Former Union Minister Krishnam Raju
-
త్వరలోనే కోనసీమకు రైలు కూత
కేక్ కట్ చేసిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అమలాపురం రూరల్ : కేంద్ర రైల్వే బడ్జెట్లో కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌కు రూ.200 కోట్లు కేటాయించడంతో త్వరలోనే నిర్మాణ పనులు మొదలై అంతే త్వరలో కోనసీమలో రైలు కూత వినిపించనుందని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. రైల్వే లైను శిలాఫలకం వద్ద శుక్రవారం జరిగిన సంబరాల్లో ఆయన కేక్ కట్ చేశారు. 2000 సంవత్సరంలో నాటి ఏన్డీఏ ప్రభుత్వంలో కోనసీమ రైలుకు పునాదిరాయి పడితే, నేడు అదే ప్రభుత్వంలో ఆ రైలు సాకారమవుతోందన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు అయితాబత్తుల అభిషేక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు, రాష్ట్ర కిసాన్‌మోర్చా అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
గోదారంటే అంతులేని అభిమానం
మొగల్తూరు :గోదావరి అంటే తనకు అవ్యాజమైన ప్రేమానురాగాలు.. అంతులేని అభిమానం ఉన్నాయని రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో ఆయన ఏమంటున్నారంటే.. ‘నా తమ్ముడు కుమారుడు ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం ఈనెల 10న విడుదలవుతున్న కారణంగా కొంత బిజీగా ఉన్నాను. 19వ తేదీన వస్తున్నాను. రాజమండ్రి, కొవ్వూరు ఘాట్లలో పుష్కర స్నానం చేయబోతున్నాను. ఆ తరువాత నరసాపురం చేరుకుంటాను. ఇప్పటివరకూ గోదావరిలో మూడుసార్లు పుష్కర స్నానం చేశాను. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాతో కలసి ఒకసారి పుష్కర స్నానం చేసాడు. ఈసారి రాగలడో లేదో చెప్పలేను. 2003 పుష్కరాల సమయంలో కేంద్రమంత్రి హోదాలో నరసాపురం నుంచి కొవ్వూరు వరకు గల 29 ఘాట్లను జోరున కురుస్తున్న వర్షంలో వెళ్లి పరిశీలించాను. గోదావరి గుర్తొచ్చినా.. గోదారమ్మ పాటలు విన్నా నాకెంతో హాయిగా ఉంటుంది. నా సినిమాలన్నీ గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనే చిత్రీకరించాను. బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప సినిమాలు పూర్తిగా గోదావరి ప్రాంతాల్లో రూపుదిద్దుకున్నవే. 1969లో తీసిన అమ్మకోసం సినిమా షూటింగ్‌ను పాపికొండలు ప్రాంతంలో చేశాం. గంగా నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ గడ్డలో పుట్టిన బిడ్డగా నేను మన గోదావరి నది ప్రక్షాళనకు కృషి చేస్తున్నాను. గోదావరిపై త్వరలో షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాను. అందరికీ గోదావరి పుష్కర శుభాకాంక్షలు. ఆ తల్లి దయతో మీరంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. - మీ కృష్ణంరాజు