రెబ్బెన (కరీంనగర్) : భానుడి భగభగలకు ఓ వృద్ధుడు బలైన సంఘటన గురువారం కరీంనగర్ జిల్లా రెబ్బెన మండలంలో చోటుచేసుకుంది. గోలేటి పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన గొలుసుల సాయిలు(67) గోలేటిలోని భీమన్న గుడి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో రాళ్లు కొట్టేందుకు వెళ్లాడు. ఎండ తీవత్ర అధికంగా ఉండటంతో పని ప్రదేశంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు.
పక్కనే రాళ్లు కొడుతున్న సమ్మయ్య అనే వ్యక్తి.. సాయిలు పరిస్థితిని గమనించి వెంట తెచ్చుకున్న నీళ్లు తాగించాడు. దీంతో వాంతులు చేసుకున్న సాయిలు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే సమ్మయ్య ఇంటికి చేరుకుని పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలుపటంతో పని ప్రదేశానికి వెళ్లే చూసేసరికి సాయిలు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఆటోలో ఇంటికి తరలించారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.