గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 48 గంటలు వడగాడ్పుల తీవ్రత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 48 గంటలు వడగాడ్పుల తీవ్రత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని, బుధ, గురువారాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం నగరంలో గరిష్టంగా 40.6 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా వడగాడ్పులు ఉధృతంగా వీచే అవకాశాలున్నాయని తెలిపింది. కాగా, నగరంలో ప్రస్తుతం సాధారణం క ంటే ఐదు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో భూమిపై వాతావరణం వేడెక్కి వడగాడ్పుల తీవ్రత అధికమవుతోందని వాతావరణ కేంద్రం డెరైక్టర్ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వృద్ధులు, చిన్నారులు, రోగులకు వేసవితాపం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తగినంత నీరు, కొబ్బరినీళ్లు, లస్సీ వంటి శీతల పానీయాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చర్మం, కళ్ల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.