ఎండలు మండుతున్నాయ్‌.. తస్మాత్‌ జాగ్రత్త..! | Prevention paths On Summer sun Stroke | Sakshi
Sakshi News home page

ఎండలు మండుతున్నాయ్‌.. తస్మాత్‌ జాగ్రత్త..!

Published Mon, Mar 26 2018 12:59 PM | Last Updated on Mon, Mar 26 2018 12:59 PM

Prevention paths On Summer sun Stroke - Sakshi

నిడమర్రు: ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చే రోజులు దగ్గరపడుతున్నాయి. దీంతో పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన పడి చిన్నా, పెద్దా అల్లాడిపోయే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో అసలు వడదెబ్బ అంటే ఏమిటి..?, దాని లక్షణాలు.. నివారణ మార్గాలు తెలుసుకుందాం.

వడదెబ్బ అంటే..
ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటాన్ని.. వడదెబ్బ అంటారు. చాలా వేడి వాతావరణం లేదా చురుకైన పనుల వల్ల కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీర ప్రాథమిక ఆవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి. దీంతో ఆ వ్యక్తి పూర్తిగా నీరసించి కుప్పకూలిపోతాడు.

వడదెబ్బ లక్షణాలు ఇవీ..
గుండె/నాడి కొట్టుకోవడం
వేగంగా/తక్కువగా శ్వాస తీసుకోవడం
చెమట పట్టకపోవడం
ఎక్కువ/తక్కువ రక్తపోటు
చిరాకు/కంగారు /అపస్మారక స్థితి
తలతిరగడం/తేలిపోవడం
తలపోటు/వికారం (వాంతులు)

ప్రాథమిక చికిత్స
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడపట్టుకు తీసురావాలి. ఆ వ్యక్తి శరీరాన్ని చల్లబరచాలి. వీలైతే రోగిని చల్లని నీటిలో ముంచాలి(టబ్‌ వంటివి ఉంటే) చల్లటి, తడిబట్టలలో చుట్టాలి, చల్లని తడిబట్టతో ఒళ్లతా అద్దుతూ ఉండాలి.
రోగి తాగగలిగితే చల్లని పానీయాలు ఇవ్వాలి. బట్టలు వదులుచే యాలి.
ఎటువంటి మందులు ఇవ్వరాదు, వెంటనే వైద్యులను సంప్రదించాలివడదెబ్బ బారిన పడకుండా ఇలా.
వేసవి కాలంలో డీహైడ్రేషన్‌ అధికంగా ఉంటుంది. కావున వాటర్‌ బాటిల్‌ను మీతో తీసుకెళ్లండి. వేసవికాలంలో నీరు శరీరాన్ని చల్లగా మారుస్తుంది.
ఎండ ఎక్కువగా ఉన్న సమయంనీడపట్టున/చల్లటి ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నించండి.
గుండె/ఊపిరితిత్తులు/మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరాలకు అధిక సూర్యరశ్మి ప్రభావంచే వారి శరీరం త్వరగా డీ  హైడ్రేషన్‌కు గురై వ్యాధి తీవ్రతలు అధికంగా ఉంటాయి.
ఆల్కహాల్‌/సిగిరెట్‌/కార్బొనేటెడ్‌ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటివల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్‌గ్లాసెస్, తలకు టోపీ వంటివి ధరించండి.
వేసవి కాలంలో బయటకు వెళ్లే అవసరం ఉంటే ఉదయం/సాయంత్రం సమయాల్లో వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి.
వేడి వాతావరణంలో శారీరక శ్రమకార్యకలాపాలు చేయటం అంత మంచిది కాదు. ఒకవేళ మీరు శారీరక శ్రమ కార్యకలాపాలు (శారీరక శ్రమ) చేసేటట్‌లైతే ఎక్కువ నీటిని/ఎక్కువ శక్తిని అందించే ద్రావణాలను తాగండి.
ఆహారంలో ఎక్కువగా ద్రవపదార్థాలు ఉండేలా చూసుకోవాలి, కారం, మసాలాలు లేని వంటలు తినడం ఉత్తమం
బయటకు వెళ్లిన సందర్భాల్లో టీ, కాఫీ, వేపుడు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌ మానెయ్యాలి. వాటి బదులు కొబ్బరి బొండాం నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి
ప్రయాణాల్లో సోడియం వంటి ఎలక్ట్రోలైట్‌ వంటి ద్రావణాలను తాగటం మంచిది వేసవి కాలంలో వాంతులు, అలసట, బలహీనంగా కనిపించడం, తలనొప్పి, కండరాలలో తిమ్మిరులు, మైకం వంటి లక్షణాలు బహిర్గతమైన వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.

వడదెబ్బకు వయసుతో నిమిత్తంలేదు
వడదెబ్బ ఏ వయసువారికైనా వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది మాత్రమే దీని బారిన పడతారు. వారిలో పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, అతిమూత్ర వ్యాధి ఉన్న వ్యక్తులు, మద్యం సేవించువారు, విపరీతమైన సూర్యరశ్మికి, వేడికి అలవాటు లేనివారు ఉంటారు. అలాగే కొన్ని ఇంగ్లీషు/ఆయుర్వేద మందులు కూడా మనిషిని వడదెబ్బకు గురయ్యేలా చేస్తాయి. దీంతో వారంతా వేసవికాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.–డాక్టర్‌ పత్సమట్ల సతీష్‌కుమార్‌రాజు, పత్తేపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement