మండుతున్న ఎండలు మన దేశాన్నే కాదు ప్రపంచంలోని పలు దేశాలను భయపెడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు అటు జనాలను, ఇటు జీవాలను మలమలమాడిపోయేలా చేస్తున్నాయి. కరువు బారిన పడిన దక్షిణ వియత్నాంను ఈ ఎండలు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
దక్షిణ వియత్నాంలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చేపలను బలి తీసుకుంటున్నాయి. 300 హెక్టార్లలో విస్తరించి ఉన్న ‘సాంగ్ మే’ చెరువులోని వేలాది చేపలు ఎండ వేడికి తాళలేక చనిపోయాయి. డాంగ్ నైలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. 1998లో ఈ ప్రాంతంలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రిజర్వాయర్ నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం కూడా చేపలు చనిపోవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత వేసవి కాలంటో 200 టన్నులకు పైగా చేపలు చనిపోయాయి. అత్యధిక ఉష్ణోగ్రత, నీటి కొరత కారణంగా ఈ చేపలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన చేపల వాసన గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో విపరీతంగా వ్యాపించడంతో ఇక్కడి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ చనిపోయిన చేపలను చెరువులో నుంచి తొలగించే పనిలో మత్స్యకారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం విచారణ ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment