పెద్దపప్పూరు(తాడిపత్రి) : వడదెబ్బ మరణాలు ఆగడం లేదు. వాటికి కొనసాగింపుగా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం మరో ఐదుగురు మృతి చెందారు. ఈ పరిణామం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో కంబగిరి రాముడు(43) వడదెబ్బతో మృతి చెందారు. వ్యక్తిగత పనులపై అనంతపురం వెళ్లిన ఆయన సాయంత్రం ఇంటికొచ్చే సరికే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే జ్వరంతో పాటు వాంతులయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అగళి మండలంలో...
అగళి: మండలంలోని హళ్లికెరలో చంద్రశేఖర్‌శర్మ(55) వడదెబ్బకు గురై గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వ్యవసాయ బోరు వద్ద నుంచి తాగునీరు తెచ్చేందుకు వెళ్లిన ఆయన ఎండతాపానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇంటికి తరలించే సరికే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
శింగనమల మండలంలో...
శింగనమల : మండలంలోని చీలేపల్లిలో సోమసుందరయ్య(58) అనే ఉపాధి కూలీ వడదెబ్బతో మృతి చెందారు. గురువారం ఉదయమే ఉపాధి పనులకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఇంటికి రాగానే అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు సలకంచెరువులోని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ జయరాములు, టెక్నికల్ అసిస్టెంట్ నారాయణస్వామి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
బత్తలపల్లి మండలంలో...
బత్తలపల్లి(ధర్మవరం) : బత్తలపల్లి మండలం కోడేకండ్లలో వడ్డె వెంకటరాముడు(56) వడదెబ్బతో గురువారం మరణించినట్లు బంధువులు తెలిపారు. గ్రామ సమీపంలోని రాతిగుట్టలోకి రాళ్ల కొట్టేందుకు కూలీ పనులకు బుధవారం వెళ్లిన ఆయన రాత్రి ఇంటికి చేరుకున్నట్లు వివరించారు. తీవ్ర అస్వస్థతతో రాత్రి భోజనం కూడా చేయకనే పడుకున్నట్లు చెప్పారు. తెల్లవారుజామున ఉలుకు, పలుకు లేకపోవడంతో నిద్ర లేపేందుకు కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించగా ఫలితం లేదన్నారు. మృతునికి భార్య నారాయణమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలియగానే వైద్యాధికారి లోక్‌నాథ్, సీహెచ్‌ఓ లింగమూర్తి, హెల్త్ సూపర్‌వైజర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఆరోగ్య సిబ్బంది రామాంజులరెడ్డి, అరుణమ్మ, వీఆర్‌ఓ నరసింహమూర్తి, వీఆర్‌ఏ రాముడు గ్రామానికి చేరుకునఆనరు. మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు.
కూడేరు మండలంలో...
కూడేరు(ఉరవకొండ) : కూడేరు మండలం రామచంద్రాపురంలో దళిత రాముడు(65) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బ్రాహ్మణపల్లిలోని చౌక «ధాన్యపు డిపోలో నిత్యావసర సరుకులు తెచ్చేందుకు వెళ్లిన ఆయన ఎండకు నీరసించి కిందపడి మృతి చెందినట్లు భార్య సంగమ్మ, ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందిన వెంటనే పీహెచ్‌సీ వైద్యాధికారి తస్లీమ్ బేగం, తహశీల్దార్ వసంతలత తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
ఊపిరితీస్తున్న వడదెబ్బ
Published Thu, May 4 2017 11:41 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement