సాక్షి, ఆదిలాబాద్: పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు వడదెబ్బతో కన్నుమూసిన ఘటన .కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్ల బొరీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య యశోదలకు ముగ్గురు కొడుకులు. వీరిలో పెద్ద కుమారుడు తిరుపతి (26). ఇతనికి ఇటీవల మంచిర్యాల జిల్లా భీమిని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయింది.
బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పెళ్లి ముహూర్తం ఉంది. కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే పెళ్లి పనుల్లో నమగ్నమైన తిరుపతి సోమవారం వడదెబ్బకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడుతున్న తిరుపతిని కుటుంబ సభ్యులు కాగజ్‌గనర్ తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న వ్యక్తి ఇలా ఉన్నట్టుండి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తిరుపతి సోదరుడు శ్రీనివాస్ గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతూ అరు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. పెళ్లి కోసం చేసిన ఏర్పాట్ల వద్ద మృతదేహం పెట్టాల్సి రావడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment