
మండే సూరీడు..
జిల్లాలో ఉష్ణోగ్రతల్లో ఏమాత్రం మార్పులు రావడంలేదు. ఎండ ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ మృతులు రోజురోజుకూ పెరుగుతున్నారు.
►పెరుగుతున్న వడదెబ్బ మృతులు
►రెండురోజుల్లో 42 మంది మృతి
నెల్లూరు (అర్బన్) : జిల్లాలో ఉష్ణోగ్రతల్లో ఏమాత్రం మార్పులు రావడంలేదు. ఎండ ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ మృతులు రోజురోజుకూ పెరుగుతున్నారు. శుక్రవారం జిల్లాలో గరిష్టంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడక్కడా వడగాడ్పులు వీస్తున్నాయి. ఎండ సెగ తగ్గలేదు. తప్పని పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు వచ్చేందుకు సుముఖత చూపడంలేదు. జిల్లాలో వడదెబ్బతో గురువారం 16 మంది, శుక్రవారం 26 మంది మృతి చెందారు.
వడదెబ్బకు ఇంత మంది మృత్యువాత పడటం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా కలెక్టరేట్ అధికారులు శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులతో మాట్లాడారు. ఎవరైనా వడదెబ్బతో మృతిచెందారని తెలిస్తే స్థానిక తహశీల్దార్, ఎస్సై, మెడికల్ ఆఫీసర్ చేత విచారణ చేపట్టి ధ్రువీకరించాలన్నారు. అలాగే క్షేత్ర స్థాయి నుంచి వడదెబ్బకు గురై ఎవరైనా ఆసుపత్రులకు వచ్చారా? మృతి చెందారా? వివరాలు తెలుసుకుని పంపాలని సూచించారు. వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి బి.భారతీరెడ్డి అధికారులను ఆదేశించారు. వడదెబ్బ కారణంగా పీహెచ్‌సీలకు వచ్చే వారికి వెంటనే చికిత్స అందించాలని మెడికల్ ఆఫీసర్లుకు తెలిపారు.