ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీ వడదెబ్బకు గురై మృతిచెందాడు.
బాన్సువాడ : ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీ వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని బీర్కూర్ మండలం బొప్పాస్‌పల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బొప్పాస్‌పల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ హఫీజ్(36) అనే వ్యక్తి గత వారం రోజులుగా ఉపాధి హామీ పనికి వెళ్తున్నాడు. కాగా ఈ రోజు మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన ఎండలో పనిచేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హఫీజ్ కొద్దిసేపటికే మృతిచెందాడు.
అయితే హఫీజ్ మృతికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.