పాట్నా: ఉత్తర భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నడూ లేనంతంగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను దాటేసింది. తీవ్ర ఎండ, వాడగాలులతో జనం అల్లాడుతున్నారు. అయితే మండే ఎండల్లోనూ కొన్ని చోట్ల స్కూళ్లు తెరుచుకున్నాయి. తాజాగా బిహార్‌లో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయారు.
బిహార్‌లో వేసవిసెలవులు ముగియడంతో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రస్తుతం బిహార్‌లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు ఉంది. ఇంత ఎండలోనూ విద్యార్ధులు స్కూళ్లకు వచ్చారు. అయితే ఎండ వేడిని తట్టుకోలేక.. పలు ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు.
షేక్‌పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేశారు. సమయానికి ఆంబులెన్స్‌లు రాకపోవడంతో.. ఆటోలు, బైక్‌లపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలందరూ డీ హైడ్రేట్ అయ్యారని.. ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.
ఇదొక పాఠశాలలోనే కాదు బెగుసరాయ్, జాముయి జిల్లాల్లో పదుల సంఖ్యలో విద్యార్ధులు స్పృహతప్పి పడిపోయారు. వారిని అసుపత్రికి తరలించారు.కాగా, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ బీహార్‌లో స్కూళ్లను తెరువడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు స్కూళ్లకు వెళ్లి టీచర్లతో ఘర్షణపడ్డారు. అలాగే రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ స్కూళ్లను తెరువడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
మరోవైపు బీహార్‌లో ప్రభుత్వం, ప్రజాస్వామ్యం లేదని, బ్యూరోక్రసీ మాత్రమే ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా ఉన్నాయని, అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment