సరస్వతీ నమఃస్తుభ్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిన్నటి వరకు ఇల్లు పీకి పందిరేసి సందడి చేసిన చిచ్చర పిడుగులు నేటి నుంచి ‘బుద్ధి’మంతులై బడికి బాట పట్టబోతున్నారు. అయితే గత ఏడాది ఏ సమస్యలైతే ఉన్నాయో..! అవే సమస్యల మధ్యే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు చదువు సాగించబోతున్నారు. వానొస్తే తడిపేసే శిథిలమైన తరగతి గదుల్లోనే అక్షరాలు దిద్దబోతున్నారు.
110 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు జిల్లాలో 1,793 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలుండగా, ప్రాథమిక పాఠశాలలో 2,87,072 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,33,606 మంది, ఉన్నత పాఠశాలలో 99,397 మంది విద్యార్థులు విద్యాభాసం చేస్తున్నారు. విద్యా శాఖ అధికారుల నివేదికల ప్రకారం కనీసం 10 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న పాఠశాలలు దాదాపు 140 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కుగా గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో 53 తెలుగు మీడియం పాఠశాలల్లో, 57 ఉర్దూ మీడియం పాఠశాలల్లో అసలు ఉపాధ్యాయులు లేరు. వాటిలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది.
తాగునీరు అసలు సమస్య
ఇక జిల్లాలోని 200 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేదని అధికారులే తేల్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు నీళ్లు తాగాలంటే సమీపంలోని వ్యవసాయ బావుల వద్దకో లేక కుంటల వద్దకో వెళ్లాల్సిన దుస్థితి నెలకొని ఉంది. దాదాపు 250 పాఠశాలల్లో మరుగుదొడ్డి సౌకర్యం లేదు. కొన్ని పాఠశాలల్లో 500 మంది విద్యార్థులకు కలిపి ఒకే ఒక మరుగుదొడ్డి ఉంది. దీంతో అంతమంది విద్యార్థులు ఒకే మరుగుదొడ్డి ఉపయోగించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆడపిల్లలైతే పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాతే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది.
వసతుల కొరత
జిల్లాలో 866 ఉన్నత పాఠశాలలు ఉండగా..వాటిలో 275 పాఠశాలల్లో అదనపు గదులు అవసరం ఉన్నాయి. మరికొన్ని చోట్ల నల్ల బల్లలు, బెంచీలు లేవు. చాలా పాఠశాలల్లో చెట్ల కిందనే చదువులు కొనసాగుతున్నాయి. ఏళ్లుగా ఈ సమస్యలు వెంటాడుతున్నా, అధికారులు మాత్రం వీటిని సమకూర్చలేక పోతున్నారు. ఇక జిల్లాలో 65 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ బడుల్లో 1 నుంచి 5 తరగతుల వరకు సుమారు 50 నుంచి 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏక కాలంలో ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు బోధించడం కత్తిమీద సాముగా మారింది.
యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీ లేనట్టే
నిబంధనల ప్రకారం పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వీటి పంపిణీకి నెల రోజులు పట్టే అవకాశం ఉంది. చిన్నారులకు అందజేయాల్సిన యూనిఫాంలు ఇంతవరకు జిల్లాకే రాలేదు. ఇక పాఠ్యపుస్తకాలు 30 శాతం కూడా వచ్చినట్లు లేదు. ఈ ఏడాది పదవ తరగతి సిలబస్ మార్చారు. దాని మీద ఉపాధ్యాయులకు సైతంశిక్షణ ఇవ్వలేదు.
జయ జయహే తెలంగాణ జనీనీ జయకేతనం
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యంలో విద్యార్థుల ప్రార్థనా సమయంలో ఆలపించే గీతాల్లో మార్పు రానుంది. ఇప్పటి వరకు ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ’అని ఆలపించిన విద్యార్థులు ఇక నుంచి అందేశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం... ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం...పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ...జైజై తెలంగాణ’ అనే గీతాన్ని ఆలపించనున్నారు.