
వడదెబ్బకు 13 మంది మృతి
మొగల్తూరు : జిల్లాలో కొద్ది రోజులుగా వీస్తున్న వడగాలులకు బుధవారం 13 మంది మృత్యు వాత పడ్డారు. నరసాపురం మండలం ముత్యాలపల్లి పంచాయతీ గెదళ్ళవంపు గ్రామానికి చెందిన తిరుమాని సోమరాజు(68) మంగళవా రం ఉదయం నుంచి వీచిన వేడి గాలులకు తట్టుకోలేక రాత్రి మృతిచెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ కోపనాతి పల్లయ్య, కేకేఎస్ పరామర్శించారు.
పేరుపాలెం నార్త్ పంచాయతీకి చెందిన తిరుమాని లక్ష్మమ్మ(66) వడగాలులకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బల్లిపాడు(అత్తిలి) : అత్తిలి మండలం బల్లిపాడుకు చెందిన కొల్లు వజ్రం(80) వడదెబ్బకు మృతిచెందింది. కొద్దిరోజులుగా వీస్తున్న వడగాలులకు అస్వస్థతకు గురైన వృద్ధురాలు బుధవారం మధ్యాహ్నం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
పెనుమంట్ర : మండలంలో వడగాల్పులకు ఇద్దరు మృతిచెందారు. నెగ్గిపూడి గ్రామానికి చెందిన బొడ్డు సత్తియ్య(70) బుధవారం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. వికలాంగుడైన సత్తియ్యకు భార్య, కుమారుడు ఉన్నారు. వీఆర్వో ఏవీ సుభద్ర తహసిల్దార్‌కు సమాచారం అందించారు. వెలగలవారి పాలెంలో జామి పెద్దులు(55) వ్యవసాయ కూలీ మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అస్వస్థతకు గురైన పెద్దులను బుధవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
జోగన్నపాలెం(దెందులూరు) : జోగన్నపాలెంలో గారపాటి నాగేశ్వరరావు(75) బుధవారం వీచిన వడగాలులు తట్టుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీఆర్వో నాగరాణి తహసిల్దార్ కార్యాలయానికి నివేదిక అందజేశారు. వైసీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త సీహెచ్ అశోక్‌గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
లింగపాలెం : మండలంలోని గణపవారిగూడేనికి చెందిన గద్దె వజ్రమ్మ(55) బుధవారం వడగాల్పులకు మృతి చెందెంది. ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
పాలకోడేరు రూరల్ : పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన పాలా పల్లమ్మ(75) మంగళవారం వీచిన వడగాలులకు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 8 గంటలకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కొయ్యలగూడెం : మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతిచెందినట్లు రెవె న్యూ అధికారులు తెలిపారు. అంకాలగూడెం దళితవాడకు చెందిన సొంగా ఆశీర్వాదం(55) వ్యవసాయ కూలీ.
పొలానికి వెళ్లి ఇంటికి వచ్చిన ఆయన వడగాలులకు స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కన్నాపురానికి చెందిన గెడ్డం చిన్ని(46) వడ్రంగి పనులు చేస్తుంటాడు. పనికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి వచ్చి పడిపోవడంతో వైద్యునికి చూపించగా వడదెబ్బకు ప్రాణాలు కోల్పోరుునట్లు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని వైసీపీ నాయకులు గాడిచర్ల సోమేశ్వరరావు, తాడిగడప రామకృష్ణ, టీడీపీ నాయకుడు గంధిపోం నాని కోరారు.
పెనుమదం(పోడూరు) : పెనుమదం గ్రామంలో కాళ్లకూరి సర్వేశ్వరరావు(68) వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతిచెందాడు. అవివాహితుడైన ఇతను అక్క, బావల వద్ద ఉంటున్నాడు. వడగాల్పులకు నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుట్టాయగూడెం : గ్రామానికి చెందిన దేవరకొండ నాగరాజు(50) బుధవారం వడదెబ్బకు మృతిచెందాడు. వేడి గాలులకు రెండు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యూడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సీనియర్ కమ్యూనిస్టు పెంటయ్య కన్నుమూత
భీమవరం టౌన్ : భీమవరం మండలం కొత్తపూసలమూరు గ్రామానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, సీపీఎం కార్యకర్త కామ్రేడ్ కొల్లాటి పెంటయ్య(82) వడదెబ్బకు గురై మంగళవారం మృతిచెందారు. గొల్లవానితిప్పలో సీఐడీ భూపోరాటంలో పెంటయ్య ముందుండి ప్రజలను నడిపించారని సీపీఎం డివిజన్ కార్యదర్శి చెప్పారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటని అన్నారు. సీపీఎం నాయకులు రేవు రామకృష్ణ తదితరులు పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.