Bansuwada
-
కామారెడ్డి జిల్లా: భార్య ఘాతుకం.. పాడుబడ్డ ఇంటిలో షాకింగ్ దృశ్యం
సాక్షి, కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో దారుణం జరిగింది. రాములు అనే వ్యక్తిని గొడ్డలితో భార్య మంజుల, మృతుడి తండ్రి నారాయణ నరికి చంపారు. రాములును హత్య చేసి ఇంటి ప్రక్కనే ఉన్న మరో పాడుబడ్డ ఇంటి లోపల నీటి ట్యాంకులో పడేశారు. ఆపై దుర్వాసన వస్తుందని ఆ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు.తన భర్త రాములు కనబడటం లేదని ఈ నెల 16న భార్య మంజుల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘాతుకం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాములు మృతదేహాన్ని బాన్సువాడ పోలీసులు వెలికితీశారు. తండ్రి నారాయణ, భార్య మంజులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
బాన్సువాడ దవాఖాన సరికొత్త రికార్డు.. ఒకే నెలలో 504 ప్రసవాలు
కామారెడ్డి: బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో అగస్టులో 504 ప్రసవాలు జరిగాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ప్రారంభించి రెండేళ్లవుతోందన్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో 504 ప్రసవాలు జరిగాయన్నారు. వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వైద్యులు సుధ, సిబ్బంది ఉన్నారు. -
సేవాజ్యోతి
అనారోగ్యాలను దూరం చేసే చల్లని చిరునవ్వు .. విధి నిర్వహణలో అంకితభావం .. రోగులపాలిట ఆమె అపర నైటింగేల్ ... సమాజ క్షేమం కోరేవారికి తర తమ భేదాలుండవు అని తన చేతల్లో చూపుతోంది కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న ఆరోగ్యజ్యోతి. పాతికేళ్లుగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకున్నారు ఆరోగ్యజ్యోతి. ఆమె సేవలను గుర్తించి ది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నాటక వారు ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023’ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మంగళవారం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుని సేవాజ్యోతిగా గుర్తింపు పొందింది అరోగ్యజ్యోతి. బోధన్ పట్టణానికి చెందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తోంది. 1998లో స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో చేరి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రెండేళ్లు పనిచేసిన ఆమె 2000 సంవత్సరంలో బోధన్ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి అక్కడే ఇరవై ఏళ్లుగా విధులు నిర్వర్తించింది. 2019 లో హెడ్ నర్స్‌గా పదోన్నతి పొందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి, అక్కడే విధుల్లో కొనసాగుతోంది. కరోనా కాలంలో వైద్యులతో కలిసి రోగులకు ఎన్నో సేవలందించిన ఈ నైటింగేల్ పాతికేళ్ల కాలంలో ఎక్కడ ఉద్యోగం చేసినా విధి నిర్వహణకు అంకితమై పనిచేస్తూ వచ్చింది. దీంతో ఆమె అందరికీ తలలో నాలుకలా మారింది. ఆపరేషన్ థియేటర్‌తోపాటు ప్రసూతి వార్డుల్లోనే ఆమె ఎక్కువగా విధులు నిర్వర్తించింది. అధికారుల నుంచి ఎన్నో మన్ననలు, సామాజిక సేవలకు గాను అవార్డులనూ పొంది సేవాగుణంలో ముందువరసలో నిలిచింది. కూతురి మరణంతో.. ఆరోగ్య జ్యోతి కూతురు అనుకోని పరిస్థితుల్లో విద్యుత్‌షాక్‌కు గురై మరణించింది. కూతురి మరణంతో ఆవేదనకు గురైన ఆరోగ్యలక్ష్మి తన సేవలను మరింత విస్తృతం చేయాలని సంకల్పించింది. ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చేపట్టింది. వైద్యరంగంలో తనకున్న పరిచయాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతుంటుంది. బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టి రోగులకు అండగా నిలుస్తోంది. అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేపట్టి, గర్భిణీలు, బాలింతలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకుంటుంది. – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి మాకెంతో గర్వకారణం సేవతో అందరి మన్ననలు పొందే ఆరోగ్యజ్యోతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023 అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మేమంతా గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు స్ఫూర్తి మిగతా అందరిలో కలగాలని కోరుకుంటున్నాను. – డాక్టర్ శ్రీనివాసప్రసాద్, సూపరింటెండెంట్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అందరి సహకారంతో... సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఉద్యోగ నిర్వహణలో తోటి ఉద్యోగులు, వైద్యుల సహకారం,ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలు ఎంతోమందికి సాయం అందించేవారు. వాళ్లను చూసి నాకూ అలవాటైంది. నా ప్రయత్నాల్లో మా వారు అండగా నిలిచారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. – ఆరోగ్యజ్యోతి, హెడ్నర్స్, బాన్సువాడ -
స్పీకర్ పోచారం కంటతడి
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓ కార్యక్రమంలో కంటతడి పెట్టారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ..’ పాటను ప్లే చేయగా, తన తల్లి దివంగత పరిగె పాపమ్మను గుర్తు చేసుకుని ఒక్కసారిగా పోచారం ఉద్వేగానికి గురయ్యారు. 102 ఏళ్ల వయసులో తన తల్లి మరణించారని, ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. తన విజయాల్లో భార్య పుష్పమ్మ పాత్ర కూడా ఎంతో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. – బాన్సువాడ చదవండి: అదుపులోనే భైంసా -
రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన: బండి సంజయ్
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో లాఠీలు, జైళ్ల కోసం నిధులు కేటాయించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులుపెట్టి లాఠీలు ఝళిపిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని, తూటాలకు భయపడబోమని, ఎంతమందిని అరెస్టుచేసి జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో బండి సంజయ్ మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రాణాలివ్వడానికీ వెనుకాడరని, ఇందుకు కామారెడ్డి జిల్లాలో రేవూరి సురేందర్ నిదర్శనమన్నారు. నక్సలైట్లు సురేందర్‌ను పొట్టన పెట్టుకున్నా బీజేపీ కార్యకర్తలు ఏనాడూ భయపడలేదన్నారు. రాష్ట్రంలో రాక్షస, అవినీతి పాలన నడుస్తోందన్నారు. తెలంగాణను దోచుకుంటున్న దొంగలను కూడా అరెస్టుచేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన నడుస్తోందని సంజయ్ దుయ్యబట్టారు. గిరిజనులు సాగు చేసుకొంటున్న పోడు భూముల సమస్యను వారంలో పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి.. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూములను టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని సంజయ్ ధ్వజమెత్తారు. బాన్సువాడ ఛత్రునాయక్ తండాలో రైతుల పంటలను అటవీ అధికారులతో దున్నించారని, గిరిజనులకు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు ఏపాటిదో ఇది రుజువు చేస్తుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి.. టీడీపీ, టీఆర్ఎస్ హయాంలలో ఆయన మంత్రి పదవి పోవడానికి కారణాలేంటో రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుసని సంజయ్ అన్నారు. పోచారం కుమారులు బాన్సువాడలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తాము నిజామాబాద్ నుంచి సభకు వస్తుంటే పోలీసులు రక్షణ కల్పించలేదని, అదే పోచారం కుమారుల వెంట కాన్వాయ్‌లు నడుపుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ బాన్సువాడకు పట్టిన గబ్బిలాలను పారదోలే అవకాశం వచ్చిందన్నారు. సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరగా, వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, అరుణతార, యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కన్నతండ్రే.. కాలయముడు
సాక్షి, బాన్సువాడ: కన్న తండ్రే ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. మద్యానికి బానిసై, విచక్షణ మరచి ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి దారుణంగా చంపాడు. ముగ్గురు పిల్లలు తుదిశ్వాస విడిచాక తీరిగ్గా ఇంటికి వెళ్లాడు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి సమీపంలోని దాస్‌నగర్‌కు చెందిన ఫయాజ్ 2009లో బాన్సువాడ పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో నివసించే నీలోఫర్‌ను వివాహం చేసుకున్నాడు. ఫయాజ్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో ఇల్లరికం వచ్చి బాన్సువాడలో స్థిరపడ్డాడు. వీరికి వరుసగా ముగ్గురు కూతుళ్లు పుట్టారు. నాలుగో కాన్పులో ఒక బాబు, పాప జన్మించారు. చిన్న కూతురును రూ.50 వేలు తీసుకుని బంధువులకు దత్తత ఇచ్చాడు. సెంట్రింగ్ పనిచేసే ఫయాజ్ తాగుడు, జూదానికి బానిస కావడంతోఅతడిని ఇటీవల ఎవరూ పనిలోకి తీసుకోవడం లేదు. దీంతో భార్య నీలోఫర్ బట్టలు కుడుతూ, మహిళా సంఘం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఫయాజ్ డబ్బుల కోసం భార్యను రోజూ వేధిస్తుండేవాడు. గురువారం రాత్రి బాగాతాగి వచ్చి డబ్బుల కోసం భార్యను తీవ్రంగా కొట్టాడు. అదే సమయంలో పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులకు తన భర్త గురించి నీలోఫర్ ఫిర్యాదు చేసింది. దీనిని మనసులో పెట్టుకున్న ఫయాజ్.. శుక్రవారం ఉదయం సైతం ఆమెను తీవ్రంగా కొట్టాడు. అనంతరం అతను ముగ్గురు కూతుళ్లు, కుమారుడిని తీసుకుని బయటకు వెళ్లాడు. సమీపంలోని దర్గాలో కందూరు చేస్తున్నారని, అక్కడికెళ్లి అన్నం తిందామని చెప్పి వారిని తాడ్కోల్ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అయితే నాలుగేళ్ల కుమారుడు రైస్ మధ్యలోనే ఇంటికి వెళ్లాడు. దీంతో ముగ్గురు కూతుళ్లను చెరువు వద్దకు తీసుకెళ్లిన ఫయాజ్.. ఒక్కొక్కరిని బలవంతంగా నీటిలో ముంచాడు. ఆఫియా బేగం(10), మహీన్ బేగం (8), జోయా (6)లను నీటిలో బలవంతంగా ముంచి, వారిపై కూర్చున్నాడు. ఊపిరి ఆడక వారు చనిపోవడంతో ఇంటికి వెళ్లాడు. తడి బట్టలతో వచ్చిన భర్తను చూసిన నీలోఫర్.. కూతుళ్లు ఎక్కడని అడిగింది. వారు దర్గా వద్ద అన్నం తింటున్నారని చెప్పి, అక్కడినుంచి కల్లు దుకాణానికి వెళ్లి కల్లు తాగాడు. భర్తపై అనుమానం వచ్చిన నీలోఫర్ చెరువు వద్దకు వెళ్లింది. అక్కడ కూతుళ్ల చెప్పులను చూసి స్థానికులకు విషయం చెప్పింది. స్థానికులు చెరువులో గాలించగా పిల్లల మృతదేహాలు దొరికాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కల్లు దుకాణంలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ దామోదర్‌రెడ్డి, సీఐ మహేశ్‌గౌడ్‌లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బంధువుల ఆందోళన.. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ మృతుల తల్లి నీలోఫర్, బంధువులు, డ్రైవర్స్ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తన కళ్లముందే భర్తను ఉరితీయాలని నీలోఫర్ డిమాండ్ చేసింది. డీఎస్పీ వారికి నచ్చజెప్పి పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూతుళ్ల ఉసురుతీసి చెరువులో పడేశాడు!
-
ముగ్గురు చిన్నారులను చెరువులో ముంచి..
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫయాజ్ అనే కసాయి తండ్రి ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి దారుణంగా హత్య చేశాడు. గురువారం సాయంత్రం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు.. అఫియా (10), మహీన్ (9), జియా( 7) రాజారాం దుబ్బ చెరువులో విగతజీవులై కనిపించారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృత దేహాలు శుక్రవారం బయటపడ్డాయి. కుటుంబ కలహాలతోనే తండ్రి ఫయాజ్ ఈ దారుణానికి పాల్పడినట్టు గ్రామస్తులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
పెళ్లి చేయడం లేదన్న మనస్తాపంతో..
సాక్షి, బాన్సువాడ : తల్లిదండ్రులు తన పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. పొతంగల్‌కు చెందిన నరేశ్(22) కొన్నేళ్లుగా బోర్లంలోని తన మేనమామ మద్ది బాలయ్య వద్ద ఉంటున్నాడు. నరేష్ కొంతకాలంగా తనకు పెళ్లి చేయాలని తన తల్లి విఠవ్వ, అన్న కిషన్‌పై ఒత్తిడి తెచ్చాడు. కొన్ని రోజులు ఓపిక పట్టమని వారు సర్ది చెబుతూ వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన నరేశ్ నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నరేశ్‌ను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. నాలుగు రోజుల పాటు అక్కడ చికిత్స అందించిన వైద్యులు యువకుడి పరిస్థితి విషమించిందని మూత్ర పిండాలు, కాలేయం దిబ్బతిందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలైన తల్లిదండ్రులు బుధవారం నరేశ్‌ను ఇంటికి తీసుకువచ్చారు. ఆరోగ్యం విషమించి గురువారం ఇంటి వద్ద నరేశ్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
సంక్షేమంలో నంబర్ వన్
బాన్సువాడ: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రూ.100 కోట్లతో జరిగిన పలు అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారని, అందుకే అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధించినట్లే ఫ్లెక్సీ కల్చర్‌ను కూడా నిర్మూలిద్దామని మంత్రి పిలుపునిచ్చారు. పాపను పలకరించి.. రూ.2 వేలు ఇచ్చి.. కేటీఆర్ బాన్సువాడలోని మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించి చార్జింగ్ ఆటోలో పోచమ్మగల్లి మీదుగా వెళ్తుండగా, అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన మహిళలను చూసి ఆగారు. ఒక మహిళ పాపను ఎత్తుకొని ఉండగా, ఆ పాపను పలకరించి బాగున్నావా అంటూ మాట్లాడారు. బాగా చదవాలని వెన్ను తట్టి రూ.2 వేల నగదును అందజేశారు. స్పీకర్‌గా ఆదేశిస్తున్నా.. బాన్సువాడలోని వీక్లీ మార్కెట్లో మున్సిపల్ భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని స్పీకర్‌గా ఆదేశిస్తున్నానని పోచారం మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. స్పందించిన కేటీఆర్.. స్పీకర్ కోరినన్ని నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. -
నేడు బాన్సువాడకు మంత్రి కేటీఆర్ రాక
సాక్షి, కామారెడ్డి: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం జిల్లాకు రానున్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో అన్ని బల్దియాలపై గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో కేటీఆర్ ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారని తెలిసింది. అభివృద్ధి ఇలా.. బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పాటైన తరువాత దాదాపు రూ. వంద కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానంగా రోడ్ల వెడల్పు, డ్రెయినేజీల నిర్మాణం, స్టేడియం నిర్మాణం, మినీ ట్యాంక్‌బండ్ పనులతో పాటు మరికొన్ని పనులు చేపట్టారు. రూ. 37 కోట్లతో బాన్సువాడ పట్టణంలోని శ్మశాన వాటిక నుంచి బస్సు డిపో వరకు సుమారు 3 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసల సీసీ రోడ్డుగా మార్చారు. ఫుట్‌పాత్‌తోపాటు డ్రెయినేజీలు నిర్మించారు. రహదారి మధ్యలో డివైడర్లు, హైమాస్ట్ లైట్లను బిగించారు. రూ. 2.40 కోట్లతో పట్టణంలోని కమ్యూనిటీ హాల్ వద్ద మినీ స్టేడియం నిర్మించారు. మినీ స్టేడియం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. రూ. 7.80 కోట్లతో కల్కి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దారు. రూ. 25 కోట్లతో పట్టణంలోని వివిధ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా కాలనీల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. పట్టణంలో చెత్తాచెదారాన్ని తరలించేందుకు ఆటోలు, ట్రాక్టర్లను మంజూరు చేశారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలను తెప్పించారు. మరికొన్ని అభివృద్ధి పనులూ చేపట్టారు. ఆయా పనులకు మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేటీఆర్ పర్యటన వివరాలు.. మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం 10 గంట లకు హెలికాప్టర్ ద్వారా బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. ఆయన వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉంటారు. మంత్రులు పట్టణంలో పర్యటిస్తారు. ప్రధాన రహదారితో పాటు డ్రెయినేజీలు, సీసీ రోడ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియంలను ప్రారంభిస్తారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు మంత్రి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏర్పాట్లు పూర్తి మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేయించారు. -
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
-
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, నిజామాబాద్ : మల్లారం గండి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి బాన్సువాడ వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సు అదుపు తప్పడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కకు దిగిపోయింది. దీంతో భయబ్రాంతులకు గురైన ప్రయాణీకులు వెంటనే కిటికీల నుంచి కిందకు దిగారు. కాగా అడవిలోకి దూసుకుపోయి ఉంటే మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉండేదని డ్రైవర్‌పై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వారంలో జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్
సాక్షి, బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తన సొంతూరు పోచారంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను బుధవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదవారి ఆత్మగౌరవం కాపాడటానికి ప్రభత్వం ఖర్చుకు వెనుకాడకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించామని, 15 వేల ఇళ్లు నిర్మించడమే లక్ష్యమని స్పీకర్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ శివారులో 500 ఇళ్లు పూర్తిచేసి మరో 500 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించామన్నారు. పూర్తయిన ఇండ్లను త్వరలోనే సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రారంభించి అర్హులైన వారికి పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే అలీసాగర్ రివర్స్ పంపింగ్.. వారం రోజుల్లో సీఎం కేసీఆర్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శ్రీరాం సాగర్‌లోకి రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీళ్లు వచ్చాయన్నారు. అలాగే అలీసాగర్ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా నిజాంసాగర్ 28 డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు తీసుకురావడానికి సుమారు రూ.150కోట్లతో సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారన్నారు. నాన్ కమాండ్ ఏరియాలో ఉన్న చందూర్, జాకోరాల్లో ఎత్తిపోతల పథకాలకు భూమిపూజ చేయడంతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను సీఎం కేసీఆర్ పంపిణీ చేస్తారాన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, సర్పంచ్ రాధ సాయిరెడ్డి, ఎంపీపీ నీరజారెడ్డి, జెడ్పీటీసీ పద్మా, ఎఎంసీ చైర్మన్ నందిని, పోచారం సురేందర్‌రెడ్డి, అంజిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాస్, మోహన్‌నాయక్, భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపిన అధికారులు పోచారం గ్రామంలోని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి బుధవారం కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మర్యాద పూర్వకంగా వచ్చారు. దసరా పండుగ సందర్బంగా జమ్మిఆకులు(బంగారం) పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ సుదర్శన్ ఉన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, నిజాంసాగర్: నాగమడుగు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రానుండడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. సీఎం ఈనెల 11, 12, 13, 14 తేదీలలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. మంగళవారం కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లు నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. నిజాంసాగర్ మండలంలోని ఒడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల శివారులో ఉన్న మంజీర నదిపైన రూ. 476.2 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మించాలని సంకల్పించిన విషయం తెలిసిందే.. ఈ పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ పట్టణం నుంచి బస్సు ద్వారా వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ మార్గాన్ని కలెక్టర్, ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదల తొలగింపు, హరితహారం మొక్కలు నాటడం, వాటి చుట్టూ ట్రీగార్డుల ఏర్పాటు పనులపై అధికారులకు సూచనలిచ్చారు. వారి వెంట బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో పర్బన్న, ఈజీఎస్ ఏపీవో సుదర్శన్, కోమలంచ సర్పంచ్ అనురాధ, ఎంపీటీసీ బండారు లక్ష్మి తదితరులు ఉన్నారు. -
పాత హామీలతో మభ్యపెడ్తున్నారు: బాలరాజు
సాక్షి, బాన్సువాడరూరల్:గత ఎన్నికల్లో ఇచ్చిన పాత హామీలనే మళ్లీ మళ్లీ ఇస్తూ టీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని , అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసుల బాలరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని కొయ్యగుట్ట, బోర్లం, దేశాయిపేట్, సోమేశ్వర్, మొగులాన్పల్లి, తిర్మలాపూర్ తదితర గ్రామాలు, తండాల్లో పర్యటించి మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీసీ కోటాలో తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చిందని తనను ఆదరించి గెలిపించాలన్నారు. ఈఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తనను గెలిపిస్తే నాయకునిగా కాకుండా సేవకునిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, బాజాభజంత్రీల నడుమ స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో టీడీపీ నియోజన వర్గ ఇంచార్జి కొడాలి రాము, నాయకులు ప్రతాప్‌సింగ్ రాథోడ్, అలీబిన్ అబ్దుల్లా, శంకర్‌గౌడ్, నర్సన్న చారీ, ఖాలేఖ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలి బీర్కూర్: పరిపాలన చేతకాక కాడి కింద పడేసిన టీఆర్ఎస్ పార్టీని ఓడించి ఇంటికి పంపించాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావ్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రజాకూటమి బాన్సువాడ అభ్యర్ధి కాసుల బాలరాజ్‌కు మద్దతుగా బీర్కూర్ మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజాకూటమి అభ్యర్ధి కాసుల బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు, మల్యాద్రిరెడ్డి మండల నాయకులు అబ్దుల్ హైమద్, పోగు నారాయణ, ఆరీఫ్, ఓంకార్, ఈరాస్ సాయిలు, దొంతురాం కాశీరాం పాల్గొన్నారు. కోటగిరి : కోటగిరి మండల కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ తనయుడు కాసుల రోహిత్ ఎన్నికల ప్రచారం చేశారు. -
వైఎస్సార్ తర్వాత కేసీఆరే : పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, బాన్సువాడ టౌన్(బాన్సువాడ): సంక్షేమ పథకా లు అమలు చేయడంలో దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి తర్వాత ఆపద్ధర్మ సీఎం కేసీఆరే అని బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు తజ్ముల్ బాన్సువాడలో పోచారంను కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో వైఎస్ తర్వాత కేసీఆర్ ముందుంటారని అన్నారు. రైతులకు మేలు చేసిన వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్నట్లు ఆయన అన్నారు. టీఆర్ఎస్కు వైఎస్సార్ సీపీ మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, వర్ని మండలంలో ఏ సమస్యలున్నా తజ్ముల్కు చెప్పాలని, తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారిస్తానని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో పోచారం రవీందర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, బద్యనాయక్ తదితరులు ఉన్నారు. అలాగే బాన్సువాడ నియోజకవర్గం నుంచి పిరమిడ్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న కొండని అంజయ్య శ్రీనివాస్‌రెడ్డికి, టీఆర్ఎస్ పార్టీకి తన మద్దతు తెలిపారు. అలాగే మండలంలోని రాంపూర్ ముదిరాజ్ సంఘం సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. -
ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి: కాసుల బాల్‌రాజ్
సాక్షి, కోటగిరి: ప్రజలందరు కలిసి ఏకమై ఈఒక్కసారి అవకాశం ఇవ్వాలని బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాసులబాల్‌రాజ్ ఓటర్లను కోరారు. తనను గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటు సేవకుడిగా పనిచేస్తానన్నారు. మండలంలోని యాద్గార్పూర్, కొల్లూరు, దోమలెడ్గి, సోంపూర్, టాక్లీ, హంగర్గ గ్రామాల్లో సోమవారం కాసులబాల్‌రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు కాసులబాల్రాజ్కు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తే అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ, ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం, డ్వాక్రా మహిళలకు రూ. లక్షా గ్రాంటుతో పాటు వడ్డీలేని రుణాలు రూ. 10 లక్షలు ఇస్తామని, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 20 శాతం కేటాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు మల్యాద్రిరెడ్డి, కొడాలిరాము, రామకృష్ణారావ్, వేములపల్లిసత్యం, డాక్టర్సునీల్కుమార్, తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారం వర్ని : మండలంలోని కోటయ్య క్యాంపు, గంగారెడ్డినగర్, లక్ష్మీపూర్ క్యాంపు సోమవారం బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆంశాలను ప్రజలకు వివరిస్తు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా వడ్డేపల్లిలో టీఆర్ఎస్ నాయకుడు బీమా శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కార్యక్రమంలో నియోజక వర్గ నాయకుడు మల్యాద్రిరెడ్డి, మండల పార్టీ కన్వీనర్ పండరి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనిపూర్ రాజీరెడ్డి, సెగ్మెంట్ ఉపాద్యాక్షుడు బానోత్ రమేష్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి భారీ, మాజీ జెడ్పీటీసీ రంజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా: కాసుల బాల్‌రాజ్
సాక్షి, నస్రుల్లాబాద్ : బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యునిగా ఈ సారి ఆశీర్వదించండి అని బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టి అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని సంగం,అంకోల్,బొమ్మన్‌దేవ్‌పల్లి హాజీపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు రూ. 50వేల వరకు రుణ మాఫి,సంవత్సరానికి 6గ్యాస్ సిలిండర్లను ,డ్వాక్రా గ్రూపుకు రూ.లక్ష గ్రాంట్ ఉచితం ఇస్తామన్నారు.ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మాల్యాద్రి రెడ్డి,రాజిరెడ్డి,దొంతురాం కాశీరాం,రాజేశ్వర్ రెడ్డి,సత్య నారాయణ ఉన్నారు. ఏడాదికి 6 సిలిండర్లు ఉచితం బాన్సువాడరూరల్: కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుందని యూత్‌కాంగ్రెస్ మండల అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడ్కోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ , ఒకే విడతలో 2లక్షల రుణమాఫీ చేస్తుందని, ప్రతి డ్వాక్రా గ్రూప్‌కు రూ.లక్ష నగదు ఉచితంగా అందిస్తుందన్నారు. దేశాయిపేట్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రత్నాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వచ్చే మృగశిర నాటికి కాళేశ్వరం నీళ్లు.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, బాన్సువాడరూరల్: వచ్చే మిర్గం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నిజాంసాగర్ ఆయకట్టుకింద రెండు పంటలకు సాగునీరు అందిస్తామని బాన్సువాడ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మండలంలోని కొయ్యగుట్ట కాలనీ, కొయ్యగుట్ట తండా, కేవ్లానాయక్ తండా, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. అర్హులైన నిరుపేదలందరికి డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తండాల్లో జగదాంబ సేవాలాల్ మందిరాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు అందిస్తామన్నారు. గిరిజన మహిళలతో కలిసి కాసేపు నృత్యం చేశారు. బద్యానాయక్, అంజిరెడ్డి, నార్లసురేష్, మోహన్‌నాయక్, గోపాల్‌రెడ్డి, శ్రీధర్, బన్సీనాయక్, అంబర్‌సింగ్, ప్రేమ్‌సింగ్ పాల్గొన్నారు. -
119 నియోజకవర్గాలు.. 1821 అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 119 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 1,821 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 23తో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి 42 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. అతి తక్కువగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఆరుగురు అభ్యర్థులే పోటీలో నిలిచారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో అత్యధికంగా అభ్యర్థులు రేస్‌లో నిలవగా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లో అతి తక్కువగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. మల్కాజ్గిరి తర్వాత ఉప్పల్, ఎల్బీనగర్లో 35 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. నగరం బయట అత్యధికంగా మిర్యాలగూడలో 29 మంది, సూర్యపేటలో 25 మంది ఈ ఎన్నికల బరిలో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. బాన్సువాడ తర్వాత అతి తక్కువగా జుక్కల్, బోత్ నియోజకవర్గాల్లో ఏడుగురు.. ఎల్లారెడ్డి, నిర్మల్‌ల్లో 8 మంది పోటీపడుతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి 119 మంది బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి 99, బీజేపీ 118, సీపీఐ 3, టీడీపీ 13, ఎంఐఎం 8, సీపీఐ(ఎం) 26, బీఎస్పీ 107, ఎన్నికల కమిషన్చే గుర్తింపు పొందిన ఆయా పార్టీల నుంచి 515, స్వతంత్ర్య అభ్యర్థులుగా 1306 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతుండగా..ఫలితాలు 11న వెలువడనున్న విషయం తెలిసిందే. -
రైతుబంధుకు యూఎన్వో గుర్తింపు
సాక్షి,బాన్సువాడ: రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంట్‌ను 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామని చెప్పారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించామని అన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం భారీగా గోదాములు నిర్మించామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమాతో ధీమా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందని పోచారం అన్నారు. తమ వెనక ప్రభుత్వం ఉంది అనే బలం వచ్చిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు. -
మిర్చీ తీసుకో.. ఓటు వేసుకో..!
సాక్షి, బాన్సువాడ: ఏడు పదుల వయస్సులోనూ మంత్రి పోచారం ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రెండు నెలల క్రితమే కంటి ఆపరేషన్, మోకాలికి శస్త్రచికిత్స చేయికున్నారు. అయినా ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం బాన్సువాడ మండలంలో పర్యటించిన ఆయన పులికుచ్చ తండాలోని ఓ హోటల్లో మిర్చీలు వేసి ఆకట్టుకున్నారు. అలాగే లంబాడీ మహిళల కోరికపై వారితో కలిసి నృత్యాలు చేశారు. ఎన్నికలొచ్చే.. మర్యాద తెచ్చే..! సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎన్నికలోచ్చాయి.. ఓటర్లకు ఎనలేని మర్యాదను తెచ్చిపెట్టాయి. అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు చేతులెత్తి నమస్తే పెట్టినా పట్టించుకోని కొందరు నాయకులైతే ఎన్నికల పుణ్యామాని ఇప్పుడు ఓటర్లపై ఎనలేని మర్యాదను కనబరుస్తున్నారు. ఓటర్లు కంటబడగానే చేతులెత్తి వినమ్రతగా దండాలు పెట్టడంతోపాటు అన్నా.. తమ్మీ.. అక్క.. అంటూ ఆప్యాయతతో పలకరిస్తున్నారు. గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్లిన నాయకులు ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారితో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పలుపార్టీల నాయకులు ఉదయాన్నే రోడ్లపైకి చేరి వచ్చి, పోయే ఓటర్లను ప్రేమతో పలకరిస్తున్నారు. ఏ మాత్రం అవకాశమొచ్చినా వారి వారి పార్టీల గురించి గొప్పలు చెబుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా మరణించినట్లు తెలిస్తే చాలు వారి కుటుంబ సభ్యుల కంటే ముందుగానే వారి ఇళ్లకు చేరుకొని అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అక్కడే గడుపుతున్నారు. వివిధ పార్టీల నాయకుల ప్రవర్తనను గమనించే కొందరు ఓటర్లు.. ఎన్నికలు ఎప్పుడూ ఇలాగే వస్తే బాగుండునని భావిస్తున్నారు. -
వేగంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
బీర్కూర్(బాన్సువాడ) : కామారెడ్డి జిల్లాలో వేగంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా 3 వేల ఇళ్లు నిర్మాణంలో ఉండడం ప్రశంసనీయమన్నారు. మండలంలోని బైరాపూర్‌లో నిర్మించిన విఠల్ రుక్మిణి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు, గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఆయన హాజరయ్యారు. ఆయనతోపాటు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ దఫేదర్‌రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాలను దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు, పూజారులకు వేతనాలు చెల్లిస్తోందన్నారు. అలాగే గ్రామంలో నిర్మించిన 40 డబుల్బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కామారెడ్డి జిల్లాలో 5138 ఇండ్లకు టెండర్ పూర్త యి, సుమారు 3 వేల ఇండ్లు నిర్మాణంలో ఉండడం ప్రశంసనీయమన్నారు. ముఖ్యమంత్రి ఆప్యాయంగా లక్ష్మీపుత్రుడు అని పిల్చుకునే వ్యక్తి మీ బాన్సువాడ ముద్దుబిడ్డ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో తాగు, సాగునీటికి కొరత లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాంసాగర్‌కు పూర్వవైభవం వస్తుందన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక భావా లు కలి గిన వ్యక్తి అన్నారు. పండరిపురం తర్వాత అంతటి అద్భుత ఆలయాన్ని బైరాపూర్‌లో నిర్మించిన ఆల య కమిటీకి మంత్రి అభినందనలు తెలిపారు. -
నీటి సమస్య పరిష్కరించాలని రాస్తారోకో
వర్ని(బాన్సువాడ) : రుద్రూర్ మండలంలోని అంగడిబజార్ ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆదివారం రాస్తారోకో చేశారు. గతనెల రోజులుగా కుళాయిలు సరిగా రాక తీవ్ర అవస్థ పడుతున్నామని వారు వాపోయారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ వారు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించే వరకు కదలబోమని మొండికేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని వారిని సముదాయించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో సమస్యను సోమవారం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో స్థానికులు రాస్తారోకో విరమించారు.