
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 119 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 1,821 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 23తో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి 42 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. అతి తక్కువగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఆరుగురు అభ్యర్థులే పోటీలో నిలిచారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో అత్యధికంగా అభ్యర్థులు రేస్‌లో నిలవగా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లో అతి తక్కువగా అభ్యర్థులు పోటీపడుతున్నారు.
మల్కాజ్‌గిరి తర్వాత ఉప్పల్, ఎల్‌బీనగర్‌లో 35 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. నగరం బయట అత్యధికంగా మిర్యాలగూడలో 29 మంది, సూర్యపేటలో 25 మంది ఈ ఎన్నికల బరిలో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. బాన్సువాడ తర్వాత అతి తక్కువగా జుక్కల్, బోత్ నియోజకవర్గాల్లో ఏడుగురు.. ఎల్లారెడ్డి, నిర్మల్‌ల్లో 8 మంది పోటీపడుతున్నారు. ఇక అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి 119 మంది బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి 99, బీజేపీ 118, సీపీఐ 3, టీడీపీ 13, ఎంఐఎం 8, సీపీఐ(ఎం) 26, బీఎస్పీ 107, ఎన్నికల కమిషన్‌చే గుర్తింపు పొందిన ఆయా పార్టీల నుంచి 515, స్వతంత్ర్య అభ్యర్థులుగా 1306 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతుండగా..ఫలితాలు 11న వెలువడనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment