికే వేలాది మంది అభిమానులు కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు.
అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మెస్‌లు ఏర్పాటుచేశారు. మెస్ ఆవల నుంచే ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తిలు అభిమానులకు అభివాదం చేశారు. సుమారు 50 వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారని అంచనా వేస్తున్నారు. డీఎస్పీ వీరాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 20 మంది అధికారులు, 600 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
మంత్రులు, ఎమ్మెల్యేల పరామర్శ
ప్రభాస్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు ఆర్‌కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ట, కారుమూరి నాగేశ్వరరావు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పరామర్శించారు. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. కార్యక్రమంపై నిర్వాహకులను సంప్రదించగా ఎడిట్ చేసిన ఇన్‌పుట్‌లు, ఫొటోలు పంపుతామని చెప్పినా ఫలితం లేదు.
పసందైన భోజనం
కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి మొగల్తూరు మండలంలోని 17 గ్రామాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా నాయకులు, స్థానికులకు ఆహ్వానం అందింది. శాఖాహార, మాంసాహార భోజనాలు అందించారు. సుమారు 20 మాంసాహార రకాలు వడ్డించారు.
Comments
Please login to add a commentAdd a comment