ఆ పాఠశాలకు వెళితే చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పరిశుభ్రమైన పరిసరాలు, క్రమశిక్షణ గల విద్యార్థులు, నిత్యం పాఠశాల ప్రార్థనలో నేటిప్రశ్న, మంచిమాటతో తరగతులు ప్రారంభమవుతాయి. ఇవే కాదు ఈ పాఠశాలలో మరెన్నో విశేషాలు ఉన్నాయి. బడిలోని బోర్డుపై ప్రతి రోజు ఒక బంగారు మాట కనబడుతుంది. పాఠశాల గోడలపై రంగు రంగుల బొమ్మలు కనిపిస్తాయి. వరండాలో నిజాయితీపెట్టె, ప్రథమచికిత్స బాక్సు, పోస్టు డబ్బాలు ఏర్పాటు చేశారు. ఇలా పాఠశాలలో అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తోంది కోటగిరి మండలంలోని కొడిచర్ల ప్రభుత్వ పాఠశాల. ఈ బడి అభివృద్ధికి హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు.
కోటగిరి (బాన్సువాడ): మండలంలోని కొడిచర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు గాను వందమంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతినిత్యం విద్యార్థులు స్కూలు యూనిఫాంలోనే బడికి వస్తుంటారు. మంచి క్రమశిక్షణతో చదువుకోవడం, ఉపాధ్యాయులు తరగతి గదుల్లో లేనప్పుడు కూడా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా బోధన చేయడం జరుగుతుంది. విద్యార్థులకు త్వరగా అర్థమయ్యేలా పాఠశాలలో తరగతి గదుల గోడలపై జంతువులు, తెలుగు భాషా పదాలు, ఆంగ్ల భాషా పదాలు పేయింటింగ్ వేయించారు. అలాగే వరండాలో నిజాయితీపెట్టె, ప్రథమచికిత్స బాక్సు, పోస్టు డబ్బాలు ఏర్పాటు చేశారు. ఇలా పాఠశాల అభివృద్ధి కమిటీతో పాటు యువకులు, గ్రామస్థులు పాఠశాల అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉంటారు.
పాఠశాలలో విద్యార్థుల కమిటీలు
పాఠశాలలో విద్యార్థులతో కేబినెట్ ఏర్పాటు చేశారు. విద్యార్థులే ప్రధానమంత్రి, విద్యాశాఖామంత్రి, ఆరోగ్యశాఖామంత్రిలా ఉంటారు. విద్యాశాఖామంత్రి విద్యార్థులు క్లాసులు, వారి చదువులను గూర్చి వాకబు చేస్తారు. ఆరోగ్యశాఖ మంత్రి విద్యార్థుల ఆరోగ్యం గురించి ప్రతినిత్యం పర్యవేక్షిస్తారు. ఎవరైనా జబ్బు పడితే వారికి మాత్రలు వేస్తారు. పర్యావరణ శాఖ మంత్రి మొక్కల పెంపకంపై శ్రద్ధ కనబరుస్తారు.
నరేందర్‌కుమార్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
పాఠశాల అభివృద్ధికి, క్రమశిక్షణకు మారుపేరైన హెచ్‌ఎం నరేందర్‌కుమార్‌కు ఎన్నో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కాయి. 2010లో మద్నూర్ మండలం తడ్గూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఆయనకు మొదటి సారిగా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు వచ్చింది. అలాగే 2015 జూన్ తెలగాణ ఆవిర్భావ సందర్భంగా కూడా ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నాడు. 2017లో కోటగిరి మండలం కొడిచర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తుండగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. అనంతరం లయన్స్‌క్లబ్ ఆఫ్ కోటగిరి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి
పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాఠశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నారు. విద్యార్థులకు మంచి బోధనతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పాటుపడుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల హెచ్‌ఎం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణంతా పచ్చని చెట్లతో ఆందంగా కనబడుతున్నాయి. పాఠశాలలో చెత్తను ఎక్కడపడితే అక్కడ పాడేయకుండా ప్రతి తరగతి గదికి చెత్తబుట్టలు ఏర్పాటు చేశారు. అలాగే మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతారు. ఇవే కాకుండా విద్యార్థులతో బాలసంఘాలు ఏర్పాటు చేశారు. కూడా విద్యార్థులు మధ్యాహ్న భోజనం సక్రమంగా భోజనం చేసేందుకు భోజన కమిటీ పర్యవేక్షిస్తోంది.
అందరి సహకారంతో అభివృద్ధి
పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు పాఠశాల యాజమాన్య కమిటీ, సర్పంచ్, యువకులు అందరి సహకారం ఉంది. గ్రామంలో ఒక్క డ్రాపౌట్ లేదు. ఒక్క బాలకార్మికుడు కనబడడు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషిచేస్తారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వస్తారు. పాఠశాలకు ఏది కావాలంటే అది సమకూరుస్తారు.
–నరేందర్‌కుమార్, పాఠశాల హెచ్‌ఎం, కొడిచర్ల యూపీఎస్
హెచ్‌ఎం, ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
మా గ్రామంలోని పాఠశాల అభివృద్ధి పథంలో సాగేందుకు హెచ్‌ఎం, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎంతో ఉంది. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి విద్యాబోధన అందుతున్నాయి. ప్రతియేటా పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటాం. పాఠశాల అభివృద్ధిలో గ్రామ యువకుల పాత్ర కూడా ఉంది. మా పాఠశాల మండలానికే ఆదర్శం కావాలి.
–ఇర్వంత్, సర్పంచ్, కొడిచర్ల
Comments
Please login to add a commentAdd a comment