మృత్యుఘంటికలు మోగిస్తున్న వడగాడ్పులు
మృత్యుఘంటికలు మోగిస్తున్న వడగాడ్పులు
Published Sat, May 20 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM
వడగాడ్పులు జిల్లాలో మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. వడదెబ్బకు గురై మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎండలో బయటకు వచ్చిన వ్యక్తులను వేడిగాలులు కబళిస్తున్నాయి. శుక్రవారం కూడా జిల్లాలో ఎనిమిది మంది వడదెబ్బకు గురై మృతిచెందారు. వారివారి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆ వివరాలు ఇలా..
నరసాపురం రూరల్ : నరసాపురం మండలంలో కొప్పర్రుకు చెందిన పోలిశెట్టి నరసింహరావు(చంటి)(70) శుక్రవారం మధ్యాహ్నం వడదెబ్బకు గురై ఇంటి వద్దనే మృతి చెందాడు. ఈయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీఆర్‌వో, పంచాయితీ సిబ్బందికి సమాచారం ఇచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
పెదమైనవానిలంకలో..
విపరీతమైన వేడి గాలులకు తట్టుకోలేక మండలంలో శివారుప్రాంత గ్రామమైన పెదమైనవాని లంకకు చెందిన పొన్నమండ మహాలక్షి్మ(60) గురువారం మృతి చెందినట్టు సర్పంచ్ తెలిపారు. మృతురాలికి భర్త లక్ష్మణస్వామి, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
తూర్పుతాళ్లులో..
తూర్పుతాళ్లు గ్రామం నెహ్రూ నగర్‌కు చెందిన అడ్డాల వెంకాయమ్మ(56) గురువారం ఆకస్మికంగా మృతి చెందింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఒకేరీతిన వేడిగాలులు వీస్తుండడంతో ఉక్కపోతకు తాళలేక ఆమె మరణించినట్టు భర్త పుల్లారావు తెలిపారు. విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేశామన్నారు.
గెయిల్ కార్మికుడు మృతి
పాలకొల్లు అర్బ¯ŒS : మండలంలోని ఉల్లంపర్రుకి చెందిన రెడ్డి అప్పారావు (53) వీరవాసరం గెయిల్ పైపులైన్ వద్ద కాపలాగా పనిచేస్తున్నాడు. శుక్రవారం విధులు ముగించుకుని తిరిగి స్వస్థలం ఉల్లంపర్రు వస్తుండగా విపరీతంగా వీచిన వడగాడ్పులకు గురయ్యాడు. రోడ్డు పక్కన పడిపోయి మృతిచెందాడు. అతని సైకిల్ కొబ్బరిచెట్టుకి జారేసి ఉంది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అప్పారావు మృతదేహాన్ని తహసీల్దార్ దాసి రాజు పరిశీలించారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
తణుకు : వడదెబ్బ కారణంగా గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం తణుకులో మృతి చెందాడు. సుమారు 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద గురువారం ఆపస్మారకస్థితికి చేరాడు. స్థానికులు బా«ధితుడ్ని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శక్రవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పంచాయతీ కార్మికుడి మృతి
గణపవరం (నిడమర్రు) : గణపవరం మండలం జల్లి కాకినాడ గ్రామంలో వడదెబ్బకు తాళలేక మేడిపల్లి సుబ్బారావు (45)అనే వ్యక్తి మృతి చెందాడు. విపరీతంగా కాస్తున్న ఎండలు, వీస్తున్న వడగాలులు తట్టుకోలేక గురువారం ఆస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. మృతుడు సుబ్బారావు స్థానిక గ్రామపంచాయతీలో ప్రైవేటు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
పాత్రికేయుడికి మాతృవియోగం
జంగారెడ్డిగూడెం : సీనియర్ పాత్రికేయులు లంక నాగకుమార్ నాగకుమార్ మాతృమూర్తి లంకా వరలక్షి్మ(62) బుట్టాయగూడెంలో నివశిస్తున్నారు. శుక్రవారం నాగకుమార్ కొడుకు మనోహర్ వరలక్షి్మని మోటార్‌సైకిల్‌పై జంగారెడ్డిగూడెం తీసుకువస్తుండగా వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈమె భర్త రామకృష్ణయ్య స్వగ్రామం కైకరానికి వరలక్ష్మి మృతదేహాన్ని తరలించారు. శనివారం కొవ్వూరు గోదావరితీరంలో వరలక్ష్మి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈమె మృతిపై జర్నలిస్టుల అసోసియేషన్లు సంతాపం వ్యక్తం చేశాయి.
ఏలూరు పాత బస్టాండ్‌లో..
ఏలూరు అర్బన్ : స్థానిక పాత బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఏలూరు టూ టౌన్ పోలీసులు గుర్తించారు. ఎస్సై ఎస్‌ఎస్‌ఆర్ గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా.. ఆర్టీసీ సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఎస్సై అక్కడికి చేరుకుని దర్యాప్తు చేయగా మృతుడు వారం రోజులుగా బస్టాండ్‌లో యాచన చేసుకుంటున్నాడని తెలిసింది. వడదెబ్బకు గురై మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement