sun stroke
-
అగ్నిగుండంలా ఢిల్లీ.. వారం రోజుల్లో 192 నిరాశ్రయుల మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. 50కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. దీనికి తోడు వడగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలకు తోడు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక హస్తీనా వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగరంలోని ఆసుపత్రులన్నీ హీట్ స్ట్రోక్ బాధితులతో నిండిపోతున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో రోగులు అడ్మిట్ అవుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది. 72 గంటల్లోనే ఢిల్లీ, నోయిడాలో 15 మంది వడదెబ్బతో ప్రాణాలు వదిలారు. ఢిల్లీలో అయిదుగురు, నోయిడాలో 10 మంది మృత్యువాత పడ్డారుఅయితే తీవ్ర ఉక్కపోత, వడదెబ్బ కారణంగా ఢిల్లీలో జూన్ 11 నుంచి 19 మధ్య 196 మంది నిరాశ్రయులు (ఇళ్లు లేని వారు) మరణించినట్లు ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ నివేదిక పేర్కొంది. ఈ కాలంలో నమోదైన అత్యధిక మరణాల సంఖ్య ఇదేనని వెల్లడించింది.NGO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ అలెడియా మాట్లాడుతూ.. జూన్ 11 నుండి 19 వరకు తీవ్ర వేడి పరిస్థితుల కారణంగా ఢిల్లీలో 192 మంది నిరాశ్రయుల మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. అంతేగాక మరణించిన వారిలో 80 శాతం మంది మృతదేహాలు ఎవరివో కూడా తెలియవని అన్నారు. ఈ ఆందోళనకరమైన మరణాల సంఖ్య.. సమాజాన్ని రక్షించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయని తెలిపారు.వాయు కాలుష్యం, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అటవీ నిర్మూలన వంటి కారణాల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, నిరాశ్రయులైన వారి పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన పేర్కొన్నారు. నివాసాలు లేని వారికి అవసరమైన తాగునీరు అందించడం ముఖ్యమైన సవాలుగా మారిందన్నారు. దీని వల్ల డీహైడ్రేషన్, సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందన్నారు.దీన్ దయాళ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (NULM-SUH) ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిరాశ్రయులు ఉపశమనం పొందవచ్చని తెలిపారు. అయితే వారికి ప్రాథమికంగా గుర్తింపు పత్రాలు లేకపోవడం, శాశ్వత చిరునామా లేకపోవడం సమస్యగా మారిందన్నారు.అదే విధంగా శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, తగిన షెల్టర్ సామర్థ్యాన్ని నిర్ధారించడం, నీటిని పంపిణీ చేయడం. సహాయక గృహాలు, సేవల ఏర్పాటు ద్వారా నిరాశ్రయులైన సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పారు. -
దేశ రాజధానిలో హీట్‌వేవ్.. ఢిల్లీ, నోయిడాలో 15 మంది మృత్యువాత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లడిపోతున్నారు. ఓవైపు భానుడి ప్రతాపం.. మరోవైపు నీటి సంక్షోభం ఢిల్లీ ప్రజలను పీడిస్తున్నాయి.ఎండ వేడిమి, వడగాలుల ధాటికి జనం పిట్టల్లా రాలుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గడచిన 72 గంటల్లో వడ దెబ్బతో 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది మరణించారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హస్పిటల్లో 12 మంది వెంటిలేటర్ సపోర్టతో చికిత్స పొందుతున్నారు. మరో 36 మంది వడదెబ్బతో చికిత్స పొందుతున్నారు.హీట్‌స్ట్రోక్ కేసుల్లో మరణాల రేటు దాదాపు 60-70 శాతం ఎక్కువāగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. రోగులలో చాలా మంది వలస కూలీలే ఉన్నట్లు తెలిపారు. అధికంగా 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు. హీట్‌స్ట్రోక్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారుకాగా ఢిల్లీ వాసులు దాదాపు నెల రోజులుగా తీవ్ర ఎండ, వేడిగాలులతో అల్లాడిపోతున్నారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును దాటాయి. హీట్‌వేవ్స్ కారణంగా నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వారం రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పంజాబ్‌లో వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్‌లోనూ ఎండలు దంచికొడ్తున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు వుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రాబోయే 24 గంటలపాటు వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఒడిశాలో వడగాడ్పుల విలయం.. 99 మంది మృతి!
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. వడగాలుల తీవ్రతకు ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణోగ్రత రానురాను రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. విపరీతమైన ఎండల కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రులలో చేరుతున్నారు.ఒడిశాలో ఎండల ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇది పలువురి ప్రాణాలను బలిగొంటోంది. ఒడిశాలో గత 72 గంటల్లో 99 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ 99 మరణాల్లో 20 కేసులను జిల్లా మేజిస్ట్రేట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ వడదెబ్బ కారణంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 141 మంది మృతి చెందినట్లు వివిధ జిల్లాల మెజిస్ట్రేట్‌లలో నమోదయ్యిందన్నారు. During the last 72 hours, 99 alleged sun stroke death cases have been reported by the Collectors. Out of 99 alleged cases, 20 cases have been confirmed by the Collectors. During this summer, total 141 alleged sun stroke death cases have been reported by the Collectors out of… pic.twitter.com/bWXsiaFA3F— ANI (@ANI) June 3, 2024 -
సూర్యుడి భగభగ.. ఎండ వేడి తట్టుకోలేక 54 మంది మృత్యువాత
న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీతో సహా తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే ముచ్చెమటలు పడుతున్నాయి. కాళ్లకు చెప్పులు లేకుండా, నెత్తి మీద రుమాలు లేకుండా బయట అడుగు పెడితేా.. అంతే సంగతులు. కాళ్లకు బొబ్బలు కట్టడం ఖాయం, మాడు పగలడం ఖరార్. పైగా, వేడి గాలుల బీభత్సం. తెల్లారింది మొదలు రాత్రి 10 గంటల దాకా భానుడి భగభగలే.ఎంత వేడిని తట్టుకోలేక దేశ వ్యాప్తంగా 54 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 32 మంది వడదెబ్బతో మరణించారు. ఔరంగాబాద్‌లో 17 మంది, అర్రాలో ఆరుగురు, గయాలో ముగ్గురు, రోహతాస్‌లో ముగ్గురు, బక్సర్‌లో ఇద్దరు, పాట్నాలో ఒకరు మరణించారు.. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోయారు. జార్ఖండ్‌లోని పాలము, రాజస్థాన్‌లలో ఐదుగురు చొప్పున మరణించగా, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒకరు మరణించారు.ఇక ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు 45.6 డిగ్రీలను దాటేసింది. సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో మే 31 నుంచి జూన్ 1 మధ్య.. హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో మే 31న దుమ్ము తుఫాను రానున్నట్లు భారత వాతావరణశాఖ అంచనా వేసింది. మే 31, జూన్ 1న వాయువ్య భారత్‌లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షతం నమోదుకానున్నట్లు పేర్కొంది. రోహిణి కార్తె తన ప్రతాపాన్ని చూపుతుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. రుతుపవనాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు మాడు అదిరిపోయేలా ఎండలు అదరగొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోయారు. ఒక ఢిల్లీలోనే కాదు..ఉత్తర భారత దేశంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ప్రజలు విల విలాడిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. బుధవారం తొలిసారిగా రికార్డు స్థాయిలో మంగేష్ పూర్లో ఏకంగా 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏడారి ప్రాంతమైన రాజస్థాన్ కన్నా ఎక్కువగా రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఢిల్లీలోని నజాఫ్ గడ్, పిఠంపుర సహా మరికొన్ని ప్రాంతాల్లో నేడు 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ భారతదేశంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పలకరిస్తుంటే.. ఉత్తర భారతం భానుడి భగభగలతో ఠారెత్తిపోతోంది.ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎండతీవ్రతకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. జనాలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఏసీలు, కూలర్లు వాడకం ఎక్కువ అయ్యింది. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో 8వేల302 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడింది. నీటిని వృధా చేసిన వారికి రెండు వేల జరిమానా విధిస్తున్నారు. రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి. వేసవి విడిదికోసం ఉత్తర భారతం వెళ్లిన పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో ఇంతటి మార్పులు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు జనం.రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో సహా అనేక ప్రాంతాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ మాదిరిగానే వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోని ఫలొదిలో 51 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
మండుతున్న ఎండలు.. తట్టుకోలేక సొమ్మసిల్లిన విద్యార్థులు
పాట్నా: ఉత్తర భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నడూ లేనంతంగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను దాటేసింది. తీవ్ర ఎండ, వాడగాలులతో జనం అల్లాడుతున్నారు. అయితే మండే ఎండల్లోనూ కొన్ని చోట్ల స్కూళ్లు తెరుచుకున్నాయి. తాజాగా బిహార్‌లో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయారు.బిహార్‌లో వేసవిసెలవులు ముగియడంతో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రస్తుతం బిహార్‌లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు ఉంది. ఇంత ఎండలోనూ విద్యార్ధులు స్కూళ్లకు వచ్చారు. అయితే ఎండ వేడిని తట్టుకోలేక.. పలు ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. షేక్‌పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేశారు. సమయానికి ఆంబులెన్స్‌లు రాకపోవడంతో.. ఆటోలు, బైక్‌లపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలందరూ డీ హైడ్రేట్ అయ్యారని.. ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.ఇదొక పాఠశాలలోనే కాదు బెగుసరాయ్, జాముయి జిల్లాల్లో పదుల సంఖ్యలో విద్యార్ధులు స్పృహతప్పి పడిపోయారు. వారిని అసుపత్రికి తరలించారు.కాగా, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ బీహార్‌లో స్కూళ్లను తెరువడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు స్కూళ్లకు వెళ్లి టీచర్లతో ఘర్షణపడ్డారు. అలాగే రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ స్కూళ్లను తెరువడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.మరోవైపు బీహార్‌లో ప్రభుత్వం, ప్రజాస్వామ్యం లేదని, బ్యూరోక్రసీ మాత్రమే ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా ఉన్నాయని, అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్య
పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్య -
ఎండలకు పల్సర్ బైక్ దగ్ధం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో తీవ్రమైన ఎండ ధాటికి ఆదివారం ఉదయం 11.10 గంటల ప్రాంతంలో ఓ బైక్ కాలిపోయింది. శ్రీకాకుళం ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ బి.శృంగార నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గుర్ల వాసి బెవర శ్రీనివాసరావు తన భార్యతో కలిసి అరసవల్లి, శ్రీకూర్మం, రాజులమ్మ తల్లి దర్శనానికి ఆదివారం వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో బండి నుంచి కాలిన వాసన రావడంతో అప్రమత్తమై బండి దిగి చూసేసరికి బ్యాటరీ వద్ద నిప్పు కనిపించింది. కొన్ని క్షణాల్లోనే ఆయిల్ ట్యాంక్ పైన మంటలు చెలరేగాయి. వెంటనే పక్కనే ఉన్న దుకాణాల సముదాయాల వారు నీళ్లు చల్లి, గోనెసంచితో మంటలను ఆర్పారు. ఈలోగా అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద తీరును, ద్విచక్రవాహనాన్ని పరిశీలించి మంటలను పూర్తిగా అదుపు చేశారు. వాహనంలో తక్కువ ఇంధనం ఉండటంతో ప్రమాదం తప్పిందని అంతా భావించారు. వానల కోసం వరుణ యాగం కాశీబుగ్గ: మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలగడానికి వానలు కురవాలని కోరుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్డు కౌన్సిలర్ శర్వాన గీతారవి ఆధ్వర్యంలో వరుణ యాగం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున బిందెలతో నీళ్లు తీసుకువచ్చి శివుడిని అభిషేకించారు. -
పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి
సాక్షి, ఆదిలాబాద్: పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు వడదెబ్బతో కన్నుమూసిన ఘటన .కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్ల బొరీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య యశోదలకు ముగ్గురు కొడుకులు. వీరిలో పెద్ద కుమారుడు తిరుపతి (26). ఇతనికి ఇటీవల మంచిర్యాల జిల్లా భీమిని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పెళ్లి ముహూర్తం ఉంది. కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే పెళ్లి పనుల్లో నమగ్నమైన తిరుపతి సోమవారం వడదెబ్బకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడుతున్న తిరుపతిని కుటుంబ సభ్యులు కాగజ్‌గనర్ తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న వ్యక్తి ఇలా ఉన్నట్టుండి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తిరుపతి సోదరుడు శ్రీనివాస్ గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతూ అరు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. పెళ్లి కోసం చేసిన ఏర్పాట్ల వద్ద మృతదేహం పెట్టాల్సి రావడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
రెండ్రోజులపాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌లో భగభగ
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడి అర్ధరాత్రికల్లా తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించింది. అనంతరం గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అది క్రమంగా బలపడుతూ ఈనెల 12వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత దిశను మార్చుకుంటూ క్రమంగా బలహీ నపడుతుందని వాతావరణ శాఖ అంచనావేసింది. దీని ప్రభా వంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలిక పాటి, ఒకట్రెండు చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరు గుతాయ ని గరిష్ట ఉష్ణోగ్రత 43డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకా శముందని వాతావరణశాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవు తాయని తెలిపింది. బుధవారం రాష్ట్రంలో... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 41.3డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. -
పాల దిగుబడిపై వడ‘దెబ్బ’
నరసాపురం రూరల్: వేసవిలో పాడిపశువుల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో పశువులకు వడదెబ్బ తగిలితే పాల దిగుబడి తగ్గడమే కాక పశువులు ఎదకు వచ్చే పరిస్థితులు కనిపించవని, అంతేకాక పశువు చూడుకట్టే అవకాశం ఉండదని పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై.సుధాకర్ చెబుతున్నారు. వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల్లో సోకే వ్యాధులను ఆయన వివరించారు. వేసవిలో గేదెలు, ఆవులపై సరైన శ్రద్ధ తీసుకోనట్లయితే వడదెబ్బకు గురై ఒక్కొక్కసారి పశువు ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు ఇవే వేసవిలో పశువులు తాగే నీరు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచాలి. వేసవిలో సహజంగానే నీటి వనరులు తగ్గి నిల్వ ఉండే నీరు మురికిగా, ఆకుపచ్చగా మారతాయి. పశువులు ఈ కలుషితమైన నీరు తాగితే వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరి పారుడు వ్యాధులు కలుగుతాయి. కాబట్టి పశువులు తాగేందుకు స్వచ్ఛమైన నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. లేదంటే రోజులో కనీసం మూడుసార్లు నీటిని అందించడం అవసరం, ఆరుబయట తొట్టెల్లో పగలు నిల్వ ఉన్న నీరు వెచ్చగా మారతాయి. నీడ ప్రాంతంలో నిల్వ ఉంచిన చల్లటి నీటినే పశువులకు తాగించాలి. ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువ నీటిని తాగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, పశువు వయస్సు తదితరాలనుబట్టి రోజుకు సుమారుగా 28 లీటర్ల నీరు అవసరమవుతాయి. పాలిచ్చే పశువులు అదనంగా ప్రతి లీటరు పాల దిగుబడికి నాలుగు లీటర్ల చొప్పున నీటిని తాగుతాయి. ఇది కాకుండా పశువులను శుభ్రపరిచేందుకు, షెడ్లలో నేలను శుభ్రపరిచేందుకు ప్రతి పశువుకు 110 లీటర్ల నీరు అవసరం పడుతుంది. వడదెబ్బ తగలకుండా.. పశువులకు వడదెబ్బ తగలకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల పాక చుట్టూ పాత గోనెలు కట్టి వాటిని అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. పైకప్పును కొబ్బరి ఆకులతో గానీ, ఎండి వరిగడ్డితో గాని కప్పాలి. మంచినీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేట్లు చూడాలి. పశువులను ఉదయం, సాయంత్రం మాత్రమే అంటే చల్లని వాతావరణంలోనే మేత మేసేందుకు విప్పాలి. పశువులు ఎక్కువగా ఎండలో తిరగకుండా చూడాలి. వీలైనంత పచ్చని మేతను ఇవ్వాలి. సంకర జాతి ఆవులైతే పంకాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బకు గురైతే లక్షణాలు ఇలా.. వడదెబ్బకు గురైన పశువు లక్షణాలను పరిశీలిస్తే శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల నుంచి 108 డిగ్రీల వరకు పెరుగుతుంది. పశువులు నడిచేటప్పుడు తూలుతాయి. శ్వాసక్రియ ఎక్కువగా ఉంటుంది. పశువు చాలా నీరసంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి కింద పడి కొట్టుకుని స్పృహకోల్పోతాయి. పశువు నీటి కొరకు చూస్తుంటుంది. పశువు చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది. పశువులో పాల ఉత్పత్తి కొల్పోతుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ తగిలిందని రైతు గ్రహించాలి. చేయాల్సిన చికిత్స ఇదే వడదెబ్బ తగిలిన పశువును రైతులు గుర్తించిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. గుడ్డతో ఐస్ చుట్టి పశువు నుదుటిపై నొత్తాలి. కొద్ది ఊరట కలిగిన తరువాత దగ్గరలోని పశు వైద్యుడిని సంప్రదించి సైలెన్లు పెట్టాలి. ఒక్క సారి వడదెబ్బ తగిలిన పశువుకు బతికినంత కా లం పాలదిగుబడి గతంలో మాదిరిగా ఉండదు. జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ వై సుధాకర్, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు -
పట్టన ప్రాంతాల్లో ఎండ దెబ్బకు రోడ్లపై పందిర్లు
-
వడదెబ్బతో 19 ఏళ్ల యువతి సవిత మృతి
-
వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి
-
మండుతున్న ఎండలు... వడదెబ్బ తగలకుండా ఉండాలంటే
ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మార్చిలోనే విరుచుకుపడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి సెగలతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏటా ఏప్రిల్ నెలాఖరులో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ.. వాతావరణ సమతుల్యత లోపించిన కారణంగా మార్చి నెలాఖరులోనే సూర్యుడు మండిపోతున్నాడు. గత నాలుగేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నెల రోజుల ముందే అమాంతంగా పెరిగిపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి ఆరంభంలో 31 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత.. ఆ నెల చివరికే 36 డిగ్రీలుగా నమోదైంది. అదే వేగంతో పెరుగుతూ మార్చి నెల చివరి వారంలో 41 డిగ్రీలకు చేరుకుంది. దీనికి తోడు వడగాల్పులు అధికమయ్యాయి. పగలంతా ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ కూలర్ల ముందే సేదతీరుతున్నారు. సాక్షి – కరీంనగర్ ఉదయం 10 గంటలకే... వారం రోజులుగా ఉదయం 10 గంటలకే ఎండలు మండుతుండడంతో జిల్లా వాసులు బయటకు రావాలంటేనే అల్లాడిపోతున్నారు. ఒకవేళ వచ్చినా 11 గంటలకల్లా నీడను ఆశ్రయిస్తున్నారు. దీంతో 12 కొట్టే సరికి రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే టవర్‌సర్కిల్, బస్టాండ్ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో ఇబ్బంది తలెత్తింది. ఏప్రిల్ ఆరంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సెగలు కక్కే ‘మే’ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వడదెబ్బ తగలకుండా.. చెమటపట్టకపోవడం.. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం.. వణుకు పుట్టడం.. ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి రావడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా ఎండలో తిరగద్దు. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం తగ్గించాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు వాడడం, టోపీ ధరించడం మంచిది. నిర్లక్ష్యం చేయవద్దు.. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వీలైనంత త్వరగా చల్లని గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్ఎస్ తాగించాలి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మరింత జాగ్రత్త తీసుకోవాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి బీపీ హెచ్చుతగ్గుల వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెంటనే ఆసుపత్రికి తరలించాలి. – డాక్టర్ కొండపాక కిరణ్, కార్డియాలజిస్టు -
ఏపీలో ఎండ దంచి కొడుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతోంది. అంతేస్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ సోకకుండా అవగాహన కల్పించడంతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ చికిత్సకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కుటుంబ సంక్షేమ శాఖ అన్ని జిల్లాల అధికారులకు ఎండ వేడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశమున్నట్టు హెచ్చరికలు ఉండటంతో దీనికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కేసుల కారణంగా ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సెలవులు లేకుండా పనిచేస్తున్నారు. అన్ని సబ్సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం ఫస్ట్ ఎయిడ్ కిట్లు సరఫరా చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పల్లెల్లో విస్తృత ప్రచారం పల్లెల్లో జనాన్ని అప్రమత్తం చేశారు. ఉపాధి హామీ లేదా ఇతర రైతు పనులకు వెళ్లిన వారిని ఉదయం 11 గంటలలోగా ఇంటికి చేరుకోవాల్సిందిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎఫ్ఎం రేడియో, కేబుల్ టీవీలు, కళాజాతాల ద్వారా ఎండ తీవ్రత, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి, మండల స్థాయిలో మెడికల్ క్యాంపుల నిర్వహణ చేపట్టారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఏఎన్ఎంల ద్వారా ప్రత్యేక మెడికల్ కిట్లను అందజేస్తున్నారు. సురక్షితమైన తాగునీరు అందించాల్సిందిగా పంచాయతీరాజ్, మునిసిపాలిటీ అధికారులను కోరారు. ఎన్జీవో సంఘాలు ప్రత్యేక చలివేంద్రాలు, మజ్జిగ ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీకాలకు ఉదయమే రండి కోవిడ్ వ్యాక్సిన్‌తో పాటు చిన్నారులకు ప్రతి బుధ, శనివారాలు వ్యాధినిరోధక టీకాలు నిర్వహణ జరుగుతుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 9 గంటలలోగా వ్యాక్సిన్ తీసుకుని వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లాలని కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. ప్రతి ఆస్పత్రిలోనూ ఓఆర్ఎస్ పౌడర్‌తో పాటు, సన్‌స్ట్రోక్‌కు సంబంధించిన అన్ని రకాల మందులూ అందుబాటులో ఉంచారు. గర్భిణులు వైద్య పరీక్షలకు ఉదయం రావాలని, తిరిగి త్వరగా వెళ్లాలని, వారిని ఉదయమే తెచ్చే బాధ్యత ఆశా కార్యకర్తలు చూసుకోవాలని ఆదేశించారు. ఏదైనా సన్‌స్ట్రోక్ లక్షణాలుంటే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే వెళ్లాలని సూచించారు. 108కు ఫోన్ చేసి అంబులెన్సులో రావచ్చునని, లేదంటే 104కు కాల్ చేసి డాక్టరు సలహాలు తీసుకుని పాటించవచ్చునని కుటంబ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. సన్‌స్ట్రోక్ లక్షణాలు ఇవే ► విపరీతంగా తలనొప్పి రావడం, కళ్లు తిరిగినట్టుండటం ► నీరసంగా ఉండటం, నాలుక తడారిపోవడం ► ఒళ్లంతా చెమటలు పట్టినట్టు, శరీరం పాలిపోయినట్టు కావడం ► శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె దడగా ఉండటం ► శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం ► వాంతులు వచ్చినట్టు ఉండటం ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య రాదు ► వీలైనంత వరకు ఎండలో తిరగకపోవడం ► వెళ్లినా గొడుకు విధిగా వాడటం ► కావాల్సినన్ని మంచినీళ్లు దఫాలుగా తాగుతుండటం ► పల్చటి మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ► అలసటగా ఉన్నట్టయితే ఓఆర్ఎస్ పౌడర్ మంచినీళ్లలో కలిపి తాగడం అన్నీ సిద్ధంగా ఉంచాం ఓఆర్ఎస్తో పాటు ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ మందులు సిద్ధంగా ఉంచాం. ఇప్పుడిప్పుడే కొన్ని హీట్‌వేవ్ (వడదెబ్బ) కేసులు నమోదవుతున్నాయి. మెడికల్, పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పాం. ఏరోజుకారోజు వడదెబ్బ కేసులను నివేదికను పంపించాలని కోరాం. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు వృద్ధులు వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలి. – డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
ఈ ఏడాది ఎండలు మామూలుగా ఉండవు
బెంగళూరు : ఈ ఏడాది వేసవిలో సూర్యుని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. మండే ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడులో వేసవి ప్రతాపం చూపవచ్చు. ఎండలు రికార్డు స్థాయిలో ఉండవచ్చు. వేసవి కాలంలో ఉదయం నుంచి ఎండలు పెరిగి సాయంత్రం సమయానికి ఉష్ణోగ్రత తగ్గుతుంది. కానీ ఈ వేసవిలో విపరీతమైన ఉక్కపోత చుట్టుముడుతుందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ చేరే అవకాశం ఉంది. -
25 రోజులపాటు కాలినడకన..
సాక్షి, న్యూఢిల్లీ: ‘సాధారణంగా మానవ శరీర నిర్మాణం రోజుకు కొన్ని గంటలు నడిచేందుకే అనువుగా ఉంటుంది. ఓ కిలోమీటరు నడిస్తే 60–70 కాలరీలు కరిగి పోతాయి. కడుపు నిండా తిన్న ఆహారం దాదాపు 600 కాలరీలు ఉంటుంది. అంటే ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు నడిస్తే ఆ 600 కాలరీలు కరిగిపోతాయి. ఇది ఉష్ణోగ్రత 25 డిగ్రీల లోపు ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ. లాక్డౌన్ కారణంగా సొంతూళ్లకు బయల్దేరిన కార్మికులు రోజుకు 8 నుంచి 12 కిలోమీటర్లు నడిచారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు లేకపోవడంతో, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇంకా కొందరు నడుస్తున్నారు. మొన్నటిదాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో, ఒంటిపూట భోజనం లేదా అర్ధాకలితో నడిచారు. అలాంటప్పుడు వారిలో జీవన క్రియ భయంకరంగా దెబ్బతింటుంది. మానవ కండరాల్లోని అణువులు తగినంత శక్తిని విడుదల చేయలేవు. వాటి నుంచి ‘లాక్టిక్’ యాసిడ్ వెలువడుతుంది. అది శరీరాన్ని తీవ్ర అలసటకు గురి చేస్తుంది. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంలో ఎక్కువగా ఉపయోగపడే గ్లూకోజ్ పడి పోతుంది. అప్పుడు కళ్లు తిరుగుతాయి. దప్పిక, ఆకలి ఎక్కువవుతుంది. సకాలంలో ఆహారం, విశ్రాంతి లేకపోతే స్పృహతప్పి పోతారు. సకాలంలో వైద్యం అందకపోతే మరణిస్తారు. ఎండలో ఎక్కువగా నడుస్తుంటే శరీరంలోని నీటి స్థాయి పడిపోతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌లో సమతౌల్యం దెబ్బతింటుంది. సోడియం లెవల్స్ పడిపోయి, వాంతుల అవుతాయి. దీన్ని ‘సన్‌స్ట్రోక్’ లేదా ‘డీహైడ్రేషన్’గా వ్యవహరిస్తారు. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోతాయి. సుదీర్ఘ నడక కారణంగా అరిపాదాలు బొబ్బలెక్కుతాయి. అవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తే ప్రాణాంతకం అవుతాయి. ఈ వైద్యపరమైన విషయాలను బిలాస్పూర్లో గిరిజనులకు, గ్రామీణ ప్రజలకు అతి చౌకగా వైద్య సేవలు అందించేందుకు ‘జన్ స్వస్థ సయోగ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న డాక్టర్ యోగేశ్ జైన్ తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్ కుమార్ గత మే నెలలో మొహమ్మద్ సాయిద్ చేతుల్లో మరణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. ఆయన ‘సన్‌స్ట్రోక్’తోనే మరణించారు. ఇలాంటి కారణాల వల్లనే గత మే 31వ తేదీ వరకు కాలి నడకన బయల్దేరిన వలస కార్మికుల్లో 46 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 17 ఏళ్ల బలిరామ్ కుమార్ బెంగళూరు నుంచి 25 రోజులపాటు నడిచి అక్కడికి చేరుకున్నారు. కాళ్లకు బూట్లు ఉన్నప్పటికీ పాదాలు బొబ్బలెక్కాయని, పాదాలతోపాటు మొత్తం వొళ్లంతా నొప్పులు సలిపేస్తున్నాయని ఆయన మీడియాకు తెలిపారు. (తిండి, నీళ్లు లేవు.. చుట్టూ శవాలే!) బిహార్‌లోని కతియార్ జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్న 20 ఏళ్ల వినోద్ యాదవ్ తాను 27 రోజులపాటు నడిచి బెంగళూరు నుంచి అక్కడికి చేరుకున్నట్లు చెప్పారు. ఇలా ఎంతో మంది ప్రాణాలకు తెగించి తమ స్వస్థలాలకు చేరుకున్న విషయం తెల్సిందే. దేశంలో కరవు కాటకాలు, కలరా లాంటి మమమ్మారీలు దాపురించినప్పుడే కాకుండా దేశ విభజన సందర్భంగా మత ఘర్షణలు చెలరేగినప్పుడు ఇలాగే మానవ వలసలు కొనసాగాయి. అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా 1942లో బర్మాలోని రంగూన్ నగరంపై జపాన్ బాంబులు వేసినప్పుడు కూడా వేలాది మంది భారతీయులు భారత్‌కు కాలి నడకన బయల్దేరారు. బర్మాను మయన్మార్ అని, రంగూన్ను యాంగన్ అని నేడు వ్యవహరిస్తారని తెల్సిందే. (ఇలాంటి కథలు...ఇంకెన్నో!) -
భానుడి భగభగలకు ఏమయ్యేవారో!
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణకు విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ వందలాది ప్రాణాలను నిలిపింది. లేదంటే భానుడి భగభగలతో నిప్పుల కుంపటిలా మారిన భారత్‌లో వందలాది మంది పిట్టల్లా రాలిపోయేవారు. దేశవ్యాప్తంగా వడగాడ్పులు, ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అనేకచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లాక్డౌన్ 4.o లో సడలింపులు ఇచ్చినప్పటికీ అధికశాతం జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బుధవారం ఎండలు మండిపోయాయి. ఢిల్లీలో 45, హైదరాబాద్ 42, అహ్మదాబాద్ 43, పుణె 37, చెన్నై 37, ముంబూ 34, బెంగుళూరు 32, కోల్‌కత 32 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఉత్తర భారత్‌లోని అనేక అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్ 46, బోధన్, 45, జగిత్యాల 46, కొత్తగూడెం 42, మహబూబ్‌నగర్ 43, మంచిర్యాల 44, నిజామాబాద్ 45, కామారెడ్డి 44, కరీంనగర్ 44, మిర్యాలగూడ 46, నిర్మల్ 45, పాల్వంచ 42, వరంగల్ 43 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచడంతో జనం విలవిల్లాడిపోయారు. అధిక ఎండలు, వడగాల్పులకు జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. బుధవారం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ఉన్న మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు చెప్తున్నారు. -
అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి
వాషింగ్టన్ : వడదెబ్బతో ఆరేళ్ల భారతీయ చిన్నారి మృతి చెందిన సంఘటన అందరిని కలచి వేస్తోంది. వివరాలు.. గురుప్రీత్ కౌర్ అనే బాలిక తన తల్లితో కలిసి మెక్సికో బార్డర్ ద్వారా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో స్మగ్లర్స్ తల్లీకూతుళ్లిద్దరితో పాటు మరో ఐదుగురు భారతీయ వలసదారులను మంగళవారం ఉదయం అమెరికా సరిహద్దులోని ల్యూక్‌విల్లే ప్రాంతంలోని అరిజోనా ఎడారి ప్రాంతంలో వదిలి వెళ్లారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత బాలిక తల్లి కూతుర్ని మిగతావారివద్ద వదిలి.. మరో మహిళతో కలిసి నీటి కోసం వెదుక్కుంటూ ముందుకు వెళ్లింది. అలా నీటి కోసం వెళ్లిన వారు మరి వెనక్కి తిరిగి రాలేదు. వడ దెబ్బ కొట్టడంతో వారు కూడా స్పృహ తప్పి పడిపోయారు. మరుసటి రోజు బార్డర్ పెట్రోల్ ఏజెంట్ వారి పాద ముద్రల ఆధారంగా నడుచుకుంటూ వెళ్లగా ఓ చోట ఇద్దరు మహిళలు పడి పోయి ఉండటం గమనించాడు. వారికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం వివరాలు సేకరించాడు. ఇద్దరు మహిళలకు ఇంగ్లీష్ రాకపోవడంతో వారితో మాట్లడటం చాలా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో గురుప్రీత్ సైగల ద్వార తన కూతురు గురించి అధికారులకు తెలియజేసింది. తాము నీటి కోసం వెదుకుతూ.. వచ్చామని.. తన కూతురు వేరే చోట ఉందని తెలియజేసింది. ఆమె చెప్పిన దాని ప్రకారం పోలీసులు గాలింపు చేపట్టగా.. ఓ మైలు దూరంలో వారికి గురుపీప్రత్ కౌర్ మృత దేహం కనిపించింది. కొన్ని గంటల పాటు నీరు లేక తీవ్రమైన ఎండలో ఉండటం మూలానా గురుప్రీత్ మృతి చెందింది. బాలిక మృతికి స్మగ్లర్స్నే నిందిస్తున్నారు అమెరికా సరిహద్దు భద్రత అధికారులు. అక్రమంగా తమ దేశంలో ప్రవేశించాలని చూశారని.. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా ల్యూక్విలే అరిజోనా ప్రసిద్ధికెక్కింది. ఇది పూర్తిగా ఎడారి ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంత వేడి వాతావరణం మూలానే సదరు బాలిక మృతి చెందిందని వైద్యులు భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది వడదెబ్బ వల్ల ఇద్దరు మృతి చెందగా వారిలో గురుప్రీత్ ఒకరు కావడం విచారం. మరి కొద్ది రోజుల్లోనే గురుప్రీత్ ఏడవ పుట్టిన రోజు జరుపుకోబోతుండగా.. ఈ విషాదం చోటు చేసుకుంది. -
ఎండ వేళ జర భద్రం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. 43 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సిటీజనులు అల్లాడుతున్నారు. ఎండలో బయటకు వెళ్లిన వారికి వడదెబ్బ ప్రమాదం పొంచి ఉంది. కొందరికి జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థత కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో మనిషి శరీరం భరించలేని స్థాయిలో ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఈ ఉష్ణోగ్రతలకు రేడియేషన్ తోడవుతుండంతో శరీరంలో పోటాషియం, సోడియం లెవల్స్ పడిపోయి త్వరగా వడదెబ్బకు గురవుతుండటమే కాకుండా చర్మం నల్లగా వాడిపోతోంది. చర్మంపై చెమట పొక్కులు ఏర్పడుతున్నాయి. రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కింద కూర్చునప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ఇదిలా ఉంటే వడదెబ్బ బారినపడి సిటీలో రోజుకు సగటున ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు. కానీ ఇది అటు జీహెచ్ఎంసీలో గానీ, కలెక్టరేట్లో గానీ రికార్డు కావడం లేదు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉదయం 9 గంటల తర్వాత అవసరమైతే తప్పా..ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే విధిగా గొడుగు, మంచినీళ్లు తీసుకెళ్లాలని చెబుతున్నారు. మండే ఎండల నేపథ్యంలో వైద్యుల సూచనలు కొన్ని.... పిల్లలకు మరింత ప్రమాదం చిన్నారుల శరీరంలో 50 శాతం నీరే ఉంటుంది. ఎండ దెబ్బకు నీటి శాతం తగ్గడం వల్ల చిన్నారులకు వడదెబ్బకు గురవుతారు. తద్వారా తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. వేసవి సెలవుల కారణంగా ఆటపాటలు ఎక్కువవడం సహజం. దీనికి ఎండ తోడవడం వల్ల విపరీతమైన అలసటకు గురవుతారు. నీటి పరిమాణం ఎక్కువుండే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటివి అందించాలి. మధ్యాహ్నం సమయంలో నీడలో ఉండేలా చూడాలి. బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకునేలా చూడాలి. ఆహారంగా ఆమ్లెట్కు బదులు ఉడకబెట్టిన గుడ్డు, కోల్డ్ మిల్క్ వంటివి అందించాలి. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్య నిపుణుడు చెమట పొక్కులకు ఇలా చెక్ చెమటపొక్కుల్ని గోళ్లతో గిల్లడం వంటివి చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎండలకు సెగగడ్డలు అయ్యే అవకాశం ఎక్కువ. యాంటీ బ్యాక్టీరియల్ సోప్‌తో వీటిని శుభ్రం చేసుకోవాలి. గాఢమైన రంగులున్న దుస్తులు కాకుండా తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. పట్టినట్టుండే దుస్తులు కాకుండా వదులైన పలుచని దుస్తువులు వేసుకోవాలి. బయటికి వెళ్లేప్పుడు తలకు క్యాప్ అలవాటు చేసుకోవాలి. సాయంత్రం వేళలో చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇంటి తలుపులు, కిటికీలకు గోనె సంచులను అమర్చి, వాటిని నీటితో తడపాలి. టూ వీలర్‌పై ప్రయాణిస్తే ముఖానికి రుమాలు చుట్టుకోవడం ఉత్తమం. – డాక్టర్ సందీప్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ ఐదు నుంచిఏడు లీటర్ల నీరు తాగాలి వేసవిలో రోజుకు కనీసం ఐదు నుంచి ఏడు లీటర్ల నీరు తాగాలి. పోటాషియం, సోడియం లెవల్స్ పడిపోవడంతో వడదెబ్బకు గురవుతారు. మూత్ర విసర్జన సమయంలో భరించలేని మంటతో పాటు తీవ్ర జ్వరం వస్తుంది. వేడికి తట్టుకోలేక తాగే కూల్‌డ్రింక్స్ ఆరోగ్యాన్ని హరిస్తాయి. వీటిలోని ఫాస్పేట్ పదార్థంతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీలున్నంత వరకూ వీటికి దూరంగా ఉండడమే మేలు. దాహం వేయకపోయినా నీళ్లు కొంచెం కొంచెం తాగడం వల్ల డీహైడ్రేషన్ భారీ నుంచి కాపాడుకోవచ్చు. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, పుదీనారసం, మజ్జిగ, పుచ్చకాయ రసం వంటివి మంచినీళ్లకు ప్రత్యామ్నాయంగా ఉపకరిస్తాయి. ఇక మామిడి, సపోటా, బత్తాయి వంటి పండ్లు పోషకాలపరంగా ఉత్తమమైనవి. – డాక్టర్ స్వప్నప్రియ మసాల ఫుడ్డు వద్దే వద్దు స్థూలకాయులు బరువు తగ్గించుకోవడం కోసం భోజనం మానేస్తుంటారు. తద్వారా జీవక్రియలు మందగిస్తాయి. తక్కువ పరిమాణంలో తేలికగా జీర్ణమయ్యే...ఇంట్లో తయారు చేసిన వేడివేడి ఆహారం తీసుకోవాలి. రోడ్ల వెంట దొరికే ఐస్‌లు, ఫ్రిజ్ వాటర్ తాగొద్దు. రోడ్ల వెంట దొరికే నిల్వ ఫ్రూట్ సలాడ్స్ వంటివి కూడా హానికరం. పాలు, పాల పదార్థాలతో తయారు చేసిన లస్సీలు కాకుండా ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ద్రవపదార్థాలు అధికంగా ఉండే పుచ్చ, కర్బూజా, ద్రాక్ష, మామిడి పండ్లు, ముంజలు వంటివి తీసుకోవాలి. రోడ్లు వెంట ఐస్‌తో తయారు చేసిన రంగు నీళ్లకు బదులు కొబ్బరి నీళ్లు తాగాలి. మసాలాలు ఉన్న ఆహారం వద్దు. తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన వ్యక్తులను కూర్చో బెట్టకూడదు. నీడకు తరలించి ఏదైనా నునుపైన బల్లపై కానీ మంచంపై కానీ పడుకోబెట్టాలి. నూలుతో తయారు చేసిన తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. స్పహలోకి వచ్చిన తర్వాత చల్లటి మంచి నీరు, సోడా, కోబ్బరి నీళ్లు, మజ్జిగ తాగించాలి. – డాక్టర్ సందీప్గంటా, జనరల్ ఫిజీషియన్ -
ఆంధ్రప్రదేశ్ : నిప్పుల గుండం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/ తాడేపల్లి రూరల్(మంగళగిరి): భగభగ మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అనేకచోట్ల 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఒకవైపు భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోగా.. దీనికితోడు అగ్నికీలల్లా వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈసీజన్లో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య వంద దాటినట్టు అనధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. ఒక్క శుక్రవారమే 28 మంది వడదెబ్బ వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఈ వేసవిలో ఏడుగురు వడదెబ్బ వల్ల చనిపోయినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: తెలంగాణ.. నిప్పుల కొలిమి..!) సెగలు.. సెగలు.. రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే కొద్దిసేపటికే ఒళ్లంతా చెమటతో తడిసిపోయి కళ్లు బైర్లు కమ్మి పడిపోయేలా పరిస్థితి తయారైంది.ఇళ్లల్లోనూ తీవ్ర వేడిమితో అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లల్లో సైతం ఏసీనో ఎయిర్ కూలరో లేకపోతే ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితి. ఇళ్ల దగ్గర కుళాయి తిప్పితే నీరు సలసలమంటూ పొగలు కక్కుతూ వస్తోంది. రాత్రి పది పదకొండు గంటలు దాటినా ఇళ్ల పైనున్న ట్యాంకుల్లోని నీరు చల్లబడటం లేదు. కుంటలు, చెరువుల్లోని నీళ్లు కూడా కాలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూరీడి ప్రతాపానికి జనమే కాదు జంతు జీవాలు, పక్షులు, జలచరాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రోజూ వందల సంఖ్యలో చనిపోతున్నాయని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎండల తీవ్రత ఇదేవిధంగా కొనసాగుతుందన్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. శనివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో 18 మండలాల్లో 44 – 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం కూడా వడగాడ్పుల తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. వడదెబ్బకు 28 మంది మృతి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బకు 28 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 10 మంది, గుంటూరు జిల్లాలో 7 మంది, వైఎస్సార్ జిల్లాలో నలుగురు, విశాఖ జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ప్రాణాలు కోల్పోతున్న పశువులు ఎండకు తట్టుకోలేక పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. వేడి నుంచి రక్షణ కోసం రైతులు తమ ఇళ్లలోని పాడిగేదెలు, ఆవులను మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చల్లని నీటితో తడుపుతున్నారు. అడవుల్లో సైతం నీరు దొరక్క జంతువులు, పక్షలు అలమటిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ కొంత వరకూ జంతువులకు నీటిని అందించే ఏర్పాట్లు చేసినా అవి చాలడంలేదు. తక్షణమే చికిత్స చేయించకపోతే చావే.. పొలాల్లో ఒంటరిగా పనులు చేస్తున్నవారు, ఎండలో బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురైతే ఎవరైనా వెంటనే గుర్తించి చికిత్స చేయించకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఉష్ణతాపం వల్ల మనిషి శరీరం నుంచి చెమట రూపంలో నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల సోడియం, పొటాషియం నిల్వల్లో మార్పులు వస్తాయి. వీటి దామాషా పడిపోవడంవల్ల మనిషి శరీరం వేడిని నియంత్రించే శక్తిని కోల్పోతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, పొటాషియం, ఇతర లవణాలు తగుమోతాదులో లేకపోవడంవల్ల మనిషి వడదెబ్బకు గురవుతారు. కాగా ప్రస్తుత వేసవిలో ఇప్పటికే వంద మందిపైగా వడదెబ్బవల్ల ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో వార్తలు వస్తుంటే పదుల సంఖ్యలోనే ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారితో ‘సాక్షి’ ప్రస్తావించగా.. ‘గుండె సంబంధిత సమస్యలున్న వారు వడగాడ్పులకు తట్టుకోలేరు. ఇలాంటి వారికి వెంటనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ మరణాలను అధికారులు గుండెపోటుగానే పరిగణిస్తారేగానీ వడదెబ్బ మృతులుగా గుర్తించరు. అందువల్లే వడదెబ్బ మరణాల నిర్ధారించే ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికలో ఈ సంఖ్య తక్కువగా ఉంటోంది’ అని వివరించారు. గుండె సమస్యలున్న వారు వీలైనంత వరకు ఎండలో బయట తిరగరాదని హైదరాబాద్‌కు చెందిన గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి తెలిపారు. వడదెబ్బ లక్షణాలు - రోజుకు ఐదారుసార్లు కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు కావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం. - జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండటం. - అయిదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం, నాలుక పిడచగట్టుకుపోయినట్లు తడారిపోవడం. - పాక్షిక లేదా పూర్తి ఆపస్మారకస్థితిలోకి వెల్లడం. - పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు ఎక్కువ వేడిగా ఉండటం. వడదెబ్బ తగిలితే ఈ లక్షణాలన్నీ ఉండాలని కాదు. వీటిలో ఏ లక్షణాలు కనిపించినప్పటికీ వైద్యులను సంప్రదించి వైద్యం చేయించాలి. వడదెబ్బకు గురైన వారిని బాగా గాలి తగిలేలా నీడలో పరుండబెట్టి చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో శరీరమంతా తుడవాలి. దీనివల్ల ఉష్ణోగ్రత తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కపర్థి సూచించారు. వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణులు, గుండెజబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. – ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సాధ్యమైనంత వరకూ ఎండలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. – తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంతోపాటు హృదయ భాగంపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. – శరీరానికి బాగా గాలి తగిలేలా వదులుగా ఉన్న తెలుపు లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. – రోజుకు కనీసం మూడు నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. ప్రతి అరగంటకొకసారి నీరు తాగుతూ ఉండాలి. – ఎండలో నుంచి వచ్చిన వెంటనే నిమ్మ రసం, ఉప్పు కలిపిన చల్లని నీరు లేదా, మజ్జిగ, కొబ్బరి నీరు తాగడంవల్ల మేలు కలుగుతుంది. – ఎలక్ట్రాల్ పౌడర్ దగ్గర ఉంచుకుని ఏమాత్రం బడలికగా ఉన్నా నీటిలో కలుపుకుని తాగాలి. దీనివల్ల చెమట రూపంలో వెళ్లిన లవణాల స్థానే శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం లభిస్తాయి. – చివరి అంతస్తుల్లో ఉన్న ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. కిటికీలకు వట్టి వేళ్లు, గోనెసంచులు వేసి వాటికి నీరు చల్లడం ద్వారా కొంత వరకూ గది వేడిని తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. రానున్న 5 రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు రానున్న ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం వివిధ జిల్లాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. మే 11వ తేదీ: 46 – 47 డిగ్రీలు – ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 43 – 45 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ అనంతపురంలలో కొన్ని ప్రదేశాలు 39 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 12వ తేదీ: 45 – 46 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 42 – 44 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 39 – 41 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 13వ తేదీ: 43 – 44 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 38 – 40 డిగ్రీలు – విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 14వ తేదీ: 43 – 44 డిగ్రీలు – గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 37 – 39 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 15వ తేదీ: 43 – 44 డిగ్రీలు – ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 38 – 39 డిగ్రీలు – విశాఖపట్నం జిల్లాలో కొన్ని ప్రదేశాలు వడగాడ్పులు.. వర్షాలు రాష్ట్రంలో విభిన్న వాతావరణం రాష్ట్రంలో ఒకపక్క వడగాడ్పులు, మరోపక్క తేలికపాటి వర్షాలతో విభిన్న వాతావరణం నెలకొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోపక్క ఒడిశా నుంచి కొమరిన్ ప్రాంతం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు శనివారం కోస్తాంధ్రలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. -
ధాన్యం కుప్పపైనే తనువు చాలించిన రైతన్న
ఎల్లారెడ్డి: ఎండ దెబ్బ తగిలి ఓ రైతు ధాన్యం కుప్పపైనే తనువు చాలించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామ శివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చోటు చేసుకుంది. మండలంలోని కొట్టాల్ గ్రామానికి చెందిన బోదాస్ గోపాల్ (49) వారం క్రితం తన రెండెకరాలలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. రోజూ ధాన్యం కుప్ప వద్ద ఎండలో కాపలాగా ఉన్నాడు. మంగళవారం ధాన్యం తూకం వేయగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలోనే ఉన్నాడు. రాత్రి యథావిధిగా ధాన్యం కుప్ప వద్ద నిద్రించాడు. బుధవారం ఉదయం తోటి రైతులు గోపాల్‌ను నిద్ర లేపగా, లేవకపోవడంతో కుటుంబీకులకు సమాచారమిచ్చారు. అధికారుల నిర్లక్ష్యంతోనే గోపాల్ మృతి చెందాడని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని రైతులు ధర్నా నిర్వహించారు. అధికారులు ధాన్యం తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయలేదని, తూకం వేయడంలో ఆలస్యం వల్లే ఎండలో కాపలా ఉన్న రైతు ఎండదెబ్బ తగలి మృతిచెందినట్లు ఆరోపించారు. పోలీ సులు రైతులను సముదాయించారు. జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డితో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామనడంతో ధర్నా విరమించారు. -
వడదెబ్బ తగిలి దంపతులు మృతి
-
రాలిపోతున్నారు..
చుంచుపల్లి: వడదెబ్బ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది. ప్రతి రోజూ ఒకరిద్దరు చొప్పున మృత్యువాత పడుతున్నారు. గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వృద్ధులు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. సకాలంలో వైద్యం అందక దుర్మరణం పాలవుతున్నారు. ఈనెల 5వ తేదీ వరకు 37 – 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా ప్రస్తుతం కొత్తగూడెంలో 42 – 43 డిగ్రీలకు చేరుకుంది. ఎండవేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడు ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఇంకెలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామానికి చెందిన వట్టం చిన్నక్క (80 ) వడదెబ్బతో మృతి చెందింది. బూర్గంపాడు మండలం సోంపల్లికి చెందిన బి. పెంటయ్య (52) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈనెల 10 నుంచి 17 వరకు వడదెబ్బతో 10 మంది మృతి చెందారు. 10వ తేదీ ఒక్కరోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన నానిపల్లి నాగమ్మ (35), పాల్వంచలోని శ్రీనివాస్ కాలనీ గట్టు సమీపానికి చెందిన తాటి సుధాకర్ (22), కోక్యాతండాకు చెందిన హలావత్ భిక్షం (50) వడదెబ్బ బారినపడి మృతిచెందారు. 12వ తేదీన కూసుమంచి మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన పెరుగు లక్ష్మమ్మ (65), 13న తల్లాడ మండలం అన్నారుగూడేనికి చెందిన దాసరి నరసింహారావు (36), 14న తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన దామల్ల నాగయ్య (47), 15న అశ్వాపురం మండలం జగ్గారం క్రాస్ రోడ్డుకు చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు తరాల నాగేశ్వరరావు (55), అదేరోజు గొందిగూడెం కొత్తూరుకు చెందిన రైతు బండ్ల నరసింహారావు(45), 16వ తేదీన ములకలపల్లి మండలం సత్యంపేట గ్రామానికి చెందిన రైతు పూనెం కృష్ణ (54), కొణిజర్ల మండలం మల్లపల్లి గ్రామానికి చెందిన భూక్య మంగ్లి (80), 17న చుంచుపల్లి మండలం పెనుబల్లికి చెందిన దంసలపూడి వెంకటేశ్వర్లు(35) ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఎండల తీవ్రత మరింత పెరిగి 50 డిగ్రీల వరకు చేరుతాయని బెంబేలెత్తుతున్నారు. చిన్నారులు, వృద్ధులకు జాగ్రత్తలు తప్పనిసరి.. 70 ఏళ్లు పైబడిన వారు, చిన్న పిల్లలు ఉన్న వారు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజు మూడు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగాలని, నీటిలో నిమ్మకాయ రసం, ఉప్పు లేదా పంచదార కలిపి తాగితే ఉపశమనం పొందుతారని అంటు న్నారు. తద్వారా కిడ్నీ వ్యాధులు కూడా దరిచేరవని చెపుతున్నారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వడదెబ్బ నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు. అవగాహన చర్యలు శూన్యం.. జిల్లాలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గత 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నా కానీ ఎక్కడా రక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో వడదెబ్బ విషయంలో ప్రజలకు అవగాహన లేక మృత్యువాత పడుతున్నారు. వడదెబ్బకు ప్రజలు గురికాకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాక వైద్యులతో అవగాహన సదస్సులు నిర్వహించాలి. గత ఏడాది వేసవిలో జిల్లాలో వడదెబ్బ బారినపడి సుమారు 60 మంది చనిపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వడదెబ్బ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. దీనిపై కలెక్టర్ కార్యాలయ ఏఓ నాగేశ్వరరావును వివరణ కోరగా.. అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారితో సహా అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. తక్షణమే అవగాహన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మే రాకుండానే మంటలు
సాక్షి, హైదరాబాద్: ఇంకా మే నెల రానేలేదు. ఏప్రిల్ మధ్యలోనే ఉన్నాం. అయినా ఎండల తీవ్రతతో జనం గుండెలు ఆగిపోతున్నాయి. ప్రభుత్వానికి అందిన అనధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 మందికి పైగా మృతి చెందినట్లు అంచనా. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెల వచ్చాక ఎండల తీవ్రత, వడగాడ్పులు ఏ స్థాయిలో ఉంటాయోనని వాతావరణశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే.. రాష్ట్రంలో సాధారణం కంటే 2–4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో ఏకంగా 43 డిగ్రీల వంతున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మరోవైపు ఎండల ప్రభావం పంటలపై పడింది. వ్యవసాయశాఖ వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయినట్లు చెబుతున్నారు. అంతేగాక అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. ఎండలకు కూలీలు కూడా రావడంలేదు. మరోవైపు వరి కోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో అనేకచోట్ల ధాన్యం భూమి మీదే రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డేంజర్ జోన్లో తెలంగాణ దేశంలోనే అధికంగా వడగాడ్పులు వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉంది. ఫలితంగా రానున్న రోజుల్లో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాల్పులు వీస్తాయి. మే నెలలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. డేంజర్‌జోన్‌లో తెలంగాణ ఉండటంతో మరో 20 రోజుల వరకు వడగాడ్పులు తప్పవని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వేసవి ప్రణాళిక అమలే కీలకం వేసవి ప్రణాళికను విపత్తు నిర్వహణశాఖ తయారుచేసి కలెక్టర్లు, ఇతర అన్ని శాఖల అధికారులకు అందజేసింది. దాని ప్రకారం మొబైల్ ఫోన్లలో మెసేజ్‌లు, వాట్సాప్ తదితర పద్దతుల ద్వారా వడదెబ్బ, ఎండ వేడిమి హెచ్చరికలను ఎప్పటికప్పుడు జనానికి చేరవేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను కిందిస్థాయి అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం ఎక్కడా అమలుకావడంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయీడ్స్ అందుబాటులో ఉంచాలి. కానీ ఇవేవీ ఆచరణకు నోచుకోవడంలేదు. కార్మికులు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ఎండల తీవ్రత, జాగ్రత్తలపై విరివిగా కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతరత్రా సమాచారాన్ని ముద్రించి ఇవ్వాలని ఆదేశించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదు. నేడు రేపు అధిక ఉష్ణోగ్రతలు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పలుచోట్ల సాధారణం కంటే 2–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చంది. డయేరియా వచ్చే ప్రమాదం వేసవిలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు వడదెబ్బ, డయేరియా బారినపడే ప్రమాదముంది. కాబట్టి ఎండలకు వెళ్లకుండా చూసుకోవాలి. వెళ్లాల్సి వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వాంతులు, వీరోచనాలు వచ్చే ప్రమాదముంది. పిల్లలు, పెద్దలు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ నరహరి, పిల్లల వైద్య నిపుణులు, నీలోఫర్ ఈ జాగ్రత్తలు తప్పనిసరి - ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. - తెలుపు లేదా లేత రంగు పలుచటి కాటన్ దుస్తులు ధరించాలి. - తలకు వేడి తగలకుండా టోపీ రుమాలు కట్టుకోవాలి. - పలుచటి మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని తయారుచేసిన ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. - వడదెబ్బ తగిలిన వారిని నీడలో చల్లని ప్రదేశంలో ఉంచాలి. - శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. - వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి.