
ప్ర'తాపం' చూపిస్తున్న ఆ 'ద్వయం'
సూర్యుడు చూస్తున్నాడు... అలా ఇలా కాదు చాలా తీక్షణంగా. ఆయన చూపుకు వాయుదేవుడు నేనున్నాంటూ తోడయ్యాడు.
సూర్యుడు చూస్తున్నాడు... అలా ఇలా కాదు చాలా తీక్షణంగా. ఆయన చూపుకు వాయుదేవుడు నేనున్నానంటూ తోడయ్యాడు. ఇంకే తెలుగు రాష్ట్రాలు వడగాల్పులతో అగ్నిగుండంలా మండిపోతుంది. ఆ 'ద్వయం' దెబ్బకు మంచం మీద మూల్గుతున్న బామ్మ నుంచి చిన్న పిల్లలు.... పక్షలు, జంతువులు అంతా పిట్టల్లా రాలిపోతున్నారు. రోజూ తెల్లవారడంతోనే సూర్యుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.
దాంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు.. నగరాలు మధ్యాహ్నం 11.00 గంటలు నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఎవరో కర్ఫ్యూ విధించినట్లు రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఎవరికైనా అత్యవసర పని పడిన బయటకు ఇలా వచ్చి పని చూసుకుని మళ్లీ అలా ఇంటిముఖం పడుతున్నారు. వేసవి మొదలైన నాటి నుంచి ఈ రోజు శనివారం వరకు ఇరు రాష్ట్రాలలో మొత్తం 427 మంది మృతువాత పడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో 204 మంది మరణించగా... వారిలో ఒక్క ప్రకాశం జిల్లాలోనే 63 మంది చనిపోయారు. అలాగే తెలంగాణలో 230 మంది మరణించగా... వారిలో అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే 67 మంది చనిపోయారు. వడదెబ్బతో ప్రతి జిల్లాలో రోజు కనీసం ఎటులేదన్నా 20 మంది మరణిస్తున్నారు. రాత్రుళ్లు కూడా వడగాల్పులు అధికమైయ్యాయి. దీనికి తోడు కరెంట్ కోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వేడిమిని తాళ లేక జనాలు శీతల పానీయాలు, కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్నారు. శని,ఆదివారాలు కూడా భానుడు మరింత విజృంభిస్తాడని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. అంతే కాదు రెడ్ అలర్ట్ను కూడా ప్రకటించేసింది. భానుమూర్తి భగభగలకు ఇంకా ఎంత మంది బలికానున్నారో...