ఆగని మరణాలు
భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల సెగకు తట్టుకోలేక జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఖరుకు కోళ్లు, గొర్రెలు, మేకలు కూడా మృత్యువాత పడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో రోజుకు నలుగురు నుంచి ఎనిమిది మంది వరకు జనం వడదెబ్బతో పిట్టల్లా రాలిపోతూనే ఉన్నారు. వరుస మరణాలు ఆందోళనను కలిగిస్తున్నాయి.
గుత్తి, గుత్తి రూరల్ (గుంతకల్లు), బత్తలపల్లి (ధర్మవరం) :
జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వడదెబ్బకు గురై మృతి చెందారు. గుత్తి పట్టణంలోని కరుణం వీధికి చెందిన డి.బాషా (50) సొంత పనుల నిమిత్తం రెండు రోజులపాటు ఎండలో తిరగడంతో మంగళవారం వడదెబ్బకు గురయ్యాడు. సొమ్మసిల్లి కింద పడిపోయాడు. తలపట్టేసింది. ఆ రోజు రాత్రికి అలాగే ఇంట్లో పడుకున్నాడు. బుధవారం ఉదయానికి కూడా ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
- బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లికి చెందిన గుజ్జల నారాయణ (63) పంటకు నీరు పెట్టడానికి మంగళవారం వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. తలనొప్పిస్తోందని నొప్పులు తగ్గించే మాత్ర వేసుకున్నాడు. అర్థరాత్రి సమయంలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించేలోపు మృతి చెందాడు.
- గుత్తిలో హోటల్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కొత్తపేటకు చెందిన కంబయ్య(66) బుధవారం మధ్యాహ్నం విధులు ముగించుకొని మండుటెండలో ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే సొమ్మసిల్లి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబసభ్యులు గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించేలోపే అతడు మృతి చెందాడు.
పెనుకొండ రూరల్ : పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యంలో కురుబ ఎల్లయ్య(60) అనే గొర్రెల కాపరి బుధవారం వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గుట్టూరు పీహెచ్‌సీ వైద్యాధికారి జగదీష్‌బాబు తెలిపారు.
తొమ్మిది గొర్రెలు మృతి
రొద్దం (పెనుకొండ) : రొద్దం మండలం కంబాలపల్లి గొర్రెల కాపరి కంబదూరప్పకు చెందిన తొమ్మిది గొర్రెలు బుధవారం వడదెబ్బకు గురై మృతి చెందాయి. పశువైద్యాధికారి శుభనిరీక్షన్ సంఘటన స్థలానికి వెళ్లి గొర్రెలకు పోస్టుమార్టం చేశారు.