బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డునే కీలకంగా భావించి, దీని ఆధారంగానే ఈనెల 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే చేపడుతుండడంతో ఇప్పటి వరకూ ఆధార్ కార్డును పొందని వారు మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఆధార్ నమోదు కేంద్రాలను ప్రభుత్వం నిర్వహించకుండా ఎంపిక చేసిన మీ సేవ కేంద్రాలకు అప్పగించడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రస్తుత రోజుల్లో అన్నింటికీ ‘ఆధార్’ ఆధారమైంది. చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర సరుకుల నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత పింఛన్లు, పీఎఫ్, బీమా సౌకర్యం, విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రాలకు ఇలా రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా ఏదైనా ప్రభుత్వ లావాదేవీలకు ఆధార్ కార్డు, అందులో పొందుపర్చే ఆధార్ నెంబర్ అత్యంత ప్రాముఖ్యమైంది. కుల, మత, ధనిక, పేద వర్గం భేదం లేకుండా అందరూ ఈ కార్డుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆధార్ కార్డు ప్రాధాన్యత పెరగడంతో ఈ కార్డును పొందేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో మీ సేవ ఆధార్ కేంద్రాల వద్ద జనం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక్కో కేంద్రానికి 3,4 మండలాలు
జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లోనే ప్రస్తుతం ఆధార్ కార్డు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క కేంద్రం ద్వారా 3,4 మండలాల ప్రజలకు సేవలందిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డుల కోసం ప్రజలు తిప్పలు పడాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలంలో మీసేవకు ఆధార్ నమోదు కేంద్రం ఇచ్చినప్పటికీ, దీని కోసం ప్రత్యేకంగా ఐరిష్ కెమెరాలు, వేలిముద్రల సేకరణ పరికరాలు, కంప్యూటర్లు అవసరముండడంతో పలువురు మీసేవ నిర్వాహకులు వీటిని తీసుకోవడం లేదు. దీంతో పక్క మండలాలకు ప్రజలు వెళ్ళాల్సి వస్తోంది.
జనాభా ప్రాతిపదికన కేంద్రాలను ఏర్పాటు చేయకుండా, ఒకటీ రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల రద్దీ బాగా పెరిగిపోతోంది. సుమారు 40వేల జనాభా గల బాన్సువాడ పట్టణంలో కేవలం ఒకే మీ సేవ కేంద్రంలో ఆధార్ కార్డు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో రెండు కంప్యూటర్ల ద్వారా ప్రతి రోజు సుమారు 60 మంది వివరాలను నమోదు చేస్తున్నారు. దీనికి తోడు నిజాంసాగర్, పిట్లం, బీర్కూర్, బిచ్కుంద తదితర మండలాలకు చెందిన ప్రజలు సైతం వస్తున్నారు. ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేస్తామని ప్రభుత్వం ప్రకటించినందునే ప్రస్తుతం ఆధార్ కార్డు నమోదు కేంద్రానికి డిమాండ్ పెరిగింది.
‘ఆధార్’తో అన్నీ అవస్థలే !
Published Sun, Aug 10 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement