
‘సాక్షి’లో ప్రచురితమైన ‘యూఎన్‌ఓ గుర్తింపు వార్త’ను చూపుతున్న మంత్రి పోచారం
సాక్షి,బాన్సువాడ: రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంట్‌ను 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామని చెప్పారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించామని అన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం భారీగా గోదాములు నిర్మించామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమాతో ధీమా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందని పోచారం అన్నారు. తమ వెనక ప్రభుత్వం ఉంది అనే బలం వచ్చిందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు.