
న్యూఢిల్లీ: దేశంలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్-ఒడిశా తదితర రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత(Maximum temperature) 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదవుతోంది. ఢిల్లీలో పెరుగుతున్న వేడి, బలమైన గాలుల కారణంగా గాలి నాణ్యత మెరుగుపడింది. రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో వేడి గాలులు వీయనున్నాయని వాతావరణశాఖ(Meteorological Department) హెచ్చరిక జారీ చేసింది. ఈ సంవత్సరం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు. ఒడిశాలోని బౌద్‌లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 43.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఝార్సుగూడలో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్, బోలాంగీర్‌లో 41.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ 41.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బౌద్‌లో శనివారం ఉష్ణోగ్రతలు 42.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
ఒడిశాలోని పశ్చిమ ప్రాంతంలో ఆదివారం వేడిగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఏడు ప్రదేశాలలో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఝార్సుగూడ, సంబల్పూర్, కలహండిలకు సోమవారం వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మార్చి 19 నుండి నాలుగు రోజుల పాటు దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ సమయంలో వేడి నుండి కాస్త ఉపశమనం లభిస్తుందని వాతావరణశాఖ పేర్కొంది.
కాగా ఢిల్లీలో గాలి నాణ్యత వరుసగా రెండవ రోజు ఆదివారం సంతృప్తికరమైన విభాగంలోనే ఉంది. ఏక్యూఐ 99 వద్ద నమోదైంది. 2025లో గాలి నాణ్యత సంతృప్తికరమైన విభాగంలో నమోదైన మొదటి రోజు కూడా ఇదే. ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని, ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువని, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణశాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: ర్యాపిడ్ రైలు కారిడార్‌పై వర్క్ స్పేస్.. ప్రయోజనమిదే..
Comments
Please login to add a commentAdd a comment