ఆ ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దుచేయాలి: వైఎస్‌ జగన్‌ | ys jaganmohan reddy console Aqua factory victims | Sakshi
Sakshi News home page

ఆ ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దుచేయాలి: వైఎస్‌ జగన్‌

Published Thu, Mar 30 2017 7:24 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

ఆ ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దుచేయాలి: వైఎస్‌ జగన్‌ - Sakshi

ఆ ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దుచేయాలి: వైఎస్‌ జగన్‌

నరసాపురం (పశ్చిమ గోదావరి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆక్వా ఫ్యాక్టరీల లైసెన్సులను రద్దు చేయాలని, ఇలాంటి ప్రమాదకర ఫ్యాక్టరీలను సముద్రతీరంలోనే ఏర్పాటుచేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి మృతిచెందిన ఐదుగురి కుటుంబాలను ఆయన గురువారం సాయంత్రం పరామర్శించారు. నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న వైఎస్‌ జగన్‌ మృతుల కుటుంబాలతో మాట్లాడి.. వారిని ఓదార్చారు. బాధిత కుటుంబాలకు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ మాకొద్దని తొందూర్రులో గత రెండు సంవత్సరాలుగా పోరాడుతున్నారని, ఇలాంటి ఫ్యాక్టరీల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మొగల్తూరు ఘటనతో అందరికీ అర్థమైందని అన్నారు. ఇలాంటి ప్రమాదకర ఫ్యాక్టరీలను సముద్రతీరంలోనే పెట్టాలని డిమాండ్‌ చేశారు. మొగల్తూరు ప్రమాద ఘటనలో చనిపోయిన వారంతా 20 నుంచి 30 ఏళ్ల లోపువారేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • మొగల్తూరులో ఉన్న ఈ ఆక్వా ఫుడ్‌ కంపెనీ కెపాసిటీ 30 టన్నులు మాత్రమే.
  • తుందుర్రులో 350 టన్నుల కెపాసిటీతో ఇదే యాజమాన్యం మెగా ఆక్వా ఫుడ్ పార్కును ఏర్పాటు చేస్తున్నది.
  • అక్కడ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉండబోతున్నది.
  • ఆక్వా ఫ్యాక్టరీలతో కాలుష్యం ఉంటుందని అందరికీ తెలసు. అయినా కాలుష్యం ఉండబోదని ప్రభుత్వం చెప్తోంది
  • అక్కడి నుంచి సముద్రం దాకా పైపు వేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. ఆయన ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు.
  • మొగల్తూరు ఫ్యాక్టరీ కాలుష్య రహిత ఫ్యాక్టరీ అని చెప్పారు. కానీ ఈ ఫ్యాక్టరీలో రొయ్మల తలలు తీసేసి పక్కన పడేస్తారు.
  • ఈ ఫుడ్‌ ప్రాసెస్‌ వ్యర్థాలను పక్కనే ఉన్న పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు
  • దీంతో పంటకాలువలు డ్రైనేజీగా మారిపోయి.. ఆ నీళ్లు తాగడానికి, వ్యవసాయానికి సైతం పనికిరాకుండా పోతున్నాయి.
  • ఇలా పంటకాలువలో వదిలేయవద్దంటూ ఒత్తిడి తేవడంతో కంపెనీ ఈ కాలుష్యాన్ని ట్యాంకులోకి వదిలింది.
  • ఆ ట్యాంకును శుభ్రం చేస్తుండగా అమోనియో గ్యాస్‌ వెలువడి ఇంతమంది ప్రాణాలను బలిగొన్నది.
  • మరోవైపు ఇది కాలుష్య రహిత ఫ్యాక్టరీ అని ప్రభుత్వం మోసం చేస్తున్నది
  • కాలుష్యం ఉంటుందని అందరికీ తెలిసినా ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతున్నది
  • ఇంతపెద్ద ఘటన జరిగినా కంపెనీ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదు
  • యాజమాన్యం నుంచి బాధిత కుటుంబాలకు మరింత ఎక్కువ పరిహారం ఇప్పించాలి
  • కంపెనీకి వచ్చే ఇన్సూరెన్స్‌ డబ్బులు కూడా బాధితులకే ఇప్పించాలి
  • దయచేసి ప్రజల జీవితాలతో కంపెనీలు చెలగాటం ఆడొద్దు


గురువారం ఉదయం నల్లావారి చెరువులోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడటంతో ఐదుగురు కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. రసాయనిక ట్యాంకులను శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీక్ అయినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement