
ఆడ్డబిడ్డ భారమైంది
బాన్సువాడ: పోషణ భారమవుతుందని భావించి.. కన్నులు తెరిచి లోకాన్ని చూడకముందే పసిబిడ్డను వదిలేశారు.. మండుటెండలో వదిలివెళ్లిపోవడంతో బిడ్డ ఎండకు విలవిల్లాడింది. పసికూన ఆర్థనాదాలను విన్న స్థానిక మహిళా కూలీలు పరిగెత్తుకుని వచ్చారు. పాపను తీసుకుని వెళ్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌కు అందించగా, ఆమె అంగన్‌వాడీ సిబ్బంది, పోలీసులకు అప‍్పగించడంతో వారు ఆస్పత్రికి తరలించారు.. ఈ సంఘటన సోమవారం బాన్సువాడ మండలం కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వారు మహిళ కొయ్యగుట్ట గురుకుల పాఠశాల ఆవరణలో ఒకరోజు పసిగుడ్డును వదిలేశారు.
పక్కనే భవన నిర్మాణ పనులు సాగుతుండగా, అందులో పనిచేస్తున్న కూలీలు ఆ బిడ్డ ఆర్తనాదాలు విని అక్కడికి వచ్చారు. సుమారు గంట నుంచి ఎండలో ఉన్న ఆ పాపను చూసిన అక్కడి మహిళా కూలీల హృదయాలు చలించిపోయాయి. వెంటనే ఆ పాపను తీసుకొని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి వద్దకు వెళ్లారు. ఆమె పోలీసులకు, అంగన్‌వాడీ సిబ్బందికి సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా సహాయంతో ఆ పసిపాపను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్న పిల్లల వైద్య నిపుణుడు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ వెంటనే స్పందించి పాపను ఎన్‌ఐసీయూకి తరలించి చికిత్సలు అందించారు. ఎండ వేడిమి కారణంగా పాప ప్రమాదకరస్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం అందించి పాపను కాపాడారు. ప్రస్తుతం ఆ పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఆడపిల్ల కావడంతోనే..
కొయ్యగుట్ట ప్రాంతంలో నిరుపేద ప్రజలు నివసిస్తారు. ఇక్కడ దినసరి కూలీలుగా పని చేసే వారే అధికంగా ఉన్నారు. ఆ ప్రాంతానికి చెందిన వారిలోనే ఎవరో గుర్తు తెలియని మహిళకు ఆడపిల్ల పుట్టడంతో ఒకరోజు తన వద్ద ఉంచుకొని, ఆడపిల్లను పెంచి పోషించి పెళ్లి చేయడం ఇబ్బందికరమని భావించి వదిలి వెళ్లిపోయినట్లు ఆ ప్రాంత వాసులు చర్చించుకుంటున్నారు. పాపను పాఠశాల ఆవరణలో వదలడంతో ఎవరైనా చూసి, ఆ పాపను పెంచుకుంటారనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
మండుటెండలో వదిలేశారు
- శోభారాణి, ప్రిన్సిపాల్
పాపను మండుటెండలో మా పాఠశాల ఆవరణలో వదిలేసి వెళ్లారు. పాప అరుపులు విని కూలీలు పాపను తీసుకొని నా వద్దకు వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించా. పోలీసులు, అంగన్‌వాడీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
పాప కోలుకుంటోంది
- డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, సూపరింటెండెంట్
అరగంట ఆలస్యమైతే పాప బతికేది కాదు. పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది సకాలంలో పాపను ఆస్పత్రికి తీసుకువచ్చారు. పాపకు మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటోంది. మండుటెండలో పాప పూర్తిగా నీరసించింది. ఒక రోజు వయస్సు ఉంటుంది. 1.8 కిలో గ్రాముల బరువు ఉంది. పాప కోలుకున్న తర్వాత స్టేట్ హోంకు తరలిస్తాం.