రాలిపోతున్నారు.. | People Are Dying With Sun Stroke In Telangana | Sakshi
Sakshi News home page

రాలిపోతున్నారు..

Published Thu, Apr 18 2019 10:06 AM | Last Updated on Thu, Apr 18 2019 10:06 AM

People Are Dying With Sun Stroke In Telangana - Sakshi

చుంచుపల్లి: వడదెబ్బ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది. ప్రతి రోజూ ఒకరిద్దరు చొప్పున మృత్యువాత పడుతున్నారు. గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వృద్ధులు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. సకాలంలో వైద్యం అందక దుర్మరణం పాలవుతున్నారు. ఈనెల 5వ తేదీ వరకు 37 – 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా ప్రస్తుతం కొత్తగూడెంలో 42 – 43 డిగ్రీలకు చేరుకుంది. ఎండవేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడు ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఇంకెలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్‌ మొదటి వారంలో కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామానికి చెందిన వట్టం చిన్నక్క (80 ) వడదెబ్బతో మృతి చెందింది. బూర్గంపాడు మండలం సోంపల్లికి చెందిన బి. పెంటయ్య (52) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈనెల 10 నుంచి 17 వరకు వడదెబ్బతో 10 మంది మృతి చెందారు. 10వ తేదీ ఒక్కరోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు.

అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన నానిపల్లి నాగమ్మ (35),  పాల్వంచలోని శ్రీనివాస్‌ కాలనీ గట్టు సమీపానికి చెందిన తాటి సుధాకర్‌ (22), కోక్యాతండాకు చెందిన  హలావత్‌ భిక్షం (50) వడదెబ్బ బారినపడి మృతిచెందారు. 12వ తేదీన కూసుమంచి మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన పెరుగు లక్ష్మమ్మ (65), 13న తల్లాడ మండలం అన్నారుగూడేనికి చెందిన  దాసరి నరసింహారావు (36), 14న తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన దామల్ల నాగయ్య (47), 15న అశ్వాపురం మండలం జగ్గారం క్రాస్‌ రోడ్డుకు చెందిన రిటైర్డ్‌ సింగరేణి కార్మికుడు తరాల నాగేశ్వరరావు (55), అదేరోజు గొందిగూడెం కొత్తూరుకు చెందిన రైతు బండ్ల నరసింహారావు(45),  16వ తేదీన ములకలపల్లి మండలం సత్యంపేట గ్రామానికి చెందిన రైతు పూనెం కృష్ణ (54), కొణిజర్ల మండలం మల్లపల్లి గ్రామానికి చెందిన భూక్య మంగ్లి (80), 17న చుంచుపల్లి మండలం పెనుబల్లికి చెందిన దంసలపూడి వెంకటేశ్వర్లు(35) ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏప్రిల్‌ చివరి వారంలో ఎండల తీవ్రత మరింత పెరిగి 50 డిగ్రీల వరకు చేరుతాయని  బెంబేలెత్తుతున్నారు.  

చిన్నారులు, వృద్ధులకు జాగ్రత్తలు తప్పనిసరి..
70 ఏళ్లు పైబడిన వారు, చిన్న పిల్లలు ఉన్న వారు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజు మూడు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగాలని, నీటిలో నిమ్మకాయ రసం, ఉప్పు లేదా పంచదార కలిపి తాగితే ఉపశమనం పొందుతారని అంటు న్నారు. తద్వారా కిడ్నీ వ్యాధులు కూడా దరిచేరవని చెపుతున్నారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వడదెబ్బ నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు.  

అవగాహన చర్యలు శూన్యం..
జిల్లాలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గత 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నా కానీ ఎక్కడా రక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో వడదెబ్బ విషయంలో ప్రజలకు అవగాహన లేక మృత్యువాత పడుతున్నారు. వడదెబ్బకు ప్రజలు గురికాకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాక వైద్యులతో అవగాహన సదస్సులు నిర్వహించాలి. గత  ఏడాది వేసవిలో జిల్లాలో వడదెబ్బ బారినపడి సుమారు 60 మంది చనిపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వడదెబ్బ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.  దీనిపై కలెక్టర్‌ కార్యాలయ ఏఓ నాగేశ్వరరావును వివరణ కోరగా.. అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారితో సహా అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. తక్షణమే అవగాహన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement