నిప్పుల కొలిమి!
ఆకాశం నిప్పులారబోసుకున్నట్టు, సూరీడు పగబట్టినట్టు ఎండలు మండిపోతు న్నాయి. ఉత్తర, దక్షిణాల తేడా లేకుండా దేశమంతా నిప్పుల కొలిమిని తలపి స్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావడానికి జనం బెంబేలెత్తుతున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి కూడా ఉపశమనం దొరకడం లేదని వాపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలను దాటడం ఎలాగని ఆందోళనపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని 43 ఏళ్లనాటి రికార్డుకు చేరువైంది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరు 50 డిగ్రీల ఉష్ణోగ్రతతో అల్లాడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఈసారి నైరుతీ రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలను మోసుకొస్తాయని చెప్పిన వాతావరణ శాఖ మండే ఎండల పైనా, వీచే వడగాడ్పులపైనా కూడా కొన్ని హెచ్చరికలు చేసింది. ఏప్రిల్ మొదలు కొని జూన్ వరకూ ఎండలు ప్రచండంగా ఉంటాయన్నది. గడప దాటిన ప్రాణాలు పెనం మీది పేలాల్లా మారుతున్నాయి. బయటకెళ్లవలసిన అవసరం రాని అదృష్ట వంతుల మాటేమోగానీ కాయకష్టం చేస్తే తప్ప ఇల్లు గడవని శ్రమజీవులకు మాత్రం నిత్యం యమగండమే!
కుండపోత వర్షాలు, ముంచెత్తే వరదలు, చెండుకు తినే చలిగాలులు, ఠారెత్తించే వడగాడ్పులు ఎవరూ ఆపగలిగేవి కాదు గనుక ఇందులో తమ పాత్ర పరిమిత మేనని పాలకులు భావిస్తున్నట్టున్నారు. నిరుడూ, అంతకు ముందు సంవత్సరమూ ఎండలు మండి, వడగాడ్పులు వీచి దేశవ్యాప్తంగా వేలమంది చనిపోయినా ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందామన్న స్పృహ ఎవరికీ లేకపోయింది. నిరుడు ఆంధ్రప్రదేశ్‌లో వడగాలులవల్ల మృత్యువాత పడినవారి సంఖ్య 1,735 దాటింది. తెలంగాణలో దాదాపు 600మంది మరణించారు.
దేశవ్యాప్తంగా నిరుడు వేసవిలో 2,500మంది చనిపోతే అందులో 2,300మంది ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అంచనా వేసుకోవచ్చు. ఈసారి కూడా ఇంత వరకూ దేశంలో సంభవించిన వడదెబ్బ మరణాల్లో ఈ రెండు రాష్ట్రాలే అగ్రభాగాన ఉన్నాయి. నిజానికి వడగాడ్పులవల్ల చనిపోతున్నవారంతా ఆ కేటగిరిలో జాబితా లకెక్కడం లేదు. పేదరికం, నిరక్షరాస్యత వంటి కారణాలవల్ల చాలామందికి అలా నమోదు చేయించుకోవచ్చునని కూడా తెలియడంలేదు. కనుక లెక్కకురాని మర ణాలు ఇంకా అనేకం ఉండొచ్చు.
వడగాడ్పులు వీచడం, ఎండలు మండిపోవడం ప్రకృతి వైపరీత్యమేనని అంద రూ ఒప్పుకుంటారు. చలిగాలులతో మనిషి గడ్డకట్టుకుపోయే స్థితి ఏర్పడటం కూడా అటువంటిదేనని అందరూ నమ్ముతారు. కానీ ప్రభుత్వాలు ఈ రెండింటిలో చలిగాలుల్ని మాత్రమే ప్రకృతి వైపరీత్యమంటున్నాయి. వాటి కారణంగా మరణిం చేవారి కుటుంబాలకు జాతీయ, రాష్ట్ర విపత్తు నిధుల నుంచి సాయం అందిస్తు న్నాయి. వడగాడ్పులను మాత్రం అతి సాధారణమైన అంశంగా పరిగణిస్తున్నాయి. మరణాల విషయంలో ఏమిటీ వివక్ష? చలిగాలుల తాకిడి ఉత్తరాదికి ఎక్కువగా ఉంటుంది. వడగాడ్పులు దక్షిణాదిలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వాస్తవానికి చలిగాలుల్ని కూడా 2012 వరకూ ప్రకృతి వైపరీత్యంగా కేంద్రం భావించలేదు. అంతకు ముందు వరసగా మూడేళ్లపాటు ఉత్తరాదిలో చలిగాలుల కారణంగా అత్య ధికులు మరణించాక అభిప్రాయం మార్చుకుంది. కనీసం అప్పుడైనా వడగా డ్పులపై అది దృష్టి సారించలేదు. ప్రజా ప్రతినిధుల నుంచి ఎన్నో వినతులు వచ్చాక 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దానిపై మంత్రుల కమిటీని నియ మించింది. ఆ కమిటీ ఏ నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసినట్టుంది. వడగా డ్పులు ప్రకృతి వైపరీత్యాల జాబితాకెక్కలేదు. చలి మరణాలను గుర్తించినట్టుగా వడగాడ్పులే మరణ కారణమని నిర్ధారించే వీలు లేదన్నది కేంద్ర హోంశాఖ అధికారుల వాదన. వారి వాదనల మాటెలా ఉన్నా గత పది పన్నెండేళ్లలోనే వడదెబ్బ మృతుల సంఖ్య 61 శాతం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
ప్రకృతి వైపరీత్యంగా పరిగణిస్తే మృతుల కుటుంబాలకు లక్షన్నర పరిహారం అందుతుంది. అంతేకాదు...జనం ఆ వైపరీత్యం బారిన పడకుండా ప్రభుత్వాల పరంగా తీసుకోవాల్సిన చర్యలు అమల్లోకి వస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ. 50,000 చొప్పున పరిహారం అందుతోంది. అసలు పరిహారం మాట అటుంచి అసలు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జనం ప్రాణాలను రక్షించడం సాధ్యమేనని అహ్మదాబాద్, నాగపూర్, భువనేశ్వర్ వంటి నగరాల్లో రుజువైంది. ఆ నగరాలు గత రెండు మూడే ళ్లుగా వడగాడ్పుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్నాయి. ఆ కార్యాచరణ చాలావరకూ సత్ఫలితాలనిస్తున్నట్టు కనబడు తోంది.
ఉదాహరణకు అంతక్రితం వేసవి సమయాల్లో అహ్మదాబాద్‌లో వడదెబ్బ మరణాలు దాదాపు వందకు చేరువైన సందర్భాలుండగా... రికార్డు స్థాయి ఉష్ణోగ్ర తలున్నా నిరుడు ఆ సంఖ్య 20కి పరిమితమైంది. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కార్యాచరణ రూపొందించి, అవసరమైన ఆర్ధిక వనరులను కల్పిస్తే వడగాడ్పుల మరణాలను నివారించడం అసాధ్యమేమీ కాదని ఆయా నగరాల అనుభవాలు రుజువు చేస్తున్నాయి. గూడు లేనివారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం, ఎండ తీక్షణంగా ఉన్నప్పుడు ఆరుబయట కార్మికులతో పనిచేయించకుండా చూడటం, తాగునీటి సదుపాయం, అత్యవసర చికిత్సా విభా గాల ఏర్పాటు, అవసరమైనచోట్లకు వెనువెంటనే సహాయ బృందాలు వెళ్లడం వం టివి ప్రాణరక్షణలో ఎంతగానో తోడ్పడగలవని ఆ నగర పాలక సంస్థలు నిరూపిం చాయి. ఈ నమూనానే పట్టణ, గ్రామ స్థాయిల్లో కూడా అమలు చేయవచ్చు.
వడగాడ్పుల మరణాలను తగ్గించడంలో రెండు తెలుగు రాష్ట్రాలూ పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించడంలోనే వాటికి పొద్దుగడిచి పోతోంది. నిరుడు డిసెంబర్‌లో ప్రపంచబ్యాంకు వాతావరణ మార్పులపై వెలువ రించిన నివేదిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకించి ప్రస్తావించి ఇతర ప్రకృతి వైపరీ త్యాలతోపాటు ఎండల తీవ్రత కారణంగా సంభవిస్తున్న మరణాలను వివరిం చింది. ముందు జాగ్రత్తలను సూచించింది. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వాలు మేల్కొని అవసరమైన చర్యలు తీసుకోవాలి.