డ్వాక్రా మహిళలకూ బ్యాంకు నోటీసు
మొగల్తూరు : ఎన్నికలకు ముందు వ్యవసాయ, రుణాలను రద్దు చేస్తామని హోరెత్తించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రుణాల రద్దు గురించి మాట్లాకపోవడం దారుణమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు వరకు ఎప్పటికప్పుడు వాయిదాలు కట్టేసేవాళ్లమని, చంద్రబాబు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాననడంతో వాయిదాలు కట్టడం మానేయడంతో అధికారులు తమపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని మహిళలు వాపోతున్నారు. మండలంలోని మోడి గ్రామానికి చెందిన జయలక్ష్మి గ్రూపు అధ్యుక్షురాలు దాసరిజయ, సభ్యులు వెంకాయమ్మ, ధనలక్ష్మి వివరాలు ఇవి.. ఏడాది క్రితం మొగల్తూరులోని ఆంధ్రాబ్యాంకు నుంచి ఈ గ్రూపు రూ.4.50 లక్షలు రుణం తీసుకున్నారు. ప్రతి నెలా రూ.18వేలు వాయిదా, పొదుపు రూ.1,300 బ్యాంకుకు జమచేసేవారు.
చంద్రబాబు మాటలు నమ్మి మూడు నెలల నుంచి వాయిదాలు కట్టడం మానేశారు. ఈనెల 19లోపు రుణ వాయిదాలు కట్టకపోతే పొదుపు ఖాతా నుంచి రికవరీ చేస్తామని బ్యాంక్ మేనేజర్ కాగితంపై రాసి పంపించారని వాపోయారు. పైసాపైసా పోగుచేసుకుని వాయిదాలు కట్టుకుంటూ సుమారు రూ. 2లక్షలు పొదుపు చేసుకున్నామని వాటిని తీసుకుంటామని చెప్పడం ఎంతవరకు సభ్యులు దాసరి సత్యవతి, అనసూయ, సావిత్రి ,యాళ్ళ లక్ష్మి వాపోయారు. చంద్రబాబు మాటలు నమ్మడం వల్లే ఈపరిస్థితి ఏర్పడిందని, రుణాలు రద్దు చేస్తాననో, చేయననో ఏదో మాట చెపితే మాపాట్లు మేం పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.