సాక్షి, బాన్సువాడ: కన్న తండ్రే ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. మద్యానికి బానిసై, విచక్షణ మరచి ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి దారుణంగా చంపాడు. ముగ్గురు పిల్లలు తుదిశ్వాస విడిచాక తీరిగ్గా ఇంటికి వెళ్లాడు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి సమీపంలోని దాస్‌నగర్‌కు చెందిన ఫయాజ్ 2009లో బాన్సువాడ పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో నివసించే నీలోఫర్‌ను వివాహం చేసుకున్నాడు. ఫయాజ్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో ఇల్లరికం వచ్చి బాన్సువాడలో స్థిరపడ్డాడు. వీరికి వరుసగా ముగ్గురు కూతుళ్లు పుట్టారు. నాలుగో కాన్పులో ఒక బాబు, పాప జన్మించారు.
చిన్న కూతురును రూ.50 వేలు తీసుకుని బంధువులకు దత్తత ఇచ్చాడు. సెంట్రింగ్ పనిచేసే ఫయాజ్ తాగుడు, జూదానికి బానిస కావడంతోఅతడిని ఇటీవల ఎవరూ పనిలోకి తీసుకోవడం లేదు. దీంతో భార్య నీలోఫర్ బట్టలు కుడుతూ, మహిళా సంఘం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఫయాజ్ డబ్బుల కోసం భార్యను రోజూ వేధిస్తుండేవాడు. గురువారం రాత్రి బాగాతాగి వచ్చి డబ్బుల కోసం భార్యను తీవ్రంగా కొట్టాడు. అదే సమయంలో పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులకు తన భర్త గురించి నీలోఫర్ ఫిర్యాదు చేసింది. దీనిని మనసులో పెట్టుకున్న ఫయాజ్.. శుక్రవారం ఉదయం సైతం ఆమెను తీవ్రంగా కొట్టాడు.
అనంతరం అతను ముగ్గురు కూతుళ్లు, కుమారుడిని తీసుకుని బయటకు వెళ్లాడు. సమీపంలోని దర్గాలో కందూరు చేస్తున్నారని, అక్కడికెళ్లి అన్నం తిందామని చెప్పి వారిని తాడ్కోల్ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అయితే నాలుగేళ్ల కుమారుడు రైస్ మధ్యలోనే ఇంటికి వెళ్లాడు. దీంతో ముగ్గురు కూతుళ్లను చెరువు వద్దకు తీసుకెళ్లిన ఫయాజ్.. ఒక్కొక్కరిని బలవంతంగా నీటిలో ముంచాడు. ఆఫియా బేగం(10), మహీన్ బేగం (8), జోయా (6)లను నీటిలో బలవంతంగా ముంచి, వారిపై కూర్చున్నాడు. ఊపిరి ఆడక వారు చనిపోవడంతో ఇంటికి వెళ్లాడు. తడి బట్టలతో వచ్చిన భర్తను చూసిన నీలోఫర్.. కూతుళ్లు ఎక్కడని అడిగింది.
వారు దర్గా వద్ద అన్నం తింటున్నారని చెప్పి, అక్కడినుంచి కల్లు దుకాణానికి వెళ్లి కల్లు తాగాడు. భర్తపై అనుమానం వచ్చిన నీలోఫర్ చెరువు వద్దకు వెళ్లింది. అక్కడ కూతుళ్ల చెప్పులను చూసి స్థానికులకు విషయం చెప్పింది. స్థానికులు చెరువులో గాలించగా పిల్లల మృతదేహాలు దొరికాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కల్లు దుకాణంలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ దామోదర్‌రెడ్డి, సీఐ మహేశ్‌గౌడ్‌లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
బంధువుల ఆందోళన..
నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ మృతుల తల్లి నీలోఫర్, బంధువులు, డ్రైవర్స్ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తన కళ్లముందే భర్తను ఉరితీయాలని నీలోఫర్ డిమాండ్ చేసింది. డీఎస్పీ వారికి నచ్చజెప్పి పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment