ఎండ ప్రచండం | high temperature will lead to death | Sakshi
Sakshi News home page

ఎండ ప్రచండం

Published Thu, Apr 14 2016 2:46 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

ఎండ ప్రచండం - Sakshi

ఎండ ప్రచండం

నగరంలో 43 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత
ఏప్రిల్‌లో 43 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో నమోదు
 
1973 ఏప్రిల్ 30న నమోదైన 43.3 డిగ్రీలే ఇప్పటిదాకా అత్యధికం
జిల్లాల్లోనూ భగభగలు.. 42 చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత
ఖమ్మం జిల్లా పమ్మిలో గరిష్టంగా 45.78 డిగ్రీలు
ఉదయం 10 గం. దాటితే బయటకు రావాలంటేనే బెంబేలు
మరో 48 గంటల పాటు వడగాడ్పులే: వాతావరణ శాఖ
 
సాక్షి, హైదరాబాద్: భానుడి ‘ఎండ’ప్రచండంతో మహానగరం మండిపోయింది! సూరీడు నడినెత్తిన నిప్పుల వాన కురిపించాడు. గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం ఏకంగా 43 డిగ్రీల రికార్డుస్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. గత 43 ఏళ్లలో ఏప్రిల్‌లో నగరంలో ఇంతటి ఎండ నమోదవడం ఇదే తొలిసారి. 1973 ఏప్రిల్ 30న నగరం 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతను చవిచూసింది. ఇప్పటివరకు ఇదే రికార్డు. ఇన్నేళ్ల తర్వాత బుధవారం మళ్లీ అదే స్థాయి ఉష్ణోగ్రత నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎండలు మండిపోతుండడంతో జనం రోడ్లపైకి రావాలంటేనే బెంబేలె త్తిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగులు, ప్రయాణికులు, వాహనదారులు అల్లాడిపోతున్నారు. 
 
ఆస్పత్రుల్లో వడదెబ్బ కేసులు పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 26.5 డిగ్రీల మేర నమోదవుతుడండంతో ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత కనిపిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో సాధారణం కంటే ఆరు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 48 గంటలపాటు వడగాడ్పులు కొనసాగుతాయని బేగంపేట వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచించింది.
 
మండుతున్న జిల్లాలు
భాగ్యనగరమే కాదు రాష్ట్రంలోని అనేక పట్టణాలు బుధవారం భగ్గుమన్నాయి. నిజామాబాద్, రామగుండంలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం లెక్కల ప్రకారం బుధవారం సాయంత్రానికి నల్లగొండ జిల్లా చండూరులో 45.52 డిగ్రీలు, తెల్దేవరపల్లిలో 45.06, రఘునాథపాలెంలో 45.15, ఖమ్మం జిల్లా పమ్మిలో 45.78 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో దాదాపు అన్నిచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో వడగాడ్పులు వీసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.
 
ఎండలు మరింత పెరిగే ప్రమాదం:వై.కె.రె డ్డి, బేగంపేట వాతావరణ కేంద్రం డెరైక్టర్
 రానున్న 48 గంటల్లో పగటి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర పెరిగే ప్రమాదం ఉంది. ఈ వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలి. మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశాలున్నాయి.
 
ఎండలు ఎన్నడూ చూడలేదు: దేవరాజ్, చిరువ్యాపారి, కుర్మగూడ
 నా చిన్నప్పటి నుంచి ఈ స్థాయి ఎండలు చూడలేదు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు వెళ్లలేక పోతున్నాం. సాయంత్రం 5 గంటలకు కూడా ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. రోహిణి కార్తె రాకముందే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందో?
 
 బయట తిరగలేకపోతున్నాం: మస్కు జాన్సన్,వ్యాపారి
 మధ్యాహ్నం సమయంలో బయటకు వస్తే ఒళ్లు కాలిపోతోంది. ఇంత తీవ్రమైన ఎండలు ఎప్పుడూ లేవు. వాటర్ ట్యాంక్‌లో నీళ్లు సైతం చాలా వేడిగా ఉంటున్నాయి. ఫీల్డ్ వర్క్ ఉద్యోగం చేసే వారి పరిస్థితి ఘోరంగా ఉంది.
 
సీజన్‌లో అత్యధికం: జి.హరీశ్, నాంపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్
 బుధవారం సూర్యుడు భగభగ మండిపోయాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. మా సిబ్బంది ఎండ బారినపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. నాన్-పీక్ అవర్స్‌లో జంక్షన్ల దగ్గరలోనే నీడ ఉన్న చోట ఉండి, ట్రాఫిక్ నిర్వహణ పర్యవేక్షించాల్సిందిగా చెప్పాం. రోజంతా మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశాం. సిబ్బంది వడగాడ్పుల బారినపడకుండా ఉండేలా పర్యవేక్షిస్తున్నాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement