కేటీఆర్ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం
సాక్షి, కామారెడ్డి: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం జిల్లాకు రానున్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో అన్ని బల్దియాలపై గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో కేటీఆర్ ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారని తెలిసింది.
అభివృద్ధి ఇలా..
బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పాటైన తరువాత దాదాపు రూ. వంద కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానంగా రోడ్ల వెడల్పు, డ్రెయినేజీల నిర్మాణం, స్టేడియం నిర్మాణం, మినీ ట్యాంక్‌బండ్ పనులతో పాటు మరికొన్ని పనులు చేపట్టారు. రూ. 37 కోట్లతో బాన్సువాడ పట్టణంలోని శ్మశాన వాటిక నుంచి బస్సు డిపో వరకు సుమారు 3 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసల సీసీ రోడ్డుగా మార్చారు. ఫుట్‌పాత్‌తోపాటు డ్రెయినేజీలు నిర్మించారు. రహదారి మధ్యలో డివైడర్లు, హైమాస్ట్ లైట్లను బిగించారు. రూ. 2.40 కోట్లతో పట్టణంలోని కమ్యూనిటీ హాల్ వద్ద మినీ స్టేడియం నిర్మించారు. మినీ స్టేడియం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. రూ. 7.80 కోట్లతో కల్కి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దారు. రూ. 25 కోట్లతో పట్టణంలోని వివిధ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా కాలనీల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. పట్టణంలో చెత్తాచెదారాన్ని తరలించేందుకు ఆటోలు, ట్రాక్టర్లను మంజూరు చేశారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలను తెప్పించారు. మరికొన్ని అభివృద్ధి పనులూ చేపట్టారు. ఆయా పనులకు మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
కేటీఆర్ పర్యటన వివరాలు..
మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం 10 గంట లకు హెలికాప్టర్ ద్వారా బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. ఆయన వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉంటారు. మంత్రులు పట్టణంలో పర్యటిస్తారు. ప్రధాన రహదారితో పాటు డ్రెయినేజీలు, సీసీ రోడ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియంలను ప్రారంభిస్తారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు మంత్రి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఏర్పాట్లు పూర్తి
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment